కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏ ప్రాతిపదిక ఉండాలి ?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారుతుంది. అనే ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి. ఈ జిల్లాల విభజన సజావుగా జరుగుతుందా ?…

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారుతుంది. అనే ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి. ఈ జిల్లాల విభజన సజావుగా జరుగుతుందా ? అధికార వైసీపీలో వ్యతిరేక గళాలు వినిపిస్తాయా?

ఈ నెల 15  జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించబోతున్నారు. అంటే ఇప్పటికే అనధికార నిర్ణయం జరిగిపోయిందనే అర్ధం కదా. ఈ దశలో  శ్రీకాకుళం జిల్లాకు  చెందిన ధర్మాన ప్రసాదరావు వ్యతిరేక గళం వినిపించారు. దివంగత సీఎం వైఎస్సార్ జయంతి రోజునే  తన అభిప్రాయం బహిరంగంగా చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు ధర్మాన.  అంటే మంత్రిగా పనిచేశారన్న మాట. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు.  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  జగన్ తనకు మంత్రి పదవి ఇస్తారేమోనని ఆశ పెట్టుకున్నా నెరవేరలేదు.

ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి ఆంధ్రాలో తాను సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసినా జగన్ తనకు పదవి ఇవ్వలేదనే బాధ ఉండి ఉండొచ్చు. ఆ బాధ అసంతృప్తిగా మారి ఎప్పుడో ఒకప్పుడు లావాలా పొంగుతుంది కదా. ధర్మానకు కొన్నాళ్లుగా అలాగే పొంగుతోంది.

దాన్ని కడుపులో  ఎన్నాళ్లని దాచుకుంటారు ?  అందుకే జిల్లాల విభజనను వ్యతిరేకిస్తూ గళం విప్పారని విశ్లేషకులు అంటున్నారు.  ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడి ఉంటే ఎలా ఉండేదోగాని, బహిరంగంగా జిల్లాల విభజనను వ్యతిరేకించడంతో ఇది హాట్ టాపికైంది.

అందులోనూ ధర్మాన శ్రీకాకుళం జిల్లాకే చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం, తన సోదరుడు, మంత్రి అయిన ధర్మాన కృష్ణ దాస్ సమక్షంలోనే  జిల్లాల విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు.  వారిద్దరూ జగన్ కు పరమ విధేయులు. పైగా పదవుల్లో ఉన్నవారు. జిల్లాల విభజనకు సుముఖులు. దీంతో ధర్మాన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 15 న జరిగే మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నది.

ఇది కేవలం లాంఛనమే. అధికారంలోకి రాగానే జిల్లాల విభజన జరుగుతుందని జగన్ చెప్పారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లా  చేస్తామని చెప్పారు. అంటే ఈ లెక్కన 25 జిల్లాలు అవుతాయి. ప్రస్తుత జిల్లాల్లో ఒక్కోటి రెండుగానో మూడుగానో విభజితమవుతుంది. జిల్లాల విభజనపై  వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల మనస్సుల్లో ఏముందో తెలియదుగాని ఇప్పటివరకైతే ఎవరూ వ్యతిరేకించలేదు.

మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే తిరుగుబాటుదారుడు అనే ముద్ర వేస్తారు కదా. ఈ లెక్కన ధర్మాన తిరుగుబాటుదారుడు. ఆయన తన అభిప్రాయాన్ని సీఎం జగన్ కు వ్యక్తిగతంగా చెప్పారో  లేదో తెలియదు. బహిరంగంగా మాట్లాడారంటే చెప్పలేదనే అనుకోవాలి. కొత్త జిల్లాల ఏర్పాటుకు పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదిక కాదన్నారు ధర్మాన. ఇది అశాస్త్రీయ విధానం అని కూడా అన్నారు.

శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే రాజకీయంగా ప్రమాదమన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గాలు శాశ్వతం కాదని, భవిష్యత్తులో పునర్విభజన జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అలా జరిగినప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఏర్పాటు చేసే జిల్లాలు ఎక్కువ కాలం ఉండవని ధర్మాన అభిప్రాయం. శ్రీకాకుళం జిల్లా విభజనపై తమ  అభిప్రాయాలు తీసుకోవాలని, తమను సంప్రదించకుండా విభజన చేయవద్దని ధర్మాన ప్రసాద రావు జగన్ ను కోరారు.

ఇతర జిల్లాల నాయకులతోనూ సంప్రదించాలని ధర్మాన పరోక్షంగా చెప్పారన్న మాట. ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ లేని శ్రీకాకుళం జిల్లాను ఊహించుకోవడానికే భయంగా ఉందని ధర్మాన కామెంట్ చేశారు. కొత్త జిల్లాల  ఏర్పాటును తాను వ్యతిరేకించడంలేదని, కానీ విధానం ఇది కాదని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాల ఏర్పాటు వద్దంటున్న ధర్మాన శాస్త్రీయ విధానమేమిటో చెప్పాలి కదా . 

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు