ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందించడానికే వైద్య సిబ్బంది జంకుతున్న పరిస్థితి. అలాంటిది రోగి మరణిస్తే, అతని అంత్యక్రియలకు కన్నబిడ్డలే దూరంగా ఉంటే, కుటుంబ సభ్యులే మొహం చాటేస్తే.. వాటికి దహన సంస్కారాలు ఎవరు చేయాలి? ఎలా చేయాలి? రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కరోనా మృతదేహాల్ని హీనంగా చూస్తున్నారంటూ చిన్నా చితకా నేతలంతా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మానవత్వం చచ్చిపోయింది, ప్రభుత్వం బాధ్యత మరచింది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
అవును మానవత్వం నిజంగానే చచ్చిపోయింది. కన్నతండ్రి కరోనాతో చనిపోయాడని తెలిస్తే తలకొరివి పెట్టాల్సిన కొడుకు ఆ శవాన్ని వదిలేసిన రోజే మానవత్వం చచ్చిపోయింది. సొంత తోబుట్టువులు చివరి చూపుకి రాలేదన్నప్పుడే మంచితనం మాయమైంది. అలాంటిది ప్రభుత్వం కరోనా శవాలను ఎలా ట్రీట్ చేయాలి? పైనుంచి ఆదేశాలేవీ లేవు, ఎవరిని పిలిచినా రారు, చివరికి ఏ ట్రాక్టర్లోనే, జేసీబీలోనే తీసుకెళ్లి ఖననం చేయాల్సిన పరిస్థితి.
శ్మశాన వాటికలకు తీసుకెళ్లాలంటే.. చుట్టుపక్కలవారు తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్థరాత్రో, అపరాత్రో ఎవరూ చూడకుండా మృతదేహాల్ని తీసుకెళ్లి పూడ్చేసి వస్తున్నారు. అప్పటికీ అంబులెన్స్ సిబ్బంది, కిందిస్థాయి ఉద్యోగులు ధైర్యం చేసి మృతదేహాల్ని పట్టుకెళ్తున్నారు. కనీసం వారి పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. శవాన్ని తీసుకెళ్లడానికి సొంత బిడ్డలే ధైర్యం చేయలేని సందర్భంలో.. కనీసం వారు దహన సంస్కారాలయినా చేస్తున్నారు.
వారి ధైర్యాన్ని మెచ్చుకోనక్కర్లేదు, వారి మానవత్వాన్ని అభిందించక్కర్లేదు, కనీసం ఇలా వీడియోలు తీసి మిగతావారి మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటే చాలు. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని.. అలాంటి వీడియోలు తీసి, కింద చెత్త కామెంట్లు పెట్టి, ప్రభుత్వాన్ని, అధికారుల్ని తిట్టకుండా ఉంటే చాలు. కానీ శవాలపై పేలాలు ఏరుకునే ప్రతిపక్షాలు కరోనా మృతదేహాల్ని కూడా వదల్లేదు.
అయ్యో అన్యాయం జరిగిపోయింది, అయ్యో పెద్ద ఘోరం జరిగిపోయింది అంటూ.. చంద్రబాబు సహా అందరూ గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశం లేదని తెలిసి కూడా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ప్రతిపక్షాలకే చెల్లింది. అయితే ప్రతిపక్షాల విమర్శల్ని పక్కనపెడితే.. ప్రభుత్వం కూడా కరోనా మృతదేహాల దహన సంస్కారాలపై కచ్చితమైన విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మృతదేహాల్ని ఎక్కడకి తరలించాలి, బంధువులకు అప్పగించాలా వద్దా, దహన సంస్కారాలు ఎక్కడ, ఎవరి సమక్షంలో చేయాలి వంటి విషయాలపై సిబ్బందికి క్లారిటీ ఇస్తే మంచిది. లేకపోతే ఇలాంటి విమర్శలను మరిన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.