శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెత్త పన్నుల గురించి మాట్లాడిన మాటలలో వాస్తవం ఉంది. అయితే ఆయన చెప్పిన దాని కంటే ఆయన చెత్త పన్ను కట్టలేరా అంటూ జనాలను నిలదీయడమే వివాదానికి దారి తీస్తోంది. దాంతో ఇది విపక్షాలకు ఆయుధంగా మారిపోయింది.
నిజానికి ధర్మాన ప్రసాదరావు అన్నది కనుక ఆలోచిస్తే లాజిక్ గా కరెక్ట్ అనే చెప్పాలి. ఒకనాడులా ఇపుడు చూస్తే ఊరి చివర మొదలు అంటూ ఎక్కడా లేదు, ఎటు చూసినా ఇళ్ళే ఉన్నాయి. దాంతో గతంలో మాదిరిగా ఒక చోట సేకరించిన చెత్త ఊరి చివర డంప్ చేయడం కుదరదు, ఎక్కడ చెత్త వేసినా అక్కడ జనాలు వ్యతిరేకిస్తారు.
దాంతో చెత్తను ఆధునిక విధానంలో ప్రాసెస్ చేసి ఇతర అవసరాలకు వినియోగించాలనే మునిసిపాలిటీ అధికారులు చూస్తున్నారు. అలాంటపుడు చెత్తకు కూడా ఖర్చు అవుతుంది. ఒక ఇంటి నుంచి చెత్తను సేకరించి దాన్ని ప్రాసెస్ చేసేంతవరకూ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అందువల్ల దానికి కానీ ప్రతీ ఇంటి నుంచి వంద రూపాయలు చెత్త పన్నుగా ప్రభుత్వం విధించింది.
అయితే దాని మీద విపక్షాలు చెత్త పన్నేంటి అంటూ ఇప్పటికీ విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే ధర్మానా మాట్లాడిన మాటలు కూడా తోడు అయ్యాయి. చెత్తకు డబ్బులు ఇవ్వకపోతే వారి ఇంటి ముందు చెత్తను అలా వదిలేయండి అంటూ ఆయన చెప్పడం కొత్త వివాదం అవుతోంది.
ధర్మాన చెత్త ప్రాసెస్ గురించి ఖర్చు అయ్యే తీరు గురించి చెప్పినది అంతా బాగున్నాపన్ను కట్టని వారి ఇంటి ముందు చెత్తను తీయవద్దు అన్నదే ఇపుడు విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి చెత్త మీద కొత్త చెత్త విమర్శలతో మరో మారు వైసీపీ సర్కార్ తో అంతా చెడుగుడు ఆడుతున్నారు.
ఇక్కడ మరో మాట కూడా ఉంది. చెత్తకు ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరించవచ్చు కదా అని. అలాగే ఎంతో కొంత తగ్గించవచ్చు కదా అని. ఇన్నేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం దాని విషయంలో కూడా ఆలోచిస్తే పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఊరటగా ఉంటుందేమో. లేకపోతే పధకాలను కొన్ని తగ్గించుకు అయినా ఆ ఖర్చు అటు వైపు మళ్ళించినా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని సూచిస్తున్నారు.
ఎన్నో పధకాలు మీకు అమలు చేస్తున్నాం, చెత్త పన్ను కట్టండి అని జనాలకు అడిగినా నిలదీసినా అది బూమరాంగ్ అవుతుంది తప్ప కట్టేవారు ఎవరూ ఉండరు. ఈ ధర్మ సూక్ష్మాన్ని ధర్మాన వంటి వారు గ్రహిస్తే మంచిదేమో. అలా ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇచ్చినా బాగుంటుందేమో.