'ఇప్పుడున్న టికెట్ రేట్లతో నా సినిమాకు ఎలాంటి సమస్య లేదు. మిగిలిన వారి సంగతి నాకు తెలియదు. టికెట్ ధర ఎక్కువ పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి, లేకపోతే తక్కువ వస్తాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో ఇబ్బంది లేదు..' అని వ్యాఖ్యానించారు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున. ఈ హీరో నటించిన బంగర్రాజు సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతోంది. అన్నీ సవ్యంగా ఉంటే తన సినిమా విడుదల అవుతుందని చెప్పిన నాగార్జున… బర్నింగ్ టాపిక్ గా ఉన్న టికెట్ రేట్ల అంశంపై స్పందించిన తీరు కొంతమందికి మింగుడు పడేలా లేదని వేరే చెప్పనక్కర్లేదు.
ఈ మింగుడు పడని కేటగిరిలో స్టార్ హీరోలు ఉన్నారు, స్టార్ హీరోల అభిమానులూ ఉన్నారు! టికెట్ రేట్లను వీలైనంతగా పెంచుకునే అవకాశం ఇచ్చి, తమ అభిమాన హీరోలు వందల కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకోవాలని కొంతమంది వీరాభిమానులు విపరీతంగా వాంఛిస్తూ ఉన్నారు. టికెట్ రేట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించడాన్ని వీరు అస్సలు సహించలేకపోతున్నారు. ఈ చింత పెట్టుకుని.. వీరు కనీసం అన్నపానియాలు అయినా ముడుతున్నారో లేదో పాపం!
ఇలాంటి వారికి నాగార్జున ప్రకటన అస్సలు సయించకపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో సగటు టికెట్ ధర వంద రూపాయల నుంచి నూటా యాభై రూపాయల వరకూ ఉంది. ఉన్న వాటిల్లో నూటికి 90 శాతం థియేటర్లు మున్సిపాలిటీ, మేజర్ పంచాయతీ స్థాయి పట్టణాల్లో ఉన్నాయి. వీటిల్లో కూడా వందకు వంద శాతం ఏసీ థియేటర్లే. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. చూసుకుంటే, సగటున టికెట్ ధర వంద నుంచి నూటా యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు!
ఇక ఐదు రూపాయల టికెట్ కేటగిరి మాత్రమే కాదు, ఇరవై రూపాయల టికెట్ కేటగిరిలోకి వచ్చే థియేటర్లు ఏపీలో వెదికినా కనపడవు. సినిమా టికెట్లు తగ్గిపోయాయని ఇంతలా ఆందోళన చెందుతున్న వీరాభిమానులు కూడా ఎక్కడా.. ఐదు రూపాయల టికెట్ తీసుకుని దాని ఫొటోను సోషల్ మీడియాలోకి షేర్ చేయలేదు! ఎందుకంటే.. ఎక్కడా అలాంటి టికెట్లు దొరకవు కాబట్టి. ప్రభుత్వ జీవో డీటెయిల్డ్ గా ఉండాలి కాబట్టి.. ఇచ్చిన నంబర్లను పెట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు కానీ, వంద రూపాయల ధరతో ఏపీలో ఇప్పుడు టికెట్ కొనడం అసంభవం లాంటిదే!
సినిమా వాళ్ల బాధల్లా తొలి వారం టికెట్ ను వెయ్యి రూపాయలు, రెండు వేలు పెట్టి అమ్ముకునేందుకు లేకుండా పోయిందనే! బహుశా ఈ విషయంలో నాగార్జునకు పట్టింపు లేకపోవచ్చు. అందుకే.. ఉన్న టికెట్ల ధరతో తనకే ఇబ్బంది లేదని స్పష్టం చేశాడు. మరి ఇక నాగార్జునపై టికెట్ల రేట్లు వేల రూపాయల్లో ఉండాలనే బ్యాచ్ విరుచుకుపడటమే మిగిలింది! నాగార్జున కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత, స్టూడియో ఓనర్ కూడా. మరి సినిమా వ్యాపారంలో తనమునకలైన వ్యక్తి ఇబ్బంది లేదంటున్నాడంటే, ఇబ్బందిగా ఫీలయ్యే వారు ఏమంటారో!