ముస్లింలను వైసీపీకి దగ్గర చేస్తున్న బీజేపీ!

ఆత్మహత్యతో సమానమైన మాటలు అనేసి.. బురద అంటించుకున్న భారతీయ జనతా పార్టీ ఆ బురదను కడుక్కోడానికి ఓ మతవాద సున్నితమైన అంశాన్ని నెత్తికెత్తుకుంది. తమ అసహ్యమైన చీప్ లిక్కర్ మాటలను అందరూ మరచిపోయి.. తమ…

ఆత్మహత్యతో సమానమైన మాటలు అనేసి.. బురద అంటించుకున్న భారతీయ జనతా పార్టీ ఆ బురదను కడుక్కోడానికి ఓ మతవాద సున్నితమైన అంశాన్ని నెత్తికెత్తుకుంది. తమ అసహ్యమైన చీప్ లిక్కర్ మాటలను అందరూ మరచిపోయి.. తమ మాయలో పడి.. కొత్త మతవాద ఎజెండాకు జైకొడతారని తప్పుడు వ్యూహాన్ని అనుసరించింది. అయితే.. ఇప్పుడు పరిణామాలను గమనిస్తోంటే.. బీజేపీ వారి ఎత్తుగడ ఫలితంగా.. ముస్లిం ఓటు బ్యాంకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత దగ్గరయ్యేలా కనిపిస్తోంది. అవును ఇదంతా.. గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ రేగుతున్న వివాదం గురించే.

జిన్నా టవర్ ను కూల్చివేయాలని, జిన్నా సెంటర్ పేరు మార్చాలని భారతీయ జనతా పార్టీ ఒక కొత్త వివాదం లేవనెత్తింది. చీప్ లిక్కర్ యాభై రూపాయలకే అమ్మే అసహ్యమైన వాగ్దానం తర్వాత.. వచ్చిన అప్రతిష్టను తుడిచేసుకోడానికి వారి మత ఎత్తుగడ ఇది. బీజేపీ నాయకులంతా ఇదే వాదనతో నానా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. పేలవమైన తమ మాటలతో.. ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు. జిన్నా టవర్ అనే పేరు చెప్పగానే.. హిందూ మతవాదులంతా తమను నెత్తిన పెట్టుకుంటారని కలగన్నారేమో గానీ.. అంత రెస్పాన్స్ లేదు. 

పైగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చాలా స్పష్టంగా.. గతంలో ఎప్పుడెప్పుడు జిన్నాను, బీజేపీ అగ్రనేత అద్వానీ ఏ రకంగా కీర్తించారో.. తన కీర్తనలన్నీ నిజమే అని కూడా అన్నారో.. ఆ కబుర్లన్నీ బయటపెట్టారు. జిన్నా టవర్ అనేది మతసామరస్యానికి ప్రతీక అన్నారు. తాజాగా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా.. జిన్నా టవర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. జిన్నా టవర్ ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని ఆయన అంటున్నారు. 

ఏతావతా కనిపిస్తున్నదేంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రమే.. జిన్నా టవర్, జిన్నా సెంటర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీతో అంటకాగుతున్న జనసేన కిక్కురుమనడం లేదు. ముస్లింలు ఎలా పోయినా తనకు ఫరక్ లేదన్నట్టుగా పవన్ కల్యాణ్ మిన్నకున్నారు. 

నేడోరేపో బీజేపీతో బంధం ముడేసుకుని.. ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటున్న తెలుగుదేశం కూడా స్పందించడం లేదు. ఈనేపథ్యంలో.. మొత్తం జిన్నాటవర్ వ్యవహారంలో ముస్లింలకు అనుకూలంగా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే మాట్లాడుతోంది. అన్ని పార్టీలూ కలిపి… ముస్లింలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువగా చేస్తున్నారు.