తెలంగాణ రాష్ట్ర సమితిపై భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడుతూ ఉండగా, టీఆర్ఎస్ తో పోరుకు బీజేపీ అధినాయకులే రంగంలోకి దిగిన నేపథ్యంలో, కమలం పార్టీపై కౌంటర్ అటాక్ ను మొదలుపెట్టింది టీఆర్ఎస్.
టీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న విమర్శల్లో ప్రధానమైనది కుటుంబ పార్టీ అనేమాట. కేవలం టీఆర్ఎస్ నే కాదు.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కుటుంబ పార్టీలు అంటూ బీజేపీ వాళ్లు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. దాన్నో విమర్శగా మార్చుకున్నారు. కాంగ్రెస్ తో సహా అన్నీ వారసత్వ పార్టీలు అని, తమది మాత్రం ప్రత్యేకం అంటూ బీజేపీ వాళ్లు చెప్పుకుంటూ ఉన్నారు.
అయితే ఆ మధ్య జాబితా తీస్తే.. బీజేపీలో బోలెడంత మంది వారసులు రాజకీయ పదవులను అనుభవిస్తూ ఉన్నారు. కానీ, బీజేపీ మాత్రం తమది వారసత్వ పార్టీ కాదని అంటుంది. మోడీ కుటుంబీకులు ఎవరైనా పదవులు చేపడితే తప్ప… తమది కుటుంబ పార్టీ కాదని, వారసత్వ పార్టీ కాదని వాదించవచ్చని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది.
అయితే.. ఈ విషయంపై టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, అమిత్ షా తనయుడి సంగతి ఏమిటి? అంటూ ప్రశ్నించాడు. బీసీసీఐ కి సంబంధించి కీలక పదవిలో ఉన్నాడు అమిత్ షా తనయుడు జై షా. ఆయనకు ఆ పదవి ఎలా వచ్చిందంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అమిత్ షా తనయుడు రాజకీయ పదవిలో లేకపోవచ్చు గాక.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడా బోర్డులలో ఒకటైన బీసీసీఐలో జై షా ఎలా చక్రం తిప్పగలుగుతున్నారనే ప్రశ్నకు బీజేపీ ఎలా సమాధానం ఇస్తుందో మరి!
వాస్తవానికి ఆ మధ్య బీసీసీఐ లో లోథా సంస్కరణలు అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ సంస్కరణలు అమలు చేస్తే.. గంగూలీతో సహా అనేక మంది ఇప్పుడు అనుభవిస్తున్న పదవులకు దూరంగా ఉండాలి. రాజీనామా చేసి పక్కకు వెళ్లాలి. అయితే లోథా సంస్కరణల గురించి ఇప్పుడు అడిగే వారు కూడా ఎవరూ లేరు! అడిగే ధైర్యమూ ఎవరికీ లేనట్టుంది!