అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రజానిరసనలంటే మోడీకి భయం!

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది! ప్రజల నిరసనజ్వాలల సెగ ఆయనకు తగిలింది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకోసం పంజాబ్ యాత్ర పెట్టుకున్న నరేంద్రమోడీ.. అర్థంతరంగా తిరిగి వెళ్లారు. ప్రజల నిరసన ఆయన…

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది! ప్రజల నిరసనజ్వాలల సెగ ఆయనకు తగిలింది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకోసం పంజాబ్ యాత్ర పెట్టుకున్న నరేంద్రమోడీ.. అర్థంతరంగా తిరిగి వెళ్లారు. ప్రజల నిరసన ఆయన కాన్వాయ్ ను స్తంభింపజేసింది. పీఎం అసహనానికి గురయ్యారు. ప్రధానికి వ్యతిరేకంగా రోడ్డుమీద ధర్నా రూపంలో ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి పర్యటన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని.. వెనుతిరిగి వెళ్లిపోయారు.

సాధారణంగా.. ప్రధాని నరేంద్రమోడీ జనం స్వాగతాలు, హర్షధ్వానాలు, జేజేలు మాత్రమే ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారా? అనిపిస్తుంది. ప్రజలు నిలదీస్తే.. ఏమైంది. ప్రజల్లో కలిసిపోయే ప్రధానిగా పలుసందర్భాల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించే నరేంద్రమోడీ..నేరుగా వెళ్లి వారితోనే మాట్లాడవచ్చు కదా. అక్కడి పోలీసు విఫలమయ్యారు అని ఆయన ఆరోపిస్తున్నారు సరే.. తన చుట్టూ బీభత్సమైన సెక్యూరిటీ వలయం ఉంటుంది కద. కానీ ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రజాందోళనలపై అసహనం ఆపుకోలేకపోయారు. తాను కూడా అందరి రాజకీయ నాయకులలాంటి వాడినే అని.. ఏమాత్రం భిన్నం కాదని.. మరోసారి నిరూపించుకున్నారు. 

ప్రజాగ్రహాలను చవిచూడడానికి, ఆందోళను ఎదుర్కోవడానికి.. ఇంకా వీలైతే ఆందోళన వ్యక్తం చేసే వారితో నేరుగా మాట్లాడి వారిని శాంతింపజేయడానికి తగిన సహనం తెగువ తనకు లేవని ప్రధాని నరేంద్రమోడీ చాటుకోవడం ఇది కొత్త కాదు. గతంలో తమిళనాడులో ఓ సందర్భంలో ప్రధాని పర్యటన ఉండగా.. కావేరీ జలాల పంపకం విషయమై.. కేంద్రం నిర్లిప్తత, ఉదాసీన ధోరణిగురించి అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రధాని మోడీ చెన్నై యాత్ర పెట్టుకున్నారు. 

తాను ఎక్కడకు వెళ్లినా సరే.. రోడ్డుకు ఇరువైపులా బార్లు తీరి చేతులు ఊపే ప్రజలను చూడడానికి అలవాటు పడిన మోడీ.. చెన్నైలో కూడా ఎయిర్ పోర్ట్ నుంచి కార్యక్రమ వేదిక వరకు రోడ్డు మార్గంలో వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. తీరా.. అక్కడకు వెళ్లాలక తమిళుల నిరసనలు మిన్నంటుతున్నాయి. దాంతో అప్పటికప్పుడు ప్రోగ్రాం మార్చుకుని రోడ్డు మార్గంలో కాకుండా.. హెలికాప్టర్ ద్వారా వెన్యూ చేరుకున్నారు. అయినా తమిళులు వదల్లేదు. నల్లటి బెలూన్లను గాల్లోకి ఎగరవేసి.. ఆయన హెలికాప్టర్ వెళుతున్న సమయంలో నిరసన తెలిపారు. 

ఇప్పుడు పంజాబ్ లో రివర్స్ లో జరిగింది. ఆయనకు ప్రజలు నిరసన తెలియజేస్తారని ముందే సమాచారం ఉన్నట్టుంది. భటిండా ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో కార్యక్రమాలకు వెళ్లాలనేది షెడ్యూలు. తీరా అక్కడకు వెళ్లాక వాతావరణం సరిలేక హెలికాప్టర్ లో వెళ్లలేని పరిస్థితి. దీంతో.. రోడ్డు మార్గం పట్టారు. ఆయన షెడ్యూలు అప్పటికప్పుడు మారింది.. అయినా సరే.. అక్కడి ప్రజలు… రోడ్డు మార్గంలో వస్తున్న మోడీని అటకాయించి నిరసన తెలియజేయడానికి పూనుకున్నారు. ఆయన ఫ్లైఓవర్ మీదనే ఆగిపోవాల్సి వచ్చింది. 

అయితే తేడా ఏంటంటే.. తమిళనాడులోలాగా ఆయన కార్యక్రమం పూర్తి చేయలేకపోయారు. పంజాబులో వెనుదిరిగి వెళ్లిపోయారు. మొత్తానికి ప్రజాగ్రహాలను, ఆందోళనలు స్వీకరించే విషయంలో అందరు నాయకుల్లాగానే తనకు కూడా సహనం లేదని చూపించారు.