మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఉన్నట్లుండి ఫైర్ అయ్యారు. ఆయన సొంత ప్రభుత్వం మీదనే ఇండైరెక్ట్ గా బాణాలు వేశారనుకోవాలి. అయితే అధికారులదే తప్పు అని ఆయన మాట్లాడం విశేషం. మరి అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ధర్మాన హాట్ కామెంట్స్ ఇపుడు చర్చకు తావిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లు అంతా పుట్టెడు నష్టాలతో ఉన్నారంటూ ధర్మాన చెబుతున్నారు. సిమెంట్, ఐరన్, ఇసుక రేట్లు బయట మార్కెట్లో దారుణంగా పెరిగిపోయాయని, ఈ పరిస్థితులలో ఎటూ చాలని రేట్లతో ప్రభుత్వ పనులు చేయమంటే ఎవరైనా చేతులెత్తేస్తారు అంటూ ధర్మాన చెప్పడం విశేషం.
మరో వైపు ప్రభుత్వం నుంచి సిమెంట్ సరఫరా జరగడంలేదని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వ పనులను భుజాలకు ఎత్తుకున్న కాంట్రాక్టర్లు ఆర్ధికంగా దారుణంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని ఆయన వాపోయారు. కొందరు అధికారులు సరైన సమాచారం ప్రభుత్వానికి చెప్పడంలేదని, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను చెప్పడం లేదని ఆయన ఆరోపించారు.
మొత్తానికి గ్రామ స్థాయిలలో జరిగే ప్రభుత్వ పనులు సరిగ్గా పూర్తి కాకపోవడానికి అసలు తప్పు అరకొర రేట్లతో కాంట్రాక్టర్లకు ఇబ్బంది పెడుతున్న అధికారులదే అంటూ తేల్చేశారు. ప్రభుత్వ పని అంటే కాంట్రాక్టర్లు పారిపోతున్నారని కూడా ఆయన అంటున్నారు. మరి ధర్మాన సడెన్ గా ఈ అంశం ఎత్తుకుని గట్టిగానే మాట్లాడారు. ఇదిపుడు అధికార పార్టీలో సంచలనంగానే ఉంది మరి.