షర్మిలకు జగన్ కష్టాలు తెచ్చి పెట్టాడా ?

రాజకీయ నాయకులు ఏ పని చేసినా దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో నిజాలెన్నో, అబద్దాలు ఎన్నో, ఊహాగానాలు ఎన్నో, పుకార్లు ఎన్నో తెలియదు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టక ముందు…

రాజకీయ నాయకులు ఏ పని చేసినా దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో నిజాలెన్నో, అబద్దాలు ఎన్నో, ఊహాగానాలు ఎన్నో, పుకార్లు ఎన్నో తెలియదు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టక ముందు షర్మిలకు, జగన్ కు మధ్య సంబంధాలు బాగా ఉన్నాయి. వారి అనుబంధం బలంగా ఉండేది. స్వల్ప అభిప్రాయం భేదాలు ఉంటే ఉండొచ్చేమోగానీ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బ తినేంతగా లేవని చెప్పొచ్చు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు వైఎస్సార్ సీపీ ఉనికిని కాపాడింది షర్మిల అనే సంగతి అందరికీ తెలుసు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన షర్మిల అప్పట్లో ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఒక మహిళ అయివుండి కూడా ఆమె సాహసోపేతమైన పాదయాత్ర చేశారు. జగన్ జైలు నుంచి విడుదల కాగానే రాజకీయాల్లో తన పాత్ర విరమించుకున్నారు. అప్పట్లో జగన్ కు సన్నిహితుడు, సాక్షి పత్రిక ఆదివారం అనుబంధం ఫన్ డే ఎడిటర్ గా ఉన్న ప్రియదర్శిని రామ్ షర్మిలతో ఇంటర్వ్యూ చేశారు. అందులో షర్మిల తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, వైఎస్సార్ సీపీలో తన జోక్యం ఉండదని చెప్పారు.

కానీ రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల సమయంలో షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారని కానీ అందుకు జగన్ ఒప్పుకోలేదని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని షర్మిల కాపాడినా జగన్ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వలేదని, 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదని, జగన్ ఆమెకు అన్యాయం చేశాడని ప్రచారం సాగింది. మొత్తం మీద జగన్ తో కలహాల కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణమనే ప్రచారం జరిగింది.

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక పత్రిక ఈ ప్రచారం బాగా చేసింది. వైఎస్సార్ సీపీ తెలంగాణా బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే బాగుంటుందని జగన్ కు కొందరు చెప్పారట. చెప్పినవారిలో కుటుంబ సభ్యులూ ఉండొచ్చు. కానీ జగన్ ఒప్పుకోలేదట. దీంతో తెలంగాణలో తన సత్తా చాటాలని షర్మిల పార్టీ పెట్టిందట. వైఎస్సార్ కూతురిగా పరిస్థితి తనకు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుందని ఆమె ఆశించింది. కానీ అందుకు భిన్నంగా ఉంది. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ గురించి చాలామంది రాజకీయ నాయకులు లైట్ తీసుకున్నారు. బోల్డంత డబ్బు ఖర్చు చేసి, పార్టీని జనంలోకి తీసుకెళ్ళేందుకు షర్మిల ప్రయత్నించారు. ఖమ్మంలో సభ, హైద్రాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు.. వీటన్నిటికీ చాలానే ఖర్చయ్యిందట. ఇవి కాక, పార్టీ నడిపేందుకోసం జరిగిన ఖర్చులు అదనం. 

ఇంతా చేసి, షర్మిల ఏం సాధించారు.? అంటే, ఏమీ లేదన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో షర్మిల పార్టీ ఆ దిశగా సమాలోచనలు చేసి, కీలక నిర్ణయం తీసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పోటీ పెట్టకపోవడంపై షర్మిల ఇచ్చిన వివరణ కూడా అర్థరహితంగానే ఉంది. పోటీ చేస్తాం.. అని గనుక షర్మిల ప్రకటించి వుంటే, హుజూరాబాద్ నుంచే షర్మిల పార్టీ బలం ఎంత.? అన్నదానిపై జనానికి ఓ క్లారిటీ వచ్చేది. కానీ, ఆ అవకాశాన్ని ఆమె చేజార్చుకుంటున్నారు. ఈలోగా పార్టీలోంచి నేతలు జారిపోతున్నారు. అలాంటప్పుడు, తెలంగాణ రాజకీయాల్లో ఏం చేద్దామని ఆమె అనుకున్నారు.? 

షర్మిల పార్టీ పెట్టి కొద్దీ కాలమే అయింది కాబట్టి ఆమెకు అంగబలం, అర్ధబలం కూడా అంతగా ఉండకపోవచ్చు. హుజూరాబాద్ పై ఆమె దృష్టి పెట్టకపోవడానికి ఇది కూడా కారణమా? షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షలకు తెలంగాణా పత్రికలూ పెద్దగా కవరేజి ఇవ్వడం లేదు. తాను త్వరలో పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించింది. ఆ పని చేశాక ఆమెకు పొలిటికల్ మైలేజి పెరుగుతుందేమో చూడాలి.