ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత వీడ్కోలు సభను ప్రభుత్వ తరపు న్యాయవాదులు బహిష్కరించారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరు కాకుండా… మొక్కుబడిగా తన ప్రసంగ పాఠాన్ని పంపడం గమనార్హం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితను ఇటీవల తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.
బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వెళుతున్న ఆమెకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ లలిత న్యాయసేవల్ని చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రతో పాటు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ కొనియాడారు.
ఇదే సందర్భంలో ఏజీ శ్రీరామ్ తరపున ఆయన ప్రంసంగాన్ని జానకీరామిరెడ్డి చదివి వినిపించడం గమనార్హం. అనారోగ్య కారణంగా శ్రీరామ్ సభకు హాజరు కాలేదని చెబుతున్నారు. ఆయన రాలేకపోతే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఇతర ప్రభుత్వ న్యాయవాదులైనా వెళ్లి వుండొచ్చు. వాళ్లు అటు వైపు వెళ్లినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. దీన్నిబట్టి ఆమె వీడ్కోలు సభను ప్రభుత్వ తరపు న్యాయవాదులు బహిష్కరించారనే చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది.
గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్‌కు సీఎం జగన్ చేసిన ఫిర్యాదులో లలిత పేరు కూడా ఉండడాన్ని గుర్తించుకోవాలి. అలాంటప్పుడు ఆమె న్యాయసేవల్ని ఏమని ప్రశంసిస్తారని ఒక న్యాయవాది విలువైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అలాగే ఇటీవల సీఎం జగన్‌ను దూషించిన కేసులో 24 గంటలు కూడా గడవకనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి జస్టిస్ లలిత బెయిల్ ఇవ్వడాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకున్నారు. ఇదే తమపై అసభ్యకర పోస్టింగులు పెడితే మాత్రం సీబీఐ విచారణలు, రోజుల తరబడి జైల్లో ఉంచుతుండడాన్ని ఏపీ అధికార పార్టీ గుర్తు చేస్తోంది.
ఇలా అనేక అంశాలు జస్టిస్ లలిత, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణాలయ్యాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆమె వీడ్కోలు సభకు ప్రభుత్వ న్యాయవాదులెవరూ వెళ్లకపోవడాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుందేమో!