తెలంగాణా ప్రభుత్వం పట్ల ప్రజల్లో ప్రతికూలత పెరుగుతోంది. ప్రధాన కారణం- జనానికి బోరు కొడుతోంది.
ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయాలు లేక, ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నేతలు లేక కీసీయార్ ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింది. ఇప్పుడు ఆ పరిస్థితి కొనసాగడం కష్టతరమవుతోంది.
బీజేపీ తెలంగాణారాష్ట్రంలో పాగా వేస్తోంది. ఈటెల రాజేందర్ తిరుగుబాటు తెరాసకి పెద్ద దెబ్బ.
చాలానాళ్లుగా తెరాసలో చీలిక వస్తుందని వేచి చూస్తున్న ఒక వర్గానికి ఈటెల తిరుగుబాటు దృష్టిని ఆకర్షించింది.
అంతే కాదు ఉప ఎన్నికలో ఆయనకి హుజూరాబాద్ ప్రజలు విజయం కట్టబెట్టారంటే తెరాసపై తిరుగుబాటుని స్వాగతించినట్టే.
తెరాస ఎంత ఖర్చుపెట్టినా, ఎంత మభ్యపెట్టినా, ఎన్ని బీరాలు పలికినా, ఎన్ని బేరాలాడినా జనం కారునొదిలి కమలాన్ని కటాక్షించారు. ఇవన్నీ యాంటీ ఇంకంబెన్సీకి సంకేతాలే.
2014లో రాష్ట్రం విడిపడిన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తి, సెంటిమెంటు, ఆ వేడి సహజంగా కొన్నాళ్లు కొనసాగింది.
వారసుడు కేటీయార్ కూడా సమర్ధవంతమైన పని తీరు కనబరచి రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపే దిశగా అడుగులేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలుగజేసారు.
కేసీయార్ సంక్షేమానికి, కేటీయార్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా కనిపించేవారు. కానీ ఇప్పుడు కొత్త మెరుపులేవీ మెరవట్లేదు.
బాహుబలి మొదటి భాగం ఎంత హిట్టైనా ఆ సినిమానే చూస్తూ కూర్చోమంటే జనం చూడరు. అంతకంటే గొప్పగా ఊహించని విధంగా ద్వీతీయ భాగం వచ్చింది కాబట్టి దానిని మొదటి భాగం కంటే పెద్ద హిట్ చేసారు.
ప్రభుత్వాలైనా అంతే. ఫస్ట్ ఇంప్రెషన్లో ఎంతగా ఆకట్టుకుంటారో అవే పాయింట్స్ తో మళ్లీ మళ్లీ గెలిపించమంటే జనం గెలిపించరు. అంచనాలు అందుకోవడం వల్ల తొలి విజయం వస్తే, ఊహించనంత గొప్పగా పరిపాలన కనిపిస్తేనే మళ్లీ మళ్లీ విజయం రాదు. అందుకే వరుసగా రెండుసార్లు కంటే ఎక్కువ ఒకే ప్రభుత్వానికి జనం పట్టం కట్టరు.
ఇప్పుడు తెరాసకి బీజేపీ గండం పొంచి ఉంది. అదృష్టం బాగుండి కాంగ్రెసు సారధిగా రేవంత్ ఉన్నా ఆ పార్టీవైపు జనం రెండవ ప్రత్యామ్నాయంగా చూడట్లేదు. బీజేపీనే చూస్తున్నారన్నది నిస్సందేహం. హుజూరాబాద్ గెలుపు తర్వాత కేసీయార్ పై మాటలతో దీటుగా విరుచుకుపడేందుకు ధర్మపురి అరవింద్ లాంటివాళ్లు తయారవుతున్నారు. వీరికి తీన్ మార్ మల్లన్న తోడవుతున్నాడు. అప్పటిదాకా బలంగా ఉన్నవాడు కాస్త వీక్ అయితే ప్రజలు కూడా బలంగా మాట్లాడుతున్నవాడివైపు మొగ్గుతారు.
బీజేపీని రాజకీయంగా ఢీకొనాలంటే ఇప్పుడు తెరాస దగ్గర ఒకే ఒక శక్తి ఉంది. అదే యాదాద్రి నరసింహస్వామి.
రామజన్మభూమిని అడ్డంపెట్టుకుని బీజేపీ రాజకీయం నడిపినట్టుగా ఇప్పుడు యాదాద్రి నరసింహుడి కొత్త ఆలయాన్ని చూపించి తమకు పడే హిందూ ఓట్లు బీజేపీకి పడిపోకుండా ఆపుకోవాలి తెరాస.
ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా తెరాస ప్రభుత్వం తమకు కీడు తలపెట్టిందని అధికశాతం ప్రజలు అనరు. కానీ పైన చెప్పుకున్నట్టు బోర్ కొట్టిందంతే. ఆ ఫీలింగ్ ని పోగొట్టాలంటే సనాతన ధర్మ పరిరక్షకుడిగా, హిందూ జన హితైషిగా కేసీయార్ కనిపిస్తూ అదే ఎజెండాతో జెండా ఎత్తి వస్తున్న బీజేపీని నిలువరించగలగాలి.
దీనికి తోడు చిన్నజీయర్ ఆశ్రమంలో నిలబెడుతున్న వందల అడుగుల రామానుజాచార్య విగ్రహ అవిష్కరణని, ఆ సైట్ అభివృద్దిని కూడా బీజేపీకి చెక్ పెట్టడానికి వాడుకోగలగాలి.
ఇప్పుడు తెలంగాణా సెంటిమెంటు ఎలాగో పాతపడిపోయింది కనుక కొత్తగా దేవాలయం సెంటిమెంటుని ఎత్తుకోవాలి తెరాస. ఇంతకంటే జనం దృష్టిని, మనసుని ఆకర్షించే అంశం మరొకటేదీ లేదు మరి.
ఏదీ చేయకుండా కేవలం మాటల యుద్ధంతోనూ, ప్రెమీట్స్ తోనూ నెట్టుకొస్తామంటే తెరాసకి 2023 ఎన్నికల్లో పరాభవం తప్పేట్టు లేదు.
శ్రీనివాసమూర్తి