నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లను సమర్పించిన కేసులో రెండు నెలలుగా పరారీలో ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఎట్టకేలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రత్యక్షమయ్యారు. దీంతో వారికి బెయిల్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌లో ఓ స్థలం వివాదానికి సంబంధించి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో అఖిలప్రియ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కానీ భర్త, తమ్ముడు మాత్రం బెయిల్ దక్కించుకుని జైలు గడప తొక్కకుండా తప్పించుకున్నారు. ఇదే కేసులో జైలులో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్కి రావాలని భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలకు బోయిన్పల్లి పోలీసులు ఆదేశాలిచ్చారు.
అయితే కరోనా వచ్చిందని సంబంధిత రిపోర్టులను పోలీసులకు భార్గవ్, జగత్ పంపారు.ఈ రిపోర్టులు నకిలీవని పోలీసులు తేల్చారు. నకిలీ రిపోర్టులు సమర్పించిన బావాబామ్మర్దిపై బోయిన్పల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రెండు నెలలుగా వాళ్లిద్దరూ పరారీలో ఉన్నారు. వాళ్ల బెయిల్ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
ఈ నేపథ్యంలో భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పలు శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతుండడం చర్చనీయాంశమైంది. బావాబామ్మర్దులు అరెస్ట్ నుంచి మరోసారి తప్పించుకున్నారనే చర్చ జరుగుతోంది.