యడియూరప్ప వెయ్యి కోట్లు ఇస్తానన్నారు!

తాము కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బయటకు వస్తే భారీ స్థాయిలో నిధులను సమకూరుస్తానంటూ బీజేపీ నేత, ప్రస్తుత కర్ణాకట ముఖ్యమంత్రి యడియూరప్ప తమకు హామీ ఇచ్చారని అంటున్నారు తిరుగుబాటు…

తాము కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బయటకు వస్తే భారీ స్థాయిలో నిధులను సమకూరుస్తానంటూ బీజేపీ నేత, ప్రస్తుత కర్ణాకట ముఖ్యమంత్రి యడియూరప్ప తమకు హామీ ఇచ్చారని అంటున్నారు తిరుగుబాటు ఎమ్మెల్యేలు.  ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైదొలిగిన సంగతి తెలిసిందే. బీజేపీ వారి ప్రోద్బలంతోనే వారంతా బయటకు వచ్చారనే అభిప్రాయాలున్నాయి.

తిరుగుబాటు అనంతరం వారిపై అనర్హత వేటు పడింది. వారి నియోజకవర్గాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యడియూరప్ప  విషయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

తిరుగుబాటుకు ముందు తాము యడియూరప్పను కలిసినట్టుగా వారు చెబుతూ ఉన్నారు. తమకు ఆయన హామీలు ఇచ్చారని, నియోజకవర్గం అభివృద్ధికి తాము నిధులు అడగగా.. ఆయన ఓకే అన్నారని  చెబుతున్నారు. ఏదో కొద్ది మొత్తంలో కాదు.. తాను ఏడువందల కోట్ల రూపాయలను నియోజకవర్గం అభివృద్ధి కోసం అడిగినట్టుగా, యడియూరప్ప వెయ్యి కోట్ల రూపాయలను ఇవ్వడానికి హామీ ఇచ్చినట్టుగా కృష్ణరాజపేట్ ఎమ్మెల్యే నారాయణ గౌడ ప్రకటించారు.

యడియూరప్ప అలా హామీ ఇవ్వడంతోనే తను తిరుగుబాటు చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. గెలిచిన పార్టీకి విరుద్ధంగా వ్యవహరించి అనర్హత వేటును ఎదుర్కొంటున్న వాళ్లు.. ఇప్పుడు ఇలా చెప్పుకుని తిరుగుతూ ఉన్నారు. నియోజకవర్గం కోసమే తాము తిరుగుబాటు చేసినట్టుగా వాళ్లు చెప్పుకొస్తున్నారు.