విజయారెడ్డి హత్య.. మార్పుకు అదొక్కటే మార్గం

తెలంగాణలో ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేరుగా రైతులు, గ్రామస్తులు రెవెన్యూ ఉద్యోగుల పైకి తిరగబడుతున్నారు. శ్రీకాకుళంలో ఓ గ్రామ సభలో రైతు…

తెలంగాణలో ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేరుగా రైతులు, గ్రామస్తులు రెవెన్యూ ఉద్యోగుల పైకి తిరగబడుతున్నారు. శ్రీకాకుళంలో ఓ గ్రామ సభలో రైతు ఉద్యోగులపై పెట్రోల్ చల్లే ప్రయత్నం చేశారు. కర్నూలులో ఓ మహిళా ఎమ్మార్వో తన సీటుకు 10 అడుగుల దూరంలో తాడు కట్టిన వింత పరిస్థితి.

ఆముదాలవలసలో జరిగిన ఓ సభలో రైతులంతా ఎమ్మార్వోని చుట్టుముట్టి ఇబ్బంది పెట్టే సరికి ఆయన కంటతడిపెట్టిన అవస్థ. కచ్చితంగా ఇలాంటి పరిణామాలు మంచి పరిపాలనను దూరం చేస్తాయి. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను చెరిపేస్తాయి. మరి ప్రత్యామ్నాయం ఏంటి?

గ్రామ సచివాలయాలే ఈ దురవస్థకు విరుగుడు అంటున్నారు అధికారులు, పాలక వర్గాలు. సీఎం జగన్ ఎంతో ముందు చూపుతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ, అటు లబ్ధిదారులకు, ఇటు అధికారులకు ఇద్దరికీ పని సులువు చేయబోతోంది. అప్లికేషన్ పెట్టుకున్న 72 గంటల్లో పని అవుతుందా కాదా, కాకపోతే ఎందుకు కాదు వంటి కారణాలన్నీ అర్జీదారులకు స్పష్టంగా తెలుస్తాయి. ఎలాగోలా లంచాలిచ్చి పని చేయించుకుందామనుకునే అవినీతిపరుల ఆటలు సాగవు, లంచాలకు అలవాటు పడ్డ రెవెన్యూ ఉద్యోగులకు కూడా ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయినట్టే.

సో.. అన్నీ కరెక్ట్ గా ఉంటే పని 72 గంటల్లో పూర్తవుతుంది, లోటుపాట్లుంటే పని కాదని తెలిసొస్తుంది. ఇక్కడ జవాబుదారీగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి.. ఎమ్మార్వోలు, వీఆర్వోలపై ఎవరూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదు. పెట్రోలు దాడులకు ఏమాత్రం ఛాన్సే లేదు. అంతా కంప్యూటరైజ్డ్ గా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి, ఎక్కడా ఎలాంటి భావోద్వేగాలకు చోటుండదు.

ఇప్పటికే తెలంగాణలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ కావాలనే డిమాండ్ మొదలవుతోంది. ఓవైపు నిరుద్యోగిత తగ్గుతుంది, మరోవైపు కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చి రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం తగ్గుతుంది కాబట్టే ఇది కచ్చితంగా తెలంగాణలో కూడా విజయవంతమవుతుందనే అంచనాలున్నాయి. గ్రామ సచివాలయాల్లో ఏం జరుగుతుంది అని ప్రశ్నించిన ప్రతిపక్షాల నోళ్లు.. అతి త్వరలో మూతపడతాయి.