తను విలువైన వస్తువులను, ఖరీదైన ఫోన్లను భారతీయ జనతా పార్టీ వాళ్లకూ ఇచ్చినట్టుగా సగర్వంగా ప్రకటించుకున్నారు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకమార్. వివిధ కేసులకు సంబంధించి అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకు వెళ్లి విడుదలైన శివకుమార్ బెంగళూరులో ఈ ప్రకటనలు చేశారు. డీకేశికి కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఇక జైలు నుంచి విడుదల అయిన అనంతరం డీకే శివకుమార సంచలన ప్రకటనలు చేస్తూ ఉన్నారు.
కర్ణాటక బీజేపీలో ఉన్న వారిలో ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన వారంతా తన నుంచి గిఫ్టులు తీసుకున్న వాళ్లే అని ఆయన అంటున్నారు. తన నుంచి బహుమతులు పొందిన వాళ్లలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారంటూ డీకే శివకుమార ప్రకటించడం గమనార్హం. తనను అరెస్టు చేసినవారు తన నుంచి లబ్ధిపొందిన వాళ్లకు నోటీసులు ఇవ్వరా? అని డీకే శివకుమార ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఇలా తామంతా దొంగలమే అన్నట్టుగా డీకే శివకుమార ప్రకటించుకున్నారు. అందరూ తన నుంచి తీసుకుని, తనను మాత్రం జైలుకు పంపారని ఆయన వాపోతున్నట్టుగా ఉంది వ్యవహారం. డీకే శివకుమార ఇలా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలను గుర్తు చేయవచ్చు.
ఈయన జైలుకు వెళ్లినప్పుడు.. భారతీయ జనతా పార్టీ వాళ్లు తెగ బాధపడిపోయారు. ఆయన నిర్దోషిగా బయటకు రావాలని, వీలైనంత త్వరగా జైలు నుంచి బయటకు రావాలంటూ యడియూరప్పతో సహా అనేకమంది ప్రకటనలు చేశారు. ఆ సానుభూతి ప్రకటనల వెనుక ఉన్నది బహుమతుల ప్రభావమా?