తమ అధినేత చంద్రబాబు కోసం రాయలసీమ టీడీపీ నేతలు మాతృభూమి అయిన రాయలసీమ ప్రాంతాన్ని కూడా ద్వేషించేందుకు వెనుకాడడం లేదు. రాయలసీమ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు, విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ రెండో ఆప్షన్ ఉంటే…రాజధానిని తమతమ జిల్లాల్లో పెట్టాలని నాలుగు జిల్లాల టీడీపీ నాయకులు విభజించు పాలించు అనే వేర్పాటు నినాదానికి ఉసిగొల్పుతున్నారు.
తిరుపతిలో రాజధాని పెట్టాలిః మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి
రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకో అర్థం కావడం లేదంటూనే తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు రాజధానులు పెడుతున్నట్టే ముగ్గురు ముఖ్యమంత్రలను పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానాల్ని నెరవేర్చలేక జగన్ ఇలాంటి అల్లకల్లోలానికి తెరలేపారని ఆయన విమర్శించారు. రాయలసీమ పరిరక్షణ కోసం పోరాటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు.
అమరనాథరెడ్డి మాటల్లో రాయలసీమపై ఎగతాళి, చిన్న చూపు కనిపిస్తున్నాయని ఆ ప్రాంత విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు విమర్శిస్తున్నారు. చేతనైతే తమ అధినేతను ఒప్పించి తిరుపతికి రాజధాని సాధించాలే తప్ప అమరావతి ఆధిపత్యంలోనే తాము కొనసాగుతూ ప్రజల్ని కూడా అదే పనిచేయాలనే బానిస భావజాలం అమరనాథ్‌రెడ్డి మాటల్లో కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు.
కడపను రాజధానిగా చేయాలిః శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు
“రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. రెండో ఆప్షన్ ఉంటే కడపలో ఏర్పాటు చేయాలి. రాజధాని ఏర్పాటుకు అవసరమైన వనరులు జిల్లాలో ఉన్నాయి. సీఎం జగన్‌కు సొంత జిల్లాపైన, వెనుకబడ్డ రాయలసీమపై అభిమానం ఉంటే కడపలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. అమరావతిలోనే రాజధాని కొనసాగించేందుకు జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం”
జగన్‌కు సొంతజిల్లాపై ప్రేమ నిరూపించుకోవాలంటే కడపలో రాజధాని చేయాలట. కానీ శ్రీనివాస్‌రెడ్డికి మాత్రమే అమరావతిపైన్నే ప్రేమ అని బహిరంగంగా ప్రకటించారు. బాబు కోసం సొంతగడ్డను కూడా తాకట్టు పెట్టేలా ఉన్నారని కడప వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూల్‌ను రాజధాని చేయాలిః తిక్కారెడ్డి, టీడీపీ మంత్రాలయ ఇన్‌చార్జ్
“కర్నూల్‌కు హైకోర్టు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయి. రాజధాని తరలింపు తప్పదనుకుంటే కర్నూల్‌కు రాజధాని ఇవ్వాలి. లేదా పశ్చిమ ప్రాంతాన్ని వీలైతే మా జిల్లాను కూడా కర్నాటకలోని బళ్లారి జిల్లాలో కలిపేయండి”
ఈయన మాటలు వింటా ఉంటే సార్థకనామధ్యేయుడు అని రాయలసీమ వాసులు అంటున్నారు. ఏకంగా కర్నాటకలో తమ జిల్లాను కలిపేయాలని డిమాండ్ చేస్తున్న ఈయన వాలకం చూసేవాళ్లకే పిచ్చి పట్టేలా ఉందంటున్నారు.
అమరావతి కోసం మాజీ మంత్రి పల్లె దీక్ష
రాష్ట్రమంతా కలలుకన్న రాజధాని అమరావతిని కాపాడుకుందామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా గురువారం కొత్తచెరువులో ఒకరోజు దీక్ష చేపట్టాడు. చంద్రబాబునాయుడు, టీడీపీపై కక్షతోనే జగన్ రాజధానులు మారుస్తున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజధాని ప్రాంతంలో భూములు కొన్న విషయం తెలిసిందే. భూముల విలువ పడిపోతుందనే బెంగతో అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఏకంగా ఈయన దీక్షలో కూర్చున్నారు.
రాయలసీమ ఏమైపోయినా ఫర్వాలేదు, చంద్రబాబు బాగుండాలి, తామూ బాగుండాలే తప్ప కరవు సీమ ప్రజానీకంతో పనేంటి అనే వైఖరితో ఒకరు తిరుపతిలో, మరొకరు కడప, కర్నూల్‌లో రాజధానులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మాటల్లో, చేష్టల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వీళ్లా మన నాయకులు? చంద్రబాబు కోసం మాతృభూమినే ద్వేషించే ఇలాంటి నేతలతో రాయలసీమకు ఒరిగేదేమీ లేదని ఆ ప్రాంత ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.