రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో మరోసారి అధికార పార్టీ విమర్శలకు పదును పెట్టింది. గత కొంత కాలంగా న్యాయ వ్యవస్థ, ఏపీ ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. ఎలాంటి వాదవివాదాలకు తావు లేదని భావిస్తున్న తరుణంలో రాజధాని తీర్పు చర్చకు దారి తీసింది.
రాజధాని ఎంపిక హక్కు ఏపీ శాసన వ్యవస్థకు లేదని హైకోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు విమర్శలకు పదును పెట్టారు. వైసీపీ సీనియర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఏపీ హైకోర్టు తీర్పుపై ఘాటు వ్యాఖ్యలను మరవకనే, కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు సంచలనం సృష్టించారు.
తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ తీరు చాలా అభ్యంతరకరమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు చట్టాలు చేసే హక్కు ఉందన్నారు. అలాంటి హక్కు లేదనుకుంటే న్యాయవ్యవస్థలే ఎన్నికల్లో పోటీ చేసి పాలన సాగించాలని కోరడం గమనార్హం.
శాసనసభను న్యాయ వ్యవస్థ శాసించడం అభ్యంతరకరమన్నారు. ఇలాంటి నిర్ణయాలు తిరిగి మిమ్మల్ని కాటేస్తుందని ఆయన హితవు చెప్పారు. ఆసెంబ్లీ, పార్లమెంట్‌కు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని చెప్పే హక్కు కోర్టుకు లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమన్నారు.
రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హాక్కు న్యాయ వ్యవస్ధకు లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత వ్యవస్ధలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర రాజధానుల ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికార పార్టీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రాజధాని నగరాన్ని మార్చే, లేదా విభజించే, లేదా మూడు రాజధానులుగా ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడమే అధికార పార్టీ ఆగ్రహానికి కారణమైంది. దీంతో మరోసారి న్యాయ వ్యవస్థ, ఏపీ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిందని అంటున్నారు. ఈ వ్యవహారం మున్ముందు ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.