తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓఎస్డీ డాలర్ శేషాద్రి (75) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలో సోమవారం నిర్వహించతలపెట్టిన కార్తీక దీపోత్సవానికి ఆయన వెళ్లారు. తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. తిరుమల అంటే డాలర్ శేషాద్రి గుర్తుకొస్తారు.
1978 నుంచి ఆయన శ్రీవారి సేవలో తరిస్తున్నారు. 2007లో రిటైర్డ్ అయ్యారు. అయితే శ్రీవారికి సంబంధించి వివిధ సేవలకు ఆయనకు సమగ్రమైన అవగాహన ఉండడంతో ప్రభుత్వం ఓఎస్డీగా నియమించింది. దీంతో పదవీ విరమణ చేసినప్పటికీ శ్రీవారి సేవలో కొనసాగుతూ వచ్చారు.
గతంలో కూడా ఆయన రెండుమూడుసార్లు గుండెపోటుకు గురయ్యారు. అప్పట్లో తిరుపతిలో ప్రముఖ వైద్యశాల స్విమ్స్‌కు తరలించి కాపాడారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి నెలపాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తాజాగా మరోసారి గుండెపోటుకు గురై శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
ఇదిలా వుండగా ఆయన అసలు పేరు పాల శేషాద్రి. కానీ ఆయన మెడలో డాలర్ ధరించ ఉండడంతో …అదే ఆభరణంతో ప్రసిద్ధిగాంచారు. దేశవిదేశాల్లోని సెలబ్రిటీలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. అధికారంలో ఎవరున్నా, అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.
నిజానికి ఆయన టీటీడీలో అర్చకత్వ ఉద్యోగి కాదు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగి. అయితే బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, ఇతర కైంకర్యాలు స్వామికి ఎలా చేయాలనే విషయమై మంచి పట్టు ఉండడంతో ఆ సేవలకే శేషాద్రిని ఉపయోగించుకునేవారు.
2007లో ఆయన పార్‌పత్తేదార్ హోదాలో పదవీ విరమణ చేయడాన్ని గమనించొచ్చు. పదవీ విరమణ చేసినప్పటికీ, ఆయన కొండపైనే ఉంటున్నారు. కుటుంబంతో కంటే శ్రీవారితోనే ఆయనకు అనుబంధం ఎక్కువని చెబుతారు. వెంకటేశ్వరస్వామి ఆభరణాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలిసిన ఏకైన వ్యక్తి డాలర్ శేషాద్రి మాత్రమే. వెంకటేశ్వరస్వామి బొక్కసం (శ్రీవారి ఆభరణాల ఖజానా) ఈయనే అనధికారికంగా చూస్తున్నారు. అధికారికంగా మరో ఉద్యోగి ఉన్నప్పటికీ, అదంతా నామమాత్రమే.
మొగల్ చక్రవర్తి అక్బర్. విక్టోరియా మహారాణి, కృష్ణదేవరాయులు ఇచ్చిన ఆభరణాల గురించి ఈయనకే తెలుసు. తిరుమలకు వచ్చే ప్రతి సెలబ్రిటీ శేషాద్రితో కలిసి ఫొటో తీయించుకుంటేనే… ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫీలింగ్ ఉండదని అంటారంటే, కొండపై ఆయన ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. డాలర్ శేషాద్రి మరణంపై పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.