కరోనా మహమ్మారి ఎన్నో చిత్రవిచిత్రాలను చూపుతోంది. రోజువారీ పనులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల మొదలు ప్రైవేట్ కార్యాలయాల వరకు అన్నీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. దీంతో అందరూ ఆన్లైన్ జపం చేస్తున్నారు. ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్‌లు కూడా కండక్ట్ చేస్తున్నారు. అయితే అన్నీ సక్రమంగా జరిగితే ఏ సమస్యా లేదు.
కానీ ఏ చిన్న పొరపాటు దొర్లినా నవ్వుల పాలు కాక తప్పదు. అలాంటిదే ఒకటి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్‌లో చోటు చేసుకొంది. ఆ తప్పిదం వినడానికి , చూడడానికి ఇతరులకు సరదాగా ఉన్నా…ఓ ఉద్యోగి ఉపాధికి ఎసరు తెచ్చింది. స్పెయిన్‌లో చోటు చేసుకున్న ఆ సంఘటన వివరాలేంటో తెలుసుకుందాం.
స్పెయిన్‌లోని కాంటాబ్రియాలో బెర్నాడో బుస్టిల్లా అనే వ్యక్తి పార్ట్ టైమ్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో అతను ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. బెర్నాడో బుస్టిల్లా ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ లైవ్ మీటింగ్ ప్రత్యేకత ఏం టంటే…టీవీలో కూడా ప్రసారమవుతుంది. ఈ మీటింగ్ ఉదయం 8 గంటలకు మొదలై మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది.
కాగా బెర్నాడో బుస్టిల్లాకు బయటికి వెళ్లాల్సిన పని ఉంది. ఎందుకంటే అతను బయటికి వెళ్లి కూతుర్ని తీసుకురావాలి. మరోవైపు మీటింగ్‌కు సమయం ముంచుకొస్తుండడంతో అతనిలో టెన్షన్ మొదలైంది. స్నానం చేయాలని అతను నిర్ణయించు కున్నాడు. అదే సమయంలో మీటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారో వినాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లాప్‌టాప్‌ను కూడా బాత్రూమ్లోకి తీసుకెళ్లాడు.
వీడియో కనిపించకుండా హైడ్ చేయబోయి, మినిమైజ్ చేశాడు. ఇక చెప్పేదేముంది? సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయింది. అతను స్నానపానాదుల దృశ్యం… చక్కగా క్రికెట్ లైవ్ మ్యాచ్‌లా ప్రసారమైంది. దీంతో ఆన్లైన్ మీటింగ్‌లో ఉన్న తోటి కౌన్సిలర్లు, అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతని నగ్నత్వాన్ని చూడలేక కళ్లు మూసుకున్నారు.
అయితే ఈ ఘోరాన్ని ఆపేందుకు భూమి దద్దరిల్లేలా అరిచినా లాభం లేకపోయింది. ఎందుకంటే బాత్రూమ్లో షవర్ వల్ల బెర్నాడోకి అటు వైపు నుంచి మాటలు వినిపించలేదు. మీటింగ్‌ను మధ్యలో ఆపడం కుదర్లేదు. చివరికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. చివరికి మీటింగ్‌ను వాయిదా వేసుకున్నారు.
అయితే తన లైవ్ సంగతి తెలియని బెర్నాడో ప్రశాంతంగా స్నానం బయటికొచ్చారు. తర్వాత విషయం తెలుసుకుని లబోదిబోమన్నాడు. టెక్నికల్ సమస్య వల్ల ఘోరం జరిగిందని అతను క్షమాపణలు చెప్పాడు. అయితే వాటిని కంపెనీ పరిగణలోకి తీసుకోకుండా రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆన్లైన్ అంటే గోడకు కళ్ల లాంటివి. అన్ని వైపుల నుంచి దాని చూపు ఉంటుంది. కావున ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ ఎపిసోడ్ హెచ్చరిస్తోంది.