బీజేపీ, జ‌న‌సేన నాట‌కాలొద్దుః ‘రాజ‌ధాని’ రైతులు

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల చైత‌న్యం, ప్ర‌శ్నించేత‌త్వం భ‌లే న‌చ్చాయి. అవ‌స‌ర‌మైతే ఎంత‌టి వారినైనా నిల‌దీస్తాం, ప్ర‌శ్నిస్తామంటున్న వారి ధైర్యాన్ని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. మ‌రీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్ర‌శ్నించ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ…

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల చైత‌న్యం, ప్ర‌శ్నించేత‌త్వం భ‌లే న‌చ్చాయి. అవ‌స‌ర‌మైతే ఎంత‌టి వారినైనా నిల‌దీస్తాం, ప్ర‌శ్నిస్తామంటున్న వారి ధైర్యాన్ని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. మ‌రీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్ర‌శ్నించ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ సాహ‌సించ‌డం లేదు. ఇటు అధికార ప‌క్షం వైసీపీ, అటు ప్ర‌తిప‌క్షం టీడీపీ…రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని నిల‌దీయ‌డానికి జంకుతున్నాయి.

అస‌లే మోడీ -అమిత్‌షా జోడి. త‌మ‌కు న‌చ్చ‌ని వాళ్లంటే ఈడీ, సీబీఐ కేసుల‌తో ముప్పుతిప్ప‌లు పెట్ట‌డంలో వాళ్లిద్ద‌రి త‌ర్వాతే ఎవ‌రైనా. అందుకే వారిద్ద‌రిపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి ప్ర‌తిప‌క్షాలు వెనుకాముందు ఆలోచించాల్సిన ప‌రిస్థితి. కానీ రాజ‌ధాని రైతులు మాత్రం అవేవీ ఆలోచించ‌లేదు. బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌ను సైతం ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. మ‌భ్య‌పెట్టే మాట‌ల‌తో నాట‌కాలు ఆడొద్ద‌ని, చిత్త‌శుద్ధి ఏంటో నిరూపించుకోవాల‌ని బీజేపీ, జ‌న‌సేన నాయ‌కుల‌కు రాజ‌ధాని రైతులు హిత‌వు చెప్పారు.

బీజేపీ నేత‌లు ఒక్కొక్క‌రు ఒక్కోర‌కంగా మాట్లాడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. ఈ విష‌యం అన్ని పార్టీల‌కు తెలిసినా ‘ఇదేంటి’ అని ప్ర‌శ్నించే వారే క‌రువ‌య్యారు. దేవునికైనా దెబ్బ గురువు అన్న చందంగా …స‌రిగ్గా రాజ‌ధాని రైతుల చేతుల్లో బీజేపీ , జ‌న‌సేన నేత‌లు చిక్కారు. త‌మ ప్ర‌శ్న‌ల‌తో ఆ రెండు పార్టీల నేత‌ల‌కు చుక్క‌లు చూపారు. అస‌లేం జ‌రిగిందంటే…

గ‌త నెలన్న‌ర‌ రోజులుగా రాజ‌ధాని రైతులు వివిధ రూపాల్లో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. వెల‌గ‌పూడి, మంద‌డం, తుళ్లూరు గ్రామాల్లో ఆదివారం బీజేపీ, జ‌న‌సేన రైతులు ప‌ర్య‌టించారు. రైతుల‌కు సంఘీభావం తెలిపారు. ఆ రెండు పార్టీల నేత‌ల‌కు గౌర‌వంగా రైతులు ఆహ్వానం ప‌లికారు. ఆ త‌ర్వాత చాకిరేవు మొద‌లు పెట్టారు. త‌మ‌లో గూడుక‌ట్టుకున్న ప్ర‌శ్న‌ల తుట్టెను రైతులు క‌దిల్చారు.

రాజ‌ధానిపై నాట‌కాలు వ‌ద్ద‌ని, మీ వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేయాల‌ని ఆ రెండు పార్టీల నేత‌ల‌ను నిల‌దీశారు. రైతులు అడిగిన ప్ర‌శ్న‌లివే…
 
-అమ‌రావ‌తిలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఒక‌లా, ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మ‌రోలా మాట్లాడుతు న్నారు. ఇంత‌కూ ఇద్ద‌రు నాయ‌కుల మాట‌ల్లో ఏది న‌మ్మాలి? మాకు స్ప‌ష్టత కావాలి.

-ఫిబ్ర‌వ‌రి 2న లాంగ్‌మార్చ్ నిర్వ‌హిస్తామ‌ని జన‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీ నుంచి  ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఆ ఊసేలేదు.  దాన్ని ఎందుకు విర‌మించుకొంది.

-బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు త‌ల‌చుకుంటే …రైతులు, మ‌హిళ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి 47 రోజులుగా దీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రెందుకు ఏమీ ప‌ట్టించుకోలేదు?

-ప్ర‌భుత్వ కార్యాల‌యాల త‌ర‌లింపుపై హైకోర్టు స్టే ఇచ్చినా ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి పూట జీవోలు విడుద‌ల చేస్తోంది. మాకు ఏ విధంగా అండ‌గా నిలుస్తారు?

ఇవే కాక మ‌రిన్ని కీల‌క‌మైన ప్ర‌శ్న‌ల‌ను బీజేపీ నేత‌లు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పాతూరి నాగ‌భూష‌ణం, జ‌న‌సేన నాయ‌కులు పోతిన మ‌హేశ్‌, బోన‌బోయిన శ్రీ‌నివాస్‌యాద‌వ్ త‌దిత‌రుల‌పై రాజ‌ధాని రైతులు కురిపించారు.  దీంతో ఏం స‌మాధానం చెప్పాలో నేత‌ల‌కు దిక్కుతోచ‌లేదు. ‘చేస్తున్నాం, చేస్తాం’ అని మొక్కుబ‌డి స‌మాధానాలు చెప్పి అక్క‌డి నుంచి బ‌య‌ట ప‌డాల్సి వ‌చ్చింది.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం