అనంతపురం జిల్లా తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డికి మరో ఝలక్ తగలడం దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడానికి అంటూ దశాబ్దంన్నర కిందటే భూమి తీసుకుని.. ఇప్పటి వరకూ ఇటుక కూడా పేర్చకపోవడంపై ఇప్పటికే జేసీ ఫ్యామిలీకి ఝలక్ తగిలింది. ఆ భూమిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
అయితే ఇదంతా జగన్ మోహన్ రెడ్డి తనపై సాధిస్తున్న కక్ష సాధింపు అని దివాకర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఫ్యాక్టరీ కట్టడానికి అంటూ భూమి తీసుకుని..దాంట్లో మైనింగ్ చేసుకుంటూ ఉండటం ఏమిటో దివాకర్ రెడ్డికే తెలియాలి. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి కూడా అలాంటి పని చేసి, ఇప్పుడు అడ్డుకుంటుంటే అది కక్ష సాధింపు, ఫ్యాక్షన్ రాజకీయం అని అనడం దివాకర్ రెడ్డి తీరును చాటుతూ ఉందని సామాన్య ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.
భూమి తీసుకుని ఇన్నేళ్లూ ఫ్యాక్టరీ కట్టనందుకు ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతే కాదు.. అదే భూమిలో భారీ ఎత్తున మైనింగ్ చేసి.. తవ్వేశారనే అభియోగాలున్నాయని తెలుస్తోంది. ఆ భూమిలో జేసీ సోదరులు చేసిన ఇల్లీగల్ మైనింగ్ విలువ దాదాపు రెండు వందల కోట్లు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు.
మరి ఆ అంశంపై గనుక విచారణ జరిగితే భారీగా ఫైన్ పడుతుందని.. చేసిన మైనింగ్ కు అనేక రెట్ల మొత్తం ఫైన్ పడే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీకి అంటూ తీసుకున్న స్థలం వెనక్కుపోవడమే గాక.. అక్రమ మైనింగ్ పై భారీ ఫైన్ కూడా పడితే.. అది గట్టి శరాఘాతం అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.