విశాఖ రాజధాని వద్దని గట్టిగానే టీడీపీ తమ్ముళ్ళు చెబుతున్నారు. పోటా పోటీగా ర్యాలీలు తీస్తున్నారు. సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. అమరావతికి జై అంటూ ఏకంగా విజయవాడ నుంచి విశాఖ వచ్చి మూడు మార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వెలగపూడి రామక్రిష్ణబాబు అంటున్నారు.
చంద్రబాబు పక్కనే కూర్చుని అమరావతే మన రాజధాని అంటూ గర్జించడమే కాదు, అసెంబ్లీ వెలుపలా, లోపలా కూడా విశాఖపై విషం కక్కుతున్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. బాబుతో పాటు ఆయన గవర్నర్ ని కూడా కలసి మూడు రాజధానులపైన ఫిర్యాదు చేసారు.
ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు అయితే ఉత్తరాంధ్రా విషయం అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరు కోరారు విశాఖ రాజధాని అంటూ లాజిక్ పాయింట్లు తీస్తున్నారు. అమరావతి కోసం ఎందాకైనా వెళ్తామంటున్నారు.
మరో వైపు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అయితే రాజధానిగా అమరావతే ఉండాలి, ఇదే అందరి అభిమతం అంటూ కచ్చితంగా చెప్పేస్తున్నారు. విశాఖ రాజధాని ఏంటని ఆయన ఎకసెక్కం ఆడుతున్నారు.
మరి ఇలా మాట్లాడుతున్నా తమ్ముళ్ళ ధైర్యం ఎంటో అర్ధం కాని పరిస్థితి. అది ధైర్యం అనడం కంటే ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వం మీద వారికి ఉన్న నమ్మకం అనుకుంటే బాగుటుంది. ఎన్ని చేసినా తిమ్మిని బమ్మిగా చేసి చూపించే చాణక్యం, చాకచక్యం తమకు ఉండగా ప్రజలను ఎలాగైనా అనుకూలంగా తిప్పుకోవచ్చునన్న ధీమా కూడా అనుకొవచ్చేమో.
మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొక్క బోర్లా పడింది సైకిల్. అయినా టీడీపీనే జనం గెలిపిస్తారని అనుకుంటున్నారంటే తమ్ముళ్ళ లెక్కలేంటో.. ఆ ధిక్కారం వెనక తిక్కలేంటో.