ఇసుక నుంచి తైలాన్ని అయినా తీయవచ్చేమో కానీ, ఈనాడులో రామోజీరావు కేసు గురించి రాయించలేరు. ఈనాడు పత్రికను చేతికి తీసుకోగానే మొట్ట మొదట కనిపించేది….The Largest Circulated Telugu Daily అని. కానీ ఈనాడు The Largest Credibility Telugu Daily అని రాసుకునేందుకు మరో వందేళ్లైనా సాధ్యం కాదేమో. ఒక్క ఈనాడుకే కాదు ఏ పత్రికకైనా Circulationతో పాటు Credibilityనే జీవం.
Credibility లేకుండా ఏం రాసినా, చూపినా శవాన్ని చూపినట్టే. Credibility లేని మీడియా సంస్థలు శవప్రాయమైనవి. అందుకే తెలుగు సమాజంలో నేడు మీడియా అంటే విలువ లేకుండా పోయింది. మనిషికి క్యారెక్టర్ ఎంత ముఖ్యమో, మీడియాకి క్రెడిబిలిటీ అంతకంటే ఎక్కువ. దురదృష్టవశాత్తు మీడియాలో ప్రధానంగా అదే లోపించింది.
ఎప్పుడూ గిట్టని వారి తప్పులు ఎత్తి చూపడం, ఇష్టమైన వారి తప్పులను కప్పి పుచ్చడమే విధానంగా రామోజీరావు సారథ్యం వహిస్తున్న ఈనాడు పత్రిక, ఈటీవీ చానళ్లు వార్తలను వండివారుస్తున్నాయి. లోకానికి శుద్ధులు చెప్పే ఈనాడు తన అధినేత రామోజీపై రాసేందుకు మాత్రం మనసు రావడం లేదు. ప్రధానంగా శుక్రవారం ఇద్దరు ప్రముఖ వ్యక్తులకు సంబంధించి రెండు కేసులు తెలుగు సమాజాన్ని ఆకర్షించాయి. ఒకటి సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పు, రెండు ఈనాడు అధినేత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శిపై సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషిన్పై స్పందన.
ఈ రెండు వార్తలకు సంబంధించి ఈనాడు, సాక్షి పత్రికలు ఎలా క్యారీ చేస్తాయో చూడాలనే ఆసక్తి సహజంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. శనివారం ఆ రెండు పత్రికలు ఎలా రాశాయో పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం.
ఈనాడుః
మెయిన్ మొదటి పేజీలో హెడ్డింగ్ః 31న జగన్ కోర్టుకు రావాల్సిందే
ఉప శీర్షిక-సహ నిందితుడిని అనుమతించాలన్న పిటిషన్ కొట్టివేత
ఇక కథనానికి వస్తే…
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే మనీలాండరింగ్ నిరోధక చట్టం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసుల్లోనూ నిందితుడైన జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
ఇదే వార్తకు సంబంధించి లోపలి పేజీలో…
వాన్‌పిక్ కేసులో ఏడో నిందితుడై ఐఏఎస్ అధికారి మన్మోహన్సింగ్ను అవినీతి నిరోధక చట్టం కింద విచారించడానికి కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈశ్వర్ సిమెంట్స్ పిటిషన్ కొట్టివేతః దాల్మియా కేసులో నిందితుల జాబితాలో నుంచి తొలగించాలంటూ సజ్జల దివాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ సీబీఐ కోర్టు కొట్టివేసింది….అని జగన్‌కు సంబంధించిన వార్తలను సమగ్రంగా ఈనాడు రాసింది.
అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన కేసులపై శనివారం ఈనాడులో ప్రచురించిన వార్తలను తెలుసుకుందాం.
1.నేరచరితులకు పార్టీలు టిక్కెట్ ఇవ్వనే కూడదు!
-సుప్రీంకోర్టులో ఈసీ ఉద్ఘాటన
2.డిస్కంల అభ్యంతరాలను పరిశీలించాలి
-జస్టిస్ ధర్మాధికారి కమిటీకి సుప్రీంకోర్టు సూచన
3.టాటాలకు సుప్రీంలో ఊరట (బిజినెస్ పేజీలో)
4.హైకోర్టు తరలింపు చర్యలుంటే తెలపండి
-పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చిన హైకోర్టు
5.కొండవీటి, పాలవాగుల అభివృద్ధిపై వివరాలివ్వండిః హైకోర్టు
6.ఎన్టీ రంగా వర్సిటీ పాలక మండలి సభ్యుల నియామకంపై వ్యాజ్యం
బాధ్యతలు తీసుకోకుండా హైకోర్టు ఉత్తర్వులు
భూతద్దాలతో వెతికినా కనిపించని రామోజీ కేసు వార్తః జగన్ , ఏపీ ప్రభుత్వం, ఇతరుల గురించి హైకోర్టు మొదలుకుని సుప్రీంకోర్టు వరకు వెల్లడించిన వార్తలను రాసిన ఈనాడుకు…. తమ అధినేత రామోజీ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న కీలక నిర్ణయం గురించి మాత్రం ప్రజలకు సమాచారం ఇవ్వాలనిపించలేదు. రామోజీరావులోని ఈ ద్వంద్వ వైఖరి వల్లే మీడియా అంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఈనాడు రాయనంత మాత్రానా నిజం బయటకు రాకుండా పోతుందా? ఎందుకంటే నిజం నిప్పులాంటిది. తమ వరకూ వస్తే ఒక నీతి, ఇతరులకైతే మరో నీతి చందానా ఈ పత్రికలు, చానళ్లు వ్యవహరిస్తుండటం వల్లే సోషల్ మీడియా శక్తిమంతమైంది.
సాక్షిః
ముందుగా సీఎం జగన్ కేసు విషయానికి వద్దాం. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత అనే శీర్షికతో చిన్న వార్త రాశారు. సాక్షితో జగన్ అనుబంధం ఏంటో అందరికీ తెలిసిందే. కనీసం ఈ మాత్రమైనా వార్త ఇచ్చినందుకు అభినందించాల్సిందే. ఎందుకంటే ఈనాడులో కనీసం ఈ మాత్రమైనా రామోజీ కేసు వార్తకు చోటు లభించలేదు కాబట్టి.
“మార్గదర్శి కేసులో ఉండవల్లి పిటిషన్ స్వీకరణ” అనే శీర్షికతో సాక్షి ఫస్ట్ పేజీలో వార్త ఇచ్చారు. లోపలి పేజీలో పూర్తి వివరాలతో వార్తను క్యారీ చేశారు.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయాలన్న అభ్యర్థనకు సుప్రీంకోర్టు సమ్మతించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పినట్టు కథనాన్ని కొనసాగించారు. రూ.2,600 కోట్ల తీవ్రమైన ఆర్థిక నేరంలో రామోజీరావు కనీసం కోర్టు మెట్లు ఎక్కని విషయాన్ని ఉండవల్లి చెప్పారు.
1980, 90వ దశకాల్లో ఉన్నట్టు, ఇప్పుడు లోకం లేదు. కానీ ఈనాడు రామోజీరావు మాత్రం తాను అప్పట్లో ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అట్లే ఉన్నాడు. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని దశలో పత్రికల్లో ఏది రాస్తే అదే నిజమని నమ్మే ఎర్రికాలం. ఇప్పుడలా కాదు. ఏ వార్త వెనుక ఎవరున్నారో, దాని ఉద్దేశం ఏంటో నిమిషాల్లో సోషల్ మీడియా వేదికగా సమాజానికి ఆధారాలతో సహా చూపుతున్నారు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తమకు గిట్టని వారిపై విషం కుమ్మరిస్తున్నా, నచ్చిన వారిపై అమృతం కురిపిస్తున్నా….విజ్ఞులైన ప్రజలే అంతిమ తీర్పు ఇస్తున్నారు.
నిజాల్ని దాచడం, అబద్ధాల్ని ప్రచారం చేయడం వల్ల పోయేది మీడియా పరువే. ఆ విషయాన్ని ఈనాడు , ఆ సంస్థ అధినేత రామోజీరావు గుర్తించి మసలుకుంటే మంచిది.