ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఒప్పందాన్ని సింగపూర్ రద్దు చేసుకోవడంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆ ఒప్పందంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు వాటిని లెక్క చేయలేదు. తన ఇష్టానికి సింగపూర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అలా సింగపూర్ పేరు చెబితే ఏపీ ప్రజలు బాగా భ్రమలకు లోనవుతారనేది చంద్రబాబు నాయుడి ఆలోచన అనేది ఒక విశ్లేషణ. అయితే 2017లోనే ఆ ఒప్పందం కుదర్చుకున్నా, రెండేళ్ల పాటు ఆ ఒప్పందం కొనసాగినా సాధించింది ఏమీ లేదు. మిగిలింది గ్రాఫిక్స్ మాత్రమే!
తాజాగా ఒప్పందం రద్దుపై చంద్రబాబు నాయుడు 'కలలన్నీ కరిగిపోయాయి..' అంటూ ఇంగ్లిష్ లో ట్వీటేశారు. బహుశా అది నిజమే కావొచ్చు. కలలు అన్నీ కరిగిపోయి, ఇక వాస్తవాలు మాత్రమే ప్రజల ముందు ఉండవచ్చు.
ప్రజలకు విదేశాల పేర్లు చెప్పి, గ్రాఫిక్స్ చూపించి భ్రమింపజేయాలనే రోజులు పోయి, వాస్తవాలను వాళ్లకు అర్థమయ్యేలా చేసి, వర్తమానంలో సాగే పాలనే అవసరం కూడా. చంద్రబాబు నాయుడు ప్రజలను భ్రమల్లో ముంచెత్తి, తను ఏవో కలలు కన్నట్టున్నారని, ఆ కలలు ఇప్పుడు కాదు, ఎన్నికల్లో ఆయనను ప్రజలు తిరస్కరించినప్పుడే కరిగిపోయాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.