దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని సాధించిన బీజేపీ నేత రఘునందన్‌రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో చోటు చేసుకున్న ఘటనపై న్యాయం కోరుతూ ఆయన కోర్టు మెట్లెక్కారు.
ఉప ఎన్నిక పురస్కరిం చుకుని పోలీసులు సిద్దిపేటలో రఘునందన్ మామ అంజన్‌రావు ఇంట్లో సెర్చ్ చేశారు. ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడినట్టు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మొత్తంలో రూ.12.80 లక్షలను రఘునందన్ అనుచరులు ఎత్తుకెళ్లారని, వారిలో 30 మందిని గుర్తించా మని, కేసులు నమోదు చేస్తామని జోయల్ డేవిస్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో రఘునందన్ న్యాయపరమైన అంశాలపై దృష్టి మళ్లించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టి వేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇంట్లో రూ.18 లక్షలు దొరికాయని పోలీసులు కట్టు కథ అల్లారని రఘునందన్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ పేర్కొంది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.