‘భీమ్లా నాయక్ ట్రీట్మెంట్’ అంటే ఏమిటో చూపిస్తానని జనసేనాని పవన్‌కల్యాణ్ తనను హెచ్చరించడంపై కాకినాడు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. కాకినాడలో తన వెంట్రుక కూడా పీకలేవని ఆయన హెచ్చరించారు.
నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులను పేరు పెట్టి మరీ హెచ్చరిం చడం తెలిసిందే. పవన్ నుంచి హెచ్చరిక అందుకున్న వారిలో ద్వారంపూడి కూడా ఉన్నారు. ద్వారంపూడికి గట్టిగా బుద్ధి చెప్పాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సభాముఖంగా పవన్ సూచించిన సంగతి తెలిసిందే.
ద్వారంపూడిని పవన్ ఏమన్నారు, అందుకు వైసీపీ ఎమ్మెల్యే ఎలా స్పందించారో తెలుసుకుందాం.
‘కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీకి అలవాటే. నేను భరించాను. కానీ… నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ద్వారంపూడి కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ ట్రీట్మెంట్ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే… ‘భీమ్లా నాయక్ ట్రీట్మెంట్’ అంటే ఏమిటో చూపిస్తా’ అని పవన్ ఘాటు హెచ్చరికలు చేశారు. పవన్ హెచ్చరికలపై ద్వారంపూడి ఏమన్నారంటే…
‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో నాపై అవాకులు చెవాకులు పేలారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పవన్ గుర్తించాలి. సభలు పెట్టడం, ప్యాకేజీ మాట్లాడుకోవడం పవన్‌కు అలవాటే. పవన్ అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదం. దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీ చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తుకెళ్తే పవన్‌కే నష్టం.
జనసేనలో కొందరు లక్షలు ఖర్చు చేస్తున్నారు…మీరు లక్షలు ఖర్చు చేసినా పవన్ మిమ్మల్నీ తాకట్టు పెడతాడు. నా జోలికి వస్తే క్షమించేది లేదు, మేము చూస్తూ ఊరుకొనేది లేదు.. మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చూస్తూ ఊరుకోం. చేతులు ముడుచుకు కూర్చోం. మళ్ళీ చెపుతున్న మమ్మల్ని కాకినాడలో ఒక వెంట్రుక గాని, ఈక గాని పీకలేరు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.