కరోనాతో అల్లకల్లోలం పాలైన ఆర్థిక వ్యవస్థకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ మోడీ ప్రకటించడం, ఆ 20 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేయబోతోంది ప్రకటించి ఆర్థిక శాఖా మంత్రి అసలు కథను చెప్పేయడం జరిగిపోయింది. పేరుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. వార్షిక జీడీపీలో 10 శాతం.. అంటూ ప్రగల్భాలు పలికి.. చివరకు ఒక్క శాతం డబ్బును కూడా ఖర్చు చేయడం లేదు. ఈ విషయంలో ఆర్థికవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల చెవుల్లో ఇలా కూడా పూలు పెట్టొచ్చా.. అని ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా నోరెళ్లబెడుతున్నారు.
కొత్తగా పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటూ మోడీ ప్రభుత్వం చేసిన హంగామా అలా ఉంది మరి! ఈ ప్యాకేజీ కబుర్లతో ఇంతకీ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నట్టో! మోడీ ప్రభుత్వం పేదల పక్షపాతి కాదు అనే అంశం మరోసారి తేలిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ కు ఈ ప్యాకేజీ ఇచ్చే ఊతం గురించి అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. జీడీపీలో 10 శాతం అంటూ మోడీ చెప్పినా, కనీసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టడం లేదు అని వారు తేల్చి చెబుతున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కు ఇది ఎంత మాత్రమూ రిలీఫ్ కాదని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ప్రపంచంలోని చాలా దేశాలు వివిధ ప్యాకేజీలను ప్రకటించాయి. కొన్ని దేశాలు అయితే ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల జీతాల్లో కొద్ది శాతాన్ని చెల్లించేందుకు కూడా ముందుకు వచ్చాయి. ఇండియాలో అంత సీన్ లేదనుకున్నా.. కనీసం బీపీఎల్ కు దిగువన ఉన్న వారికి అయినా ఏదైనా ఆర్థిక సాయం చేయాల్సిన సయమం ఇదని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
సమకాలీన ప్రపంచంలో.. ప్రముఖ ఆర్థిక వేత్తలుగా పేరున్న అభిజిత్ బెనర్జీ, రఘురాం రాజన్ లు ఇదే మాటే చెబుతున్నారు. ఇప్పుడు భారత ప్రజలకు డైరెక్టుగా ఆర్థిక సాయంచేయడమే.. వ్యవస్థకు ఊతం ఇవ్వడం అని వారు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ వాళ్లు అన్నీ తమకే తెలుసని అంటారు. కాషాయ వాది కాకపోతే వాడు ఏం చెప్పినా వినేది లేదన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి.. అభిజిత్ బెనర్జీ, రఘురాం రాజన్ లాంటి వాళ్లు ఏం చెప్పారనేది పక్కన పెట్టి, వాళ్లను విమర్శించడం మొదలుపెడతారు, వీళ్లా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేది?