ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన జీఎస్టీ సుమారు లక్షా ఐదు వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో జీఎస్టీ వసూళ్ల క్షీణత చోటు చేసుకుంది. ఏప్రిల్ లో అయితే 32 వేల కోట్ల స్థాయిలో మాత్రమే జీఎస్టీ వసూలయ్యింది.
ఈ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకుంటూ వస్తోంది. మే నెలలో 60 వేల కోట్ల స్థాయిలో నమోదైన జీఎస్టీ వసూళ్లు, అక్టోబర్ నెలలో లక్షా ఐదు వేల కోట్ల స్థాయిలో నమోదైనట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో.. కరోనా నుంచి రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశేషం ఏమిటంటే.. సరిగ్గా గత ఏడాది అక్టోబర్ లో 90 వేల కోట్ల స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పుడు దానిపై పది శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.
గత ఏడాది అక్టోబర్ కన్నా ఈ ఏడాది అక్టోబర్ లో ఎక్కువ శాతం జీఎస్టీ వసూళ్లు నమోదవ్వడంతో.. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తూ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ రాష్ట్రాలకు కూడా జీఎస్టీ వసూళ్ల స్థాయి పెరగడంతో ఉత్సాహంగా మారింది.
ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంలో కేసుల సంఖ్య కాస్త పెరిగినట్టుగా ఉంది. మళ్లీ రోజువారీగా కేసుల సంఖ్య 40 వేల నుంచి 50 వేల స్థాయికి చేరినట్టుంది. ఇదే సమయంలో రికవరీల సంఖ్య గట్టిగా ఉండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇలా కరోనా ప్రభావం కొనసాగుతూ ఉంది.
అయితే దైనందిన కార్యక్రమాలకు మాత్రం ప్రజలు వెనుకడుగు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఐటీ సెక్టార్ జనాలు తప్ప.. మిగతా వాళ్లంతా కరోనా పూర్వపు డైలీ రొటీన్స్ కు వచ్చారు. జాగ్రత్తలు తీసుకునే వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మిగతా వాళ్లు అది కూడా లేదు.
ట్రావెల్, టూరిజం, ఫుట్ పాత్ బిజినెస్, ఫుడ్ డెలివరీ సిస్టమ్, థియేటర్లు, మాల్స్ మాత్రం ఇంకా గాడిన పడలేదు. ఈ వ్యవస్థలు కోలుకోవడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టేలా ఉంది.
కరోనా వ్యాప్తి మరింతగా తగ్గితే తప్ప ఇవి ఊపందుకునేలా లేవు. ఈ రంగాల్లో పని చేస్తున్న వారికి మాత్రం కొంత వరకూ ఇబ్బందికరమైన పరిస్థితి కొనసాగుతూనే ఉండవచ్చు. ఇవి కూడా పూర్తిగా గాడిన పడితే.. బతుకుబండి మళ్లీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కినట్టే.