దోచుకున్నోడికి దోచుకున్నంత‌!

నానాటికీ తీసికట్టు నామం బొట్టు అని వెనకటికి సామెత. లేదా చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నది ఇంకో సామెత. దేశం మొత్తం సంగతి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలు…

నానాటికీ తీసికట్టు నామం బొట్టు అని వెనకటికి సామెత. లేదా చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నది ఇంకో సామెత. దేశం మొత్తం సంగతి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలు ఇలాగే వున్నాయి. 

నామం బొట్టు మాదిరిగానే నానాటికీ తీసికట్టు అవుతున్నాయి. చదువుకున్న వాళ్లు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుంది అంటే జనం నిజమనుకున్నారు. నిజంగానే యువతరం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ దేశం ముందుకు వెళ్లడం సంగతేమో కానీ రాజకీయాలు మరింత దిగజారాయి.

స్వ‌తంత్రానికి పూర్వం రాజకీయాలు లేవు. స్వతంత్ర‌ పోరాటం మాత్రమే వుంది. అప్పుడు నాయకుల సంఖ్య అతి తక్కువ. అనుచరుల సంఖ్య చాలా ఎక్కువ. అప్పట్లో స్వ‌తంత్ర సాధన తప్ప మరో ఆలోచన లేదు. 

స్వార్థం లేదు. సంపాదన ఆలోచన లేదు, స్వ‌తంత్రం వచ్చింది. అప్పుడు దేశంలో రాజకీయాలు అన్నవి పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. నిజానికి రాజకీయాలు అనే కన్నా అధికార రాజకీయాలు అన్నవి కీలకంగా మారాయి. 

అధికారం అన్నది కేవలం ఓ హోదాగా, పరపతిగా భావించే కాలం అది. రాజ్యాలు పోయాయి. జమీలు పోయాయి. పరగణాలు పోయాయి. కానీ అజమాయిషీ వుండాలనుకునే కాలం అది. అందుకే ఆ అజమాయిషీ కోసమే, ఆ అధికార సాధన కోసమే రాజకీయాలు చేసేవారు. అవినీతి అనే పదం చాలా అరదుగా వినిపించేది.

1960 నుంచి 70 మధ్యకాలం

ఈ దశకంలో రాజకీయ నాయకులు కాస్త సంపాదనకు అలవాటు పడడం ప్రారంభమైంది. కానీ ఆ ఆదాయ మార్గాలు ఇప్పుడు వింటే, చిలక్కొట్టుడు మాదిరిగా, చిరుతిళ్ల మాదిరిగా వుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యంగా ఎయిడెడ్ లేదా రెగ్యులర్ టీచర్ పోస్టులు వేయించడం, బదిలీలు చేయించడం, సిమెంట్ పర్మిట్లు, బస్ పర్మిట్లు అరేంజ్ చేయడం వంటివి చేసేవారు. 

ఆ విధంగా చిన్న చిన్న మొత్తాలు ఆర్జించేవారు. జనాలకు ఓట్లకు డబ్బులు ఇచ్చే వ్యవహారం అంతగా వుండేది కాదు. డ్యూటీ పడిన ఎన్నికల సిబ్బందికి మాత్రం ఆయా ఊళ్లలో సకల సదుపాయాలు కల్పించేవారు. ఇలా అప్పుడే అధికారం అడ్డు పెట్టుకుని సంపాదించడం అనే అడుగు పడింది అవినీతి తొలి అడుగు ఈ నియామకాలు, బదిలీలు, పర్మిట్లు అనే రంగం మీద పడింది.

1970 నుంచి 83 మధ్యకాలం

రాజకీయాలు పోటీ అనే దారి నుంచి కుట్రలు కుతంత్రాలు, కాళ్లు లాగడాలు వంటి దారి పట్టాయి. అధికార లాలస భయంకరం అయిపోయింది. గ్రూపు రాజకీయాలు పెరిగాయి. దీని ఫలితంగా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వుంటారో, ఎప్పుడు ఏ సిఎమ్ గద్దె దిగుతారో? అన్నపరిస్థితి వచ్చింది. 

తెలుగు రాష్ట్రంలో తొలిసారి సామాజిక బేధాలు తెర వెనుక పురుడు పోసుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని విధాలా బలమైన కమ్మ సామాజిక వర్గం తొలిసారిగా తమకు ఓ పార్టీ వుండాలనే ఆలోచన చేసింది. ఫలితంగా పుట్టుకువచ్చిందే తెలుగుదేశం పార్టీ.

తెలుగుదేశం పార్టీ కుల బంధాల సంగతి అలా వుంచితే, ఆ పార్టీ వస్తూనే చేసిన ఓ పనేమిటంటే, దాదాపు 90 శాతం మంది కొత్త, యువ రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం.  అప్పటి వరకు ఓ మాట ఎక్కువగా వినిపించేది. రాజకీయాల్లోకి యువత రావాలి. అప్పుడే దేశానికి మంచి జరుగుతుంది. కొత్త తరం రాజకీయాలు కనిపిస్తాయి అని పదేపదే పెద్దలు వేదికల మీద చెప్పేవారు. ఆ విధమైన మార్పుకు తెలుగుదేశం నాంది పలికింది.

కానీ…అదే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో కొత్త తరహా అవినీతికి బీజం వేసింది. అప్పటి వరకు అవినీతి అంతంత మాత్రంగా వుండేది. పైగా కుంభకోణాలు అని అప్పుడప్పుడు వినిపించేవి. కానీ యువరక్తం రాజకీయాల్లోకి వచ్చాక అవినీతికి అనే కన్నా డబ్బు సంపాదనకు రాజకీయాలు వాడుకోవడం అనే కొత్త మార్గాన్ని కనిపెట్టారు. 

అది ఆదిగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాధికారం, ధన సంపాదన, రెండూ పూర్తిగా మమేకమై, చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ప్రారంభమైంది. ఇలా రాజకీయాధికారం-ధన సంపాదన ఎప్పుడయితే కీలక విషయాలుగా మారిపోయాయో, చిన్న చిన్న చిరుతిళ్లు మానేసారు. 

కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలనే పద్దతికి అలవాటు పడ్డారు. ఆ విధమైన ఆలోచనకు, ఆ విధమైన సంపాదనకు రాజకీయ నాయకులకు అనువుగా కోట్లకు కోట్లు సంపాదించేందుకు దోహదం పడే రంగాలు కొన్ని వున్నాయి.

ఇక్కడ చిన్న ఉదాహరణ. ఓ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రయివేటు బస్ లు వుండేవి. ఆ రూట్లు జాతీయం అనే మాట తరచు వినిపించేది. అలా వినిపించినపుడు బస్ యజమానులు సూట్ కేసుతో హైదరాబాద్ లో వాలిపోయేవారు. ముందే చెప్పుకున్నట్లు రోజులు మారాక మళ్లీ జాతీయం అన్నారు. 

సూట్ కేసులు రెడీ అయ్యాయి. సంబంధిత పెద్దాయిన బస్ ఓనర్లతో ఇలా అన్నారని అప్పట్లో వినిపించింది. ''..మీరు ఇచ్చే ఈ బుల్లి సూట్ కేసు నాకెందుకు? ఒకేసారి వందల బస్ లు కొంటే వచ్చే పెద్ద సూట్ కేసు లెక్కే వేరు.'' అని. ఇదీ మారిన రాజకీయ సంపాదనా విధానానికి అద్దం పడుతుంది.

రాజకీయ నాయకుల సంపాదనలో కీలకమైన రంగాలు …1. భూములు…2. మైనింగ్…3. కాంట్రాక్టులు…4..బినామీ పెట్టుబడులు..ఇవీ కీలకమైనవి. వీటిల్లో వచ్చే ఆదాయాన్ని లేదా దోచుకునే ఆదాయాన్ని చూస్తే, అంతకు ముందు తరం రాజకీయ నాయకులు ఎంతటి అమాయకులో లేదా, ఎంతటి అల్ప సంతోషులో అనిపిస్తుంది. 

ఎందుకంటే ఈ కొత్త తరం యువ రాజకీయ నాయకులకు డబ్బు సంపాదనలో తెలిసినన్ని మార్గాలు కానీ, కనిపెట్టినన్ని దారులు కానీ సీనియర్లకు పాపం తెలియనే తెలియవు. ఇన్ని డబ్బు సంపాదన మార్గాలు ఆనాటి రాజకీయ నాయకులకు తెలియవు. జనాల దగ్గర తీసుకోకుండా ఇన్ని ఆదాయ సముపార్జన మార్గాలు వున్నాయన్నది ఈ తరం రాజకీయ నాయకులు నేర్చుకున్న కొత్త విషయం.

1. భూములు

భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు అన్నది ఓ నానుడి. రైతు భూమిని అమ్ముకుంటుంటే, నాయకులు భూమిని నమ్ముకున్నారు. ఎక్కడ అనాధ భూములు వున్నాయి. ఎక్కడ పోరంబోకు లేదా బంజర్లు వున్నాయి, ఎక్కడ దేవాలయ భూములు వున్నాయి ఇలా దుర్భిణీ వేసి ఎవరి నియోజక వర్గాల్లో వారు గాలించేసి, గాయబ్ చేయడం ప్రారంభమైపోయింది.

భూములు సంపాదించాలంటే చాలా మార్గాలు వున్నాయి. మొదటిది కొనుగోలు చేయడం. ఈ పని రాజకీయ నాయకులు పెద్దగా చేయరు. బ్లాక్ మనీ వస్తే, దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెద్ద మొత్తంలో భూములు కొంటారు తప్ప లేదంటే కొనే పని చేయరు. దేవాలయ భూములు వుంటే, లాంగ్ టెర్మ్ లీజ్ కు సంపాదించడం.

ఏకంగా 99 ఏళ్ల లీజు. ఆ లీజు మొత్తాలు చాలా తక్కువ మొత్తాల్లో వుండేలా చూసుకోవడం. ఆపైన వాటిని సబ్ లీజుకో, అద్దెకో ఇచ్చి కోట్లు సంపాదించడం. విశాఖలో ఆర్టీసీ స్థలాలు అన్నీ ఇలాగే మాయం అయ్యాయి. వాటిల్లో ఇప్పుడు భారీ మాల్స్, నగల దుకాణాలు వచ్చి చేరాయి. దేవాదాయ శాఖ ఆలయాలు, ధర్మ సత్రాలు నిర్వహణకు పూర్వం దాతలు, ధర్మ ప్రభువులు వేలాది ఎకరాలు దానం చేసారు. 

ఇప్పుడు ఆ భూములు అయితే అమ్మకం లేదా లీజు. భూములు లేకుండా దీనంగా మిగిలిన ధర్మ సత్రాలు కూడా లీజుకు ఇచ్చేసారు. మళ్లీ ఈ అద్దెల వసూళ్లలో సవాలక్ష అవకతవకలు. చాలా తొంభై శాతం దేవాలయ భూములు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ నాయకుల వద్దకు చేరిపోయాయి.

ఇక భూములు సంపాదించడానికి రెండో మార్గం. సంస్థలు పెట్డడం. సంస్థలు అంటే రకరకాలు. ఇండస్ట్రీలు, విద్యా సంస్థలు, ట్రస్ట్ లు, ఇలా రకరకాలు. ప్రయివేటు విద్యా సంస్థలకు అసలు ప్రభుత్వం స్థలాలు ఎందుకివ్వాలో అన్నది అర్థం కాని ప్రశ్న. పోనీ వీళ్లేమైనా ఉచితంగా విద్య నేర్పుతారా? అంటే అదీ వుండదు. 

అటానమస్ పేరిట ఫీజులు వారి ఇష్టం. డొనేషన్ల, పేమేంట్ సీట్లు ఇలా లెక్కే లేదు. ప్రభుత్వం మన చేతిలో వుంటే చాలు ఈ మార్గంలో భూములు సంపాదించడం పెద్ద కష్టమే కాదు. పేపర్ చేతిలో వుంటే భూమి అడగవచ్చు, సినిమాలు తీసేవాళ్లు అయితే భూమి తెచ్చుకోవచ్చు, ఓ ఫ్యాక్టరీ పెడతాం అని భూమి సంపాదించవచ్చు. 

ఇచ్చిన భూమి సక్రమ వినియోగం చేయకపోతే, వెనక్కు తీసుకుంటామని అంటే కోర్టులు వుండనే వున్నాయి. ఇలా వెళ్లి, అలా స్టే తెచ్చుకుని ఏళ్లకు ఏళ్లు ఆ భూములను అనుభవించడం. పైగా ప్రభుత్వం దగ్గర భూములు తీసుకని, ఆ భూములనే తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవడం.  ఆ రుణాలు ఎగ్గొడితే బ్యాంకులు భూముల మీదకు వస్తే మళ్లీ స్టే.

ఛారిటీ పేరుతో ప్రయివేటు ఆసుపత్రులకు ప్రభుత్వ భూములు. ఇదో పెద్ద చిత్రమైన వ్యవహారం. ప్రయివేటు ట్రస్ట్ ఆసుపత్రులకు ప్రభుత్వ భూములు ఇస్తే కొంతమందికి అయినా ఉఛిత వైద్యం చేసే షరతు మీద ఇస్తారు. కానీ ఆ తరువాత ఆ షరతు ఎలా నెర‌వేరుతోందో గమనించేవారు వుండరు. 

ఈ షరతు పక్కన పెడితే మిగిలిన వారిని ఫీజుల పేరుతో ఎలా పీల్చి పిప్పి చేస్తున్నారో పట్టించుకునేవారు వుండరు. ట్రస్ట్ ఆసుపత్రి పేరుతో కోట్లు కొల్ల కొట్టడానికి ప్రభుత్వ భూములు. పైగా ఆసుపత్రి నేరుగా పరీక్షలు, ఫీజులు వసూలు చేయదు. దానికి మరో బినామీ కంపెనీ వుంటుంది. దానికి దీనికి నామినల్ గా చిన్న మొత్తంతో ఒప్పందం వుంటుంది. ట్రస్ట్ ఆదాయం అంతే. కానీ కోట్లు ఫీజుల పేరుతో కొల్లగొట్టే ఆ కంపెనీ నుంచి దొడ్డిదారిన ఆసుపత్రి యాజమాన్యాలకు అందాల్సినమొత్తం అందాల్సిన రూటులో అందుతుంది.

ఇక బి ఫారం పట్టా భూములు, ఇనాం భూములు, అనాథ‌ భూములు అంటూ ఇలా సవాలక్ష వ్యవహారాలు. రెవెన్యూ వ్యవహారాలు తెలిసిన వారు పక్కలో వుంటే చాలు, ప్రభుత్వం మనదైతే చాలు ఎన్నివిధాలుగా సంపాంచివచ్చో భూముల్ని. అన్ని విధాల్లోనూ ఆరితేరిపోయారు మన రాజకీయ నాయకులు. ఇంక అలాంటి నేపథ్యంలో చిన్నచిన్న చిలక్కొట్టుళ్లు ఎందుకు?

2. మైనింగ్

రాజకీయ నాయకులకు మైనింగ్ అనేది కామధేనువు. పిండుకున్నవారికి పిండుకున్నంత. మైనింగ్ అంటే బహుళార్థక పదం. ఇసుక దగ్గర నుంచి గ్రానైట్ మీదుగా ముడి ఇనుము వరకు ఏదైనా వుండొచ్చు. ఈ మైనింగ్ వ్యాపారంలో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే ఓ సామాజిక వర్గం ఆరితేరిపోయింది. ఎంత ఆరితేరిపోయింది అంటే ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. 

ప్రతి జిల్లాకు ఈ వ్యాపారం పేరుతో పాకేసింది. విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యాపారం మూడు వంతులు ఈ వర్గం చేతిలోనే. మైనింగ్ లైసెన్స్ సంపాదించడం అంటే అంత వీజీ కాదు. ఆ వ్యాపారంలో ఆరితేరి వుండాలి. రాజకీయ నాయకుల అండా దండా వుండాలి. అప్పుడే సాధ్యం.

ఈ వ్యాపారంలో చలామణీ అయ్యేంత నల్ల ధనం మరెక్కడా వుండదని ప్రతీతి. ఈ మైనింగ్ వల్ల ఇటు రాజకీయ నాయకులు అటు ఆ రంగంలోని కీలక ఉద్యోగులు ఇద్దరికీ లాభసాటి వ్యవహారమే. జరుగుతున్న అక్రమ మైనింగ్ ను చూసీ చూడనట్లు వదిలేయడమే ఈ ఉద్యోగుల కర్తవ్యం. ఎంత ఏరియా లీజుకు తీసుకున్నారు, ఎంత ఏరియాకు తవ్వకాలు ఆక్రమించారు. 

ఎన్ని టన్నులకు ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇచ్చారు. ఎన్ని టన్నులకు ఎగ్గొట్టారు అన్నది ఎవరికీ పట్టని వ్యవహారం. ప్రతి మైనింగ్ లోనూ ఇదే వ్యవహారం. ఓ గోదావరి జిల్లాలో గతంలో అధికారంలో వున్న ఓ ఎంపీ కేవలం ఇసుక‌ మీద వందల కోట్లు వెనకేసారని వార్తలు వినిపిస్తూ వుంటాయి ఇప్పటకీ. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు, అటు రాయలసీమలో మైనింగ్ మీద సంపాదించని రాజకీయ వేత్తలు లేరంటే అతిశయోక్తి కాదు.

ఇలా మైనింగ్ మీద వచ్చిన నల్ల ధనాన్ని సినిమాల్లోకి పంప్ చేసే మహానుభావులు మరెందరో? అదే నల్ల ధనాన్ని రియల్ ఎస్టేట్ లోకి పంపించి మళ్లీ అంతకు అంతా సంపాదించడమే కార్యక్రమం. పొరపాటున అక్రమ మైనింగ్ ను కనిపెట్టి ఎవరైనా సీజ్ చేస్తే, కోర్టు, స్టే వుండనే వుంటాయి.  మరి వందల కోట్లు తెచ్చే మైనింగ్ వుండగా, బదిలీలు, చిన్న చిన్న పనులు లాంటి చిలక్కొట్టుళ్లు రాజకీయ నాయకులకు ఎందుకు?

3. కాంట్రాక్టులు

కాంట్రాక్టులు అంటే చిన్నా చితక అర్థం కాదు. పైగా ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ అనే కొత్త పేరు వచ్చింది దీనికి. ప్రభుత్వ పనులు కాంట్రాక్టు తీసుకోవడం, చేసుకోవడం అన్నది సింపుల్ మీనింగ్. కానీ దీని వెనుక చాలా వుంది. ప్రభుత్వ పనుల ప్లానింగ్ దగ్గర నుంచే అవినీతి ఆరంభం అవుతుంది. మామూలుగా మనం చేయించుకుంటే ఓ పని పది రూపాయల్లో అవుతుంది అనుకుంటే కాంట్రాక్టుకు ఇస్తే 15 రూపాయలు అవుతుంది. కానీ మన సౌలభ్యం కోసం కాంట్రాక్టు ఇస్తాం. అదే పని ప్రభుత్వం చేస్తే యాభై రూపాయల అంచనా వుంటుంది.

అంటే ప్రభుత్వ పనుల ఎస్టిమేషన్ నుంచే అవినీతి ఆరంభం అవుతుంది. మామూలుగా యూనిట్ కు అయిదు వందలు అయ్యే పని ప్రభుత్వం లెక్కల్లో వెయ్యి రూపాయలు వుంటుంది. కాంట్రాక్ట్ లో లోయెస్ట్ కొటేషన్ అని ఇచ్చినా అక్కడికి ఇంకా బోలెడు లాభం వుంటుంది. ఇది లోకల్ రాజకీయనాయకులకు పదిశాతం, సంబంధితం ఉద్యోగులకు పదిశాతం, ఇంకా చిన్నా చితక జనాలకు పదిశాతం పోగా, కనీసం ఇరవై శాతం కాంట్రాక్టర్ కు వుంటుంది.

కానీ పెద్ద పనుల వ్యవహారం ఇంకోలా వుంటుంది. ముందుగా కాంట్రాక్టు తీసేసుకుంటారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే పేరిట ప్రభుత్వమే వడ్డీ లేని అప్పు ఇస్తుంది. ఆ మొత్తం చేతిలో పడ్డాక మెల్లగా పనులు మొదలు పెట్టొచ్చు. సగంలోకి తెచ్చి ఆపేయచ్చు కూడా. ఎందుకు ఆపేసారు అంటే రేట్లు కిట్టడం లేదు అని ఓ లెటర్ రాసిపడేయడమే. కిట్టనపుడు ఎందుకు ఒప్పుకున్నావు అని ప్రభుత్వం అడగదు. ఉదారంగా మళ్లీ అంచనాల సవరిస్తుంది. రేట్లు పెంచుతుంది. దాంట్లో మళ్లీ ఎవరి కమిషన్లు వారికి వుంటాయి.

కానీ ఇలా కాంట్రాక్టులు సంపాదించడం, రేట్లు సవరించడం అంటే అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కేవలం అధికారంలో వున్నవారికి, వారిని నమ్ముకున్నవారికి మాత్రమే సాధ్యం. ఇన్ ఫా స్ట్రక్చర్ కాంట్రాక్టుల్లో బిఓటి అన్నది మరీ చిత్రం ఇలాంటివి అందరికీ రావు చాలా చాలా పలుకుబడి వుండాలి. ఆయా కంపెనీల్లో రాజకీయ నాయకుల బినామీ పెట్టుబడీ వుండాలి. 

కంపెనీ ప్రొఫైల్ చూపించి రోడ్ కాంట్రాక్టు తెచ్చుకోవడం, ఆ కాంట్రాక్టు చూపించి ఇంత ఆదాయం వస్తుందని లెక్కలు కట్టి, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోవడం, ఆపై పని పూర్తి చేసి, ఇక టోల్ గేట్ ల పేరుతో, యూజర్ చార్జీల పేరుతో దండుకోవడమే దండుకోవడం.

4.బినామీ పెట్టుబడులు

ఈ పదానికీ నానార్ధాలు వున్నాయి. తమ తమ నియోజక వర్గం పరిధిలో లాభసాటి వ్యాపారాలు చాలా వాటిలోకి రాజకీయ నాయకుల బినామీ పెట్టుబడులు వెళ్తూనే వుంటాయి. రాజకీయ నాయకుల బినామీ పెట్టుబడులు ఉభయతారకంగా వుంటాయి. బార్ల దగ్గర నుంచి మాల్స్ వరకు రాజకీయ నాయకుల పెట్టుబడులు వుంటే వ్యాపారంలో ఎలాంటి అక్రమాలు వున్నా చలామణీ అయిపోతాయి. వ్యాపారాలకు అధికారులు అడ్డం పడే పనే వుండదు.

చాలా మంది రాజకీయ నాయకుల బినామీ పెట్టుబడులు వారివారి ప్రాంతాలను దాటి దూరం వెళ్తుంటాయి. వసూలు కెపాసిటీని బట్టి సినిమాల్లోకి, వడ్డీ వ్యాపారాల్లోకి ప్రవహిస్తుంటాయి. ప్రయివేటు బస్ ల రూపంలో తిరుగుతుంటాయి. మరీ భారీ మొత్తాలు అయితే చాలా ధర్మంగా రూపాయి వడ్డీకి, కాస్త మీడియం మొత్తాలు అయితే రెండు రూపాయల వడ్డీకి తిరుగుతుంటాయి.  

తమ దగ్గరకు వివిధ పనుల మీద వచ్చే వ్యాపార జనాలను, వారి వ్యాపారాలను కని పెట్టి, వాటిలోని లాభసాటిని గుర్తించి, తమ డబ్బును అందులోకి మళ్లించడం అన్నది రాజకీయ నాయకులు నేర్చుకున్న కళ.

5. బ్యాంకు రుణాలు

అన్నింటికి మించిన ఆదాయం బ్యాంకు రుణాల్లోనే. రాజకీయాల అండ వుంటే రుణాలు ఈజీ అవుతాయి. కేంద్రంలో పలుకుబడి వుండాలి. ఎంపీ పదవి చేతిలో వుండాలి. వందలు, వేల కోట్ల రుణాల వచ్చి పడతాయి. చాలా పద్దతిగా కంపెనీలు ఫ్లోట్ చేయాలి. ప్రొఫైల్ పెంచాలి. ఆపై రుణాలు..రుణాల మీద రుణాలు. ఆపై రాని బాకీలు. పలుకుబడి ఉపయోగించి రద్దు చేయించుకోవడం. 

మోడీ వచ్చే వరకు ఇది చాలా వరకు నడచింది. ఎప్పుడు అయితే బ్యాంకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఇలాంటి వ్యవహారాలు కట్టడి చేసారో, ఇక అక్కడి నుంచి ఈ లోన్ల బాగోతం బయటకు రావడం ప్రారంభం అయింది. లగడపాటి, రఘురామకృష్ణం రాజు లాంటి రాజకీయ నాయకుల, డెక్కన్ క్రానికల్ లాంటి మీడియా కంపెనీలకు వేల కోట్ల బ్యాంకు రుణాల బకాయిలు వున్నాయంటే, ఏం జరిగి వుంటుందో అర్థం చేసుకొవచ్చు. 

కేవలం బ్యాంకులను, వాటి రుణాలను అడ్డం పెట్టుకుని, కోట్ల దగ్గర నుంచి వందలు,వేల కోట్లను ఈ దేశంలో బడాబాబులు దోచేసారంటే ఈ దోపీడీని అర్థం చేసుకోవచ్చు.

6 ఇంకా ఎన్నో

కేవలం ఇవి మాత్రమే కాదు. రాజకీయ నాయకులు సంపాదనకు, సంపాదించిన దానిని అంతకు అంతా చేసుకోవడానికి వున్న మార్గాలు. అవి అనంతం. ప్రతి రంగంలోనూ ఇవ్వాళ రాజకీయ నాయకులు చొచ్చుకుపోయారు. లేదూ అంటే ప్రతి రంగంలోనూ రాజకీయ నాయకుల పెట్టుబడులు వున్నాయి.  

వారి వారి నియోజక వర్గాల్లో ఎక్కడ సంపాదన వుంటే అక్కడ వాలిపోవమడే. ఆఖరికి నియోజక వర్గ నిధుల్లో కూడా కమిషన్ వ్యవహారాలు. ఎంపీ  నిధులు, ఎమ్మెల్యే నిధులు అంటే టెన్ పర్సంట్ ఆటోమెటిక్ గా వారి జేబుల్లోకి రావాల్సిందే. టెన్ పర్సంట్ ఇచ్చేస్తే చాలు ఫండ్స్ రిలీజ్ అయిపోవడమే.

రాజకీయం ఇంత లాభసాటిగా మారింది కేవలం చదువుకున్న రాజకీయ నాయకుల వల్ల. అంతే కానీ పంచెలు కట్టిన నాటి తరం రాజకీయ నాయకుల వల్ల కాదు. వారి హయాంలో పరిస్థితి చాలా మెరుగు. ఇప్పటి పరిస్థితితో అంచనా వేస్తే. ఇక్కడ తప్పు పట్టాల్సింది రాజకీయ నాయకులను మాత్రమే కాదు. మీడియాను కూడా. ఎందుకంటే మీడియాకు కూడా ఈ పాపంలో భాగం వుంది. అది మూడు విధాలుగా.

1. తమకు అనుకూలమైన పార్టీ అధికారంలో వుంటే ఇలాంటి వ్యవహారాలు అన్నీ కప్పి పుచ్చడం. అదే మన పార్టీ అధికారంలో లేకపోతే అదేదో అన్యాయం ఇప్పుడే కొత్తగా జరుగుతునట్లు గగ్గొలు పెట్టడం.

2. బడా కాంట్రాక్టుల నుంచి దొడ్డి దారిన ముడుపులు అందుకోవడం.

3. లోకల్ లో కొందరు మీడియా జనాల చిలక్కొట్టుడులు. బెల్ట్ షాపులు, ఇసుక తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు,  ఇలా లోకల్ లో జరిగే ప్రతి దందాలోనూ అక్కడ చిన్న, చితక మీడియా జనాలకు పావల, పదిపైసలు కేటాయించడం అన్నది, కొన్ని చోట్ల నెలవారీ పంపకాలు అన్నవి వున్నాయన్నది క్షేత్ర స్థాయిలో వినిపించే వాస్తవం. పెద్ద వాళ్లు తింటే ఫలహారం అయినపుడు, చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు ఎందుకు అవుతాయి. వారి వ్యవహారం వారిది.

మొత్తం మీద రాష్ట్రాన్ని అన్ని విధాలుగా డబ్బుగా మార్చేసుకుంటున్నారు. దోచేసుకుంటున్నారు. ఇది ఈ పార్టీ వ్యవహారం,. ఆ పార్టీ వ్యవహారం కాదు. 1980 దశకం నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో వున్నా జరుగుతున్న వ్యవహారం. అవసరం అయితే చటుక్కున పార్టీలు మారేది అందుకే. వీరికి పార్టీలు ముఖ్యం కాదు. వ్యాపారాలు ముఖ్యం..దోపీడి ముఖ్యం. ఇది భూమి లోలోపలికీ వేళ్లూనుకుపోయిన విషవృక్షం. ఇలా వెర్రి తలలు వేస్తూ ఎదుగుతూనే వుంటుంది. 

నిజానికి మోడీ స్వఛ్ భారత్ అంటూ రెండేళ్లు ప్రయత్నించి ఊరుకున్నట్లు, ఆంధ్ర సిఎమ్ జగన్ కూడా గత ఏడాదిగా ఈ మైనింగ్ వ్యవహారాలను, భూముల వ్యవహారాలను ఓ కొలిక్కి తేవాలనుకుంటున్నారు. కానీ అదంతా కక్షసాధింపుగా ప్రొజెక్ట్ చేయడం ప్రారంభమైపోయింది.

కొర్టులకు వెళ్లడానికి, స్టే లు తెచ్చుకోవడాలు మొదలైపోయాయి. మీడియా వ్యతిరేక కథనాలు ఆరంభమైపోయాయి. మరి జగన్ కూడా ఆరంభశూరుడు అనిపించుకుంటారా? ఈ అవినీతి వేళూడబీకి, దాని అంతం చూడగలుగుతారా? వెయిట్ అండ్ సీ.  

– చాణక్య