అన్ లాక్ తర్వాత ప్రయాణికులు తెలుగు రాష్ట్రాల మధ్య అటు ఇటు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ముక్కుపిండి మరీ రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నా.. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ చేతులెత్తేశాయికానీ పరిష్కారం చూపలేదు. చివరకు దసరా సీజన్ కూడా అయిపోయింది. ఆర్టీసీకి ఆదాయం పోయింది, ప్రయాణికుల జేబులకి చిల్లు కూడా పడింది.
తీరా ఇప్పుడు తీరిగ్గా అధికారుల మధ్య సయోధ్య కుదిరింది. కొత్తగా చేసిందేమీ లేదు, పాత పద్ధతిలోనే తెలంగాణ గొంతెమ్మ కోర్కెలకు ఏపీ తలూపగా.. వారు సంతోషించి పచ్చజెండా ఊపారు. ఈరోజు చర్చల లాంఛనం పూర్తయితే రేపట్నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మొదలవుతాయి. తెలంగాణలో ఏపీ బస్సులు, ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు ప్రత్యక్షమతాయి.
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారుల మధ్య కుదిరిన అవగాహన మేరకు.. తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో 1,61,258 కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతుంది. అదే ఏపీ.. తెలంగాణ పరిధిలో 1,60,919 కిలోమీటర్ల మేర తన బస్సుల్ని నడిపిస్తుంది. లాక్ డౌన్ ముందు వరకు ఏపీ.. 2,65,367 కిలోమీటర్లు తన బస్సుల్ని తెలంగాణ పరిధిలో నడపగా.. ఇప్పుడు దాంట్లో లక్షకు పైగా కిలోమీటర్లలో కోతపడింది.
హైదరాబాద్-విజయవాడ మార్గంపై తెలంగాణ పట్టు పెరగబోతోంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏపీ 374 బస్సుల్ని తిప్పుతుండగా.. ఇప్పుడు 192కి వాటి సంఖ్య తగ్గించుకోబోతున్నారు. తెలంగాణ బస్సులు ఇప్పటి వరకూ ఈ రూట్ లో కేవలం 162మాత్రమే తిరిగేవి. కొత్త అవగాహన ప్రకారం ఇకపై ఆ సంఖ్య 273కి పెరుగుతుంది. కర్నూల్ సెక్టార్ లో 25వేలు, భద్రాచలం సెక్టార్ లో 13వేల కిలోమీటర్ల మేర ఏపీ బస్సు సర్వీసుల్ని తగ్గించుకుంటోంది.
నూతన అవగాహనతో ఏపీఎస్ఆర్టీసీకి భారీ నష్టం చేకూరుతుంది. అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ వెనక్కు తగ్గడం గమనార్హం. మొత్తంగా ఏటా 270 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తుందని అంచనా. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీకి లాభం చేకూరబోతోంది.
తాము బస్సుల సంఖ్య తగ్గించుకోమని, కావాలంటే తెలంగాణ ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్య పెంచుకోవచ్చని ఇప్పటి వరకూ ఏపీ సూచిస్తూ వచ్చినా అక్కడినుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆదాయం తగ్గించుకోడానికే ఏపీ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను పరిశీలిస్తోంది.
మొత్తమ్మీద లాభనష్టాల సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి ప్రజలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లూ బస్సుల్లేక, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి గురైన ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీని బస్సులెక్కుతారు.