సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేసిన ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏపీ హైకోర్టులో రోస్టర్ వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎన్వీ రమణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకున్నట్టు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా కేసులు కేవలం కొందరు జడ్జిలకే వెళుతుండడం, రాష్ట్ర హైకోర్టులో జడ్జిల రోస్టర్‌ను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రధాన ఆరోపణ.
ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి హైకోర్టులో కేసుల విచారణ రోస్టర్ వివరాలన్నింటిని బయటకు తీయించారని సమాచారం. అలాగే కొన్ని తీర్పులు, ఆదేశాలను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబర్ 7న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి ఇప్పటి వరకు రోస్టర్ల వివరాలను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం.
దీంతో మహేశ్వరి నేతృత్వంలో ఎన్నిసార్లు రోస్టర్ మార్చారు? ఏఏ న్యాయమూర్తులు ఎలాంటి కేసులు విచారించారు తదితర వివరాలతో జాబితాను అందజేసినట్టు సమాచారం. అయితే గతంలో ఏ ప్రధాన న్యాయమూర్తి మార్చనంతగా రోస్టర్‌ను ఇప్పటి చీఫ్ జస్టిస్ మార్చినట్టు తెలుస్తోంది.
ఓ నలుగురు న్యాయమూర్తులు మాత్రం ఎక్కువ సార్లు కేసులను విచారిస్తున్నారని కూడా తేలినట్టు సమాచారం. ఈ నలుగురు కూడా జగన్ ఫిర్యాదులో ప్రస్తావించిన వారే ఉన్నారని తెలిసింది. ముఖ్యమైన కేసులన్నింటిని ఈ నలుగురు న్యాయమూర్తులే విచారిస్తున్నట్టు తెలిసింది.
ఒక వైపు తన హయాంలో రోస్టర్‌కు సంబంధించి వివరాలను తెప్పించుకున్న చీఫ్ జస్టిస్ …. తాజాగా మరోసారి రోస్టర్‌ను మార్చారు. రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో మార్పు చేశారు. చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్యాసనం రాజధాని కేసులను విచారించేది.
మారిన రోస్టర్ ప్రకారం తాజాగా జస్టిస్ రాకేశ్ కుమార్ స్థానంలో జస్టిస్ నైనాల జయసూర్య వచ్చారు. బహుశా డిసెంబర్లో రాకేశ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన్ను మార్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.