నిజామూద్దీన్ కేంద్రంగా నడుస్తున్న తబ్లీగ్ జమాత్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్నేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారి తబ్లీగ్ జమాత్ వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా ప్రబలుతున్న మార్చి నెలలో విదేశాల నుంచి ముస్లింలను రప్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం, లాక్ డౌన్ ఆర్డర్స్ ఇచ్చాకా మసీదులో భారీ ఎత్తున మనుషులను ఉంచడం.. తదితరాలు ఈ సంస్థ నేరాలుగా మారే అవకాశం ఉంది.
లాక్ డౌన్ ఆర్డర్స్ వచ్చాకా దాదాపు 2000 మందిని ఒకే చోట ఉంచి వీలైనంతగా కరోనాను వ్యాపింపజేసింది ఈ సంస్థ. దేశంలో ఇప్పటి వరకూ తేలిన కరోనా కేసులకు హాట్ స్పాట్ ఈ తబ్లీగ్ జమాత్ అని స్పష్టం అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో దీని పుట్టుపూర్వోత్తరాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా సమాచారం. లాక్ డౌన్ ఉత్తర్వులను ధిక్కరించినందుకు గానూ ఇప్పటికే ఈ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తబ్లిగ్ కు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై ఈడీ దృష్టి సారించిందట.
దేశం నలుమూలల నుంచి.. ఎక్కడో ప్రకాశం జిల్లా కనిగిరి, అనంతపురం జిల్లా హిందూపురం వంటి చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా ముస్లింలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలంటూ విదేశీ ముస్లింల చేత సందేశాలు ఇప్పించిందంటే ఈ సంస్థకు భారీ నెట్ వర్క్ ఉన్నట్టే.
అందునా.. ఆ ప్రార్థనలు చేసే వాళ్లు తప్పుడు కారణాలు చెప్పి ఇండియాకు వచ్చారని తేలింది. ఆరు నెలల పాటు విజిటింగ్ వీసాలు, టూరిస్ట్ వీసాలు అంటూ తీసుకుని.. దేశంలో మత ప్రచారాలు, మతబోధనలు సాగించారట వాళ్లంతా. ఇలా వాళ్లంతా ఇప్పుడు బుక్ అయ్యారు.
వారందరినీ బ్లాక్ లిస్టులో పెట్టారు ఇప్పటికే. ఇక మత ప్రచార కార్యక్రమాలు నడవాలంటే వాటికి కీలకం నిధులు.. ఆ నిధులు ఎవరిచ్చారు, ఎక్కడ నుంచి వచ్చాయనే అంశం మీద ఈడీ దృష్టి పెట్టిందని తెలుస్తోంది. కొంచెం కూడా ఆలోచన లేకుండా కరోనా వేళ కార్యక్రమాలు నిర్వహించి ఆ మత సంస్థ తనంతకు తానుగా పులినోట్లో తల ఇరికించుకున్నట్టుగా ఉంది.