కేసీఆర్ కేబినెట్ నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను అనూహ్యంగా తప్పించడం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ కట్టడి కంటే, మంత్రి ఈటల రాజకీయ ప్రస్థానంపైనే ఎక్కువ చర్చ జరుగు తోంది. ఈటలను సొంత పార్టీ నేతలు, మంత్రులు విమర్శిస్తుంటే, ఇంతకాలం ప్రత్యర్థులుగా భావిస్తున్న వారంతా అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ భార్య జమున రంగంలోకి దిగారు. తమ వ్యాపారాలపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పారు.
అంతేకాదు, ప్రభుత్వ అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటామని గట్టిగా చెప్పుకొచ్చారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని ధీమాగా ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే…
‘మెదక్ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా? మా స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధాకరం. 1992లో దేవరయాంజల్ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తు న్నారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు.
సర్వే చేయొద్దని మేం చెప్పలేదు. మా సమక్షంలో సర్వే చేయాలని చెప్పాం. మంత్రులు కూడా దొంగచాటుగా కలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నాం. సమైక్య పాలనలో కులాలు చూడలేదు. ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారు. మాకు అన్ని కులాలూ సమానమే. అందరికీ స్వేచ్ఛ కావాలి. పౌల్ట్రీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాం’ అని జమున చెప్పుకొచ్చారు.
తన భూముల్లో సర్వే చేయాలని రాత్రికి రాత్రే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై జమున హైకోర్టుకెక్కిన విషయం తెలిసిందే. హైకోర్టులో ఆమెకు ఊరట లభించింది. ముందు నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మళ్లీ మొదటి నుంచి ఈటల భూముల్లో సర్వే ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు ఈటల నెమ్మదిగా కేసీఆర్‌పై స్వరం పెంచుతున్నారు.
టీఆర్ఎస్ మనహా అన్ని పార్టీల అగ్రనేతలతో ఆయన తీరిక లేకుండా చర్చలు జరుపుతూ బిజీగా గడుపుతున్నారు. బీజేపీలో చేరి రాజీనామా చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కానీ ఆయన మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఈటల సతీమణి నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడ్డం సరికొత్త పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.