ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. అంతకు ముందు జగన్ తనకు పదవిని ఇవ్వమంటూ ప్రజలను తొమ్మిదేళ్ల పాటు కోరారు. తన తండ్రి మరణానంతరమే జగన్ ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆ పని చేయలేదు. ఆ తర్వాత జగన్ సీఎం పీఠం అనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ విషయంలో అనేక కఠిన పరీక్షలు ఎదరైనా, ఎన్నో కష్టాలు ఎదురైనా జగన్ వెరవలేదు. రాజకీయాలకు అతీతంగా చూసినా జగన్ 2009 నుంచి 2019ల మధ్యన చేసిన ప్రయాణం అనితర సాధ్యమైనది.
తరచిచూస్తే అదో వ్యక్తిత్వ వికాస పాఠం. సీఎం పీఠం అనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని జగన్ తొమ్మిదేళ్లు నిద్రాహారాలు మాని కష్టపడ్డారు. జగన్ లక్ష్యం సీఎం పీఠం కావొచ్చు, మరొకరికి అలాంటి ఇంకో జీవిత లక్ష్యం ఉండొచ్చు. ఎవరైనా.. తమ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత కష్టపడాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఎన్నో వ్యయప్రయాసాలను ఓర్చుకుని జగన్ తను అనుకున్నదాన్ని సాధించుకున్నారు. ఊరికే కూర్చుంటే లేదా, కావాలనుకుంటే, కలలు కంటే, ప్రణాళికలు రచిస్తేనే ఏదీ రాదు.. కష్టపడే తత్వం ఉంటేనే ఏదైనా దక్కుతుందనేందుకు జగన్ ఒక గొప్ప ఉదాహరణ అవుతారు.
ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులుగా చేసిన మహామహా నేతల తనయులకూ జగన్ కూ స్పష్టమైన తేడా అక్కడే ఉంది. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి గొప్ప పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల తనయులు, ఎన్టీఆర్ తనయులు.. అవకాశాలున్నా ఆ తర్వాత ఆ స్థాయికి ఎదగకపోవడానికి, జగన్ ఆ స్థాయికి ఎదగడానికి ప్రధానమైన వ్యత్యాసం వ్యక్తిగతం జగన్ కష్టపడటం. ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించడాలే తేడా. అంత కఠినమైన కష్టాలను ఎదుర్కొని పదవిని సాధించుకున్న జగన్ దాన్ని అంత తేలికగా వదలకూడదనే అనుకుంటున్నారు అని ఆయన ప్రత్యర్థులు కూడా గ్రహించాలి.
ఒకవేళ వైఎస్ మరణానంతరం వెంటే జగన్ ను కాంగ్రెస్ హై కమాండ్ సీఎంగా చేసి ఉంటే.. ముఖ్యమంత్రిగా జగన్ పని తీరు ఎలా ఉండేదో ఎవరో అంచనా వేయలేనిది. తన తండ్రి చూపిన దారిలోనే జగన్ పాలన సాగేదేమో, అయితే తొమ్మిదేళ్ల అనుభవం జగన్ కు మరెన్నో నేర్పించి ఉంటుందనేది మాత్రం వాస్తవం. అధికారాన్ని అందుకునేంత వరకూ జగన్ ను ఆయన ప్రత్యర్థులు చాలా తక్కువ అంచనా వేశారు! వీళ్లంతా 2014లో జగన్ సీఎం పీఠాన్ని అందుకోలేకపోవడాన్ని తక్కువ చేసి మాట్లాడారు కానీ.. ఆ తర్వాత జగన్ ఏం చేస్తున్నారో పట్టించుకోలేదు!
2014లో జగన్ కు సొంతంగా 67 సీట్లొచ్చాయి, ఓట్ల లెక్కలో టీడీపీ, బీజేపీ, జనసేనల బలం కన్నా జగన్ కేవలం ఐదు లక్షలు మాత్రమే వెనుకబడ్డారనే వాస్తవాలను ప్రత్యర్థులు గుర్తించలేకపోయారు. ఓటమి ఎదరైనా తర్వాత నిస్పృహకు గురి కాకుండా, రెట్టింపు శక్తిని క్రోడీకరించుకుని జగన్ ఐదేళ్ల పాటు జనం మధ్యనే గడిపారు. జగన్ ను జనం ఓన్ చేసుకున్నారు. 67 సీట్లు కాస్తా 151 అయ్యాయి!
మరి అధికారం సాధించుకునే ప్రక్రియలోనే ఎంతో వ్యూహాత్మకంగా, ప్రజలకు ఎలా చేరువవ్వాలో ఎరిగినట్టుగా వ్యవహరించిన జగన్ కు ఇప్పుడు అధికారం అనే ఆయుధం ఉంది. దాంతో రెండేళ్లను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే జగన్ ప్రత్యర్థులకు ఆయన గురించి మరింతగా అర్థం అవుతూ ఉండాలి! సరిగ్గా రెండేళ్ల పరిణామాలను గమనిస్తే.. సీటుపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకే, అధికారం తన దగ్గర అట్టి పెట్టుకోవడానికి ఏమేం చేయాలో జగన్ అవన్నీ చేస్తూ పోతూ ఉన్నారు!
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు జగన్ టు జనాలు అనే పరిస్థితి కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో. అమెరికన్ అధ్యక్ష పాలన తరహాలో ప్రెసిడెంట్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ప్రెసిడెంట్ ఏం చేస్తారో, ప్రెసిడెంట్ ప్రజలకు ఏం చెబుతారో.. అనే పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి డైరెక్టుగా ప్రజలతో సంభాషించరిక్కడ, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు కూడా పెట్టరు, గంటల కొద్దీ ఊకదంపుడు ప్రసంగాలు కూడా ఉండవు…అయినా.. జగన్ కూ, ప్రజల మధ్యన ఒక కచ్చితమైన కమ్యూనికేషన్ ఏర్పడింది!
ప్రజల పరిస్థితుల గురించి జగన్ కు చేరవడానికి ఎంతో యంత్రాగం ఉండనే ఉంటుంది ఎక్కడైనా. ఆ యంత్రాంగం పని తీరు మీదనే ముఖ్యమంత్రుల నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. అయితే జగన్ పని తీరులో కనిపిస్తే.. అంతకు మించి ఏదో ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఎన్నో రకాల కులాలు, మతాలు, భిన్నమైన వర్గాలు మిళితమైన సమాజంలో ఎవరికి వారిగా టార్గెట్ గా చేసుకుంటూ జగన్ ద్వారా అమలవుతున్న పథకాలు ఆయన ఇమేజ్ ను బలీయమైన స్థితికి తీసుకెళ్తున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు?
ఓట్లు, సీట్లూ చర్చ కాదు కానీ, రెండేళ్ల పాలనలో గత ముఖ్యమంత్రులను జగన్ మరిపిస్తున్నాడని మాత్రం కచ్చితంగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఏపీలో అయినా, ప్రస్తుత తెలంగాణలో అయినా… గత కొన్ని దశాబ్దాలుగా సంక్షేమ పాలనే సాగుతోంది. ఉచిత పథకాలు, ప్రజలకు డైరెక్టు క్యాష్ పంచే ప్రోగ్రామ్సే అమల్లో ఉన్నాయి. జగన్ ఉచిత పథకాలను విమర్శించే వాళ్లలో అధికం తెలుగుదేశం అభిమానులే. మరి చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. ఈ ఉచిత పథకాలు ఏమీ ఉండవని వాళ్లు చెప్పించగలరా?
వచ్చే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్ని ఉచిత హామీలు ఇస్తారో ఊహించడం కూడా కష్టం కాదు. ప్రస్తుతం జగన్ ఇస్తున్న వాటికి మించి ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడమే తెలుగుదేశం మెనిఫెస్టో అవుతుంది కానీ, మరో రకంగా ఉండదు. చంద్రబాబు హయాంలో గత ఐదేళ్లలో పండగలకు అంటూ కానుకలు ఇవ్వడం, పప్పు బెల్లాలు పంచడమే అత్యంత ప్రహసనమైన ఉచిత పథకం. జగన్ కనీసం అలాంటి పనులైనా చేయడం లేదు.
జగన్ హయాంలో గరిష్టంగా లబ్ధి పొందుతున్న వారు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, చేతి వృత్తుల వారు. అది కూడా అధికారం అందిన తర్వాత ఐదో ఏటన, మళ్లీ ఎన్నికలు వచ్చేటప్పుడు కాకుండా జగన్ అధికారంలోకి రాగానే ఒక్కో మాటను నిలబెట్టుకుంటూ పోయారు. ఇప్పుడు మూడో సారి తన హామీలను అమలు చేస్తున్నారు. రైతులకు కూడా ప్రతియేటా నిర్ధిష్టమైన సాయాన్ని అందిస్తున్నారు.
పెట్టుబడులు పెట్టే సమయంలో నిధులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా పెట్టుబడి సాయాలతో పాటు, గత ఏడాదికి సంబంధించిన పంటల బీమా మొత్తాన్ని కూడా జగన్ అందించారు. అవసరంలో ఆదుకునే వాళ్లనే ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్ అదే పని చేస్తూ ఉన్నారు, ప్రజల గుండెల్లోకి పాతుకుపోతున్నారు. ఆ లోతులెంతో చూడాలంటే క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాల్సిందే, పచ్చపాతపు, పక్షపాతపు చూపులను తొలగించుకోవాల్సిందే!
ఓట్లూ, సీట్ల లెక్కలకు ఇప్పుడు సమయం కూడా కాకపోవచ్చు. సార్వత్రిక ఎన్నికల వరకూ జగన్ ఇలానే ముందుకు సాగితే.. స్థానిక ఎన్నికల ఫలితాల తరహాలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలూ వచ్చినా ఆశ్చర్యం లేదు.
రెండేళ్లలో చంద్రబాబు తీరు ఇది!
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండేళ్లలో ప్రజలకు ఏం కావాలో చూసుకుంటూ ఉండటం మీదే దృష్టి పెట్టారు. జగన్ అధికారంలోకి రాగానే ఆయనపై కేసులేవీ కొట్టి వేయబడలేదు! జగన్ అధికారంలోకి రాగానే.. ఆయనకు కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఏదీ పోలేదు. అధికారంలో ఉన్నా… ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కూడా చాలా సార్లు జగన్ కోర్టుల ద్వారా ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. ఇదో డైలీ సీరియల్ గా మారింది.
మొదట్లో జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలడం ప్రత్యేక వార్త అయ్యేది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఏ చిన్న అంశంలోనూ కోర్టుల్లో సానుకూలత ఉండడం లేదు. కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బే తగులుతుంది తప్ప, అనుకూలత ఉండదని జనసామాన్యానికి కూడా ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలకపోతే వార్త తప్ప, తగిలితే కాదనే తత్వం అందరికీ అర్థం అయిపోయింది.
ఇక ఇవే రెండేళ్లలో కోర్టుల్లో విజయం సాధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు.చిన్నపాటి ప్రెటీ కేసుతో మొదలుపెడితే, స్థానిక ఎన్నికలు జరపాలా, వద్దా.. అనే అంశాలను కూడా ప్రతిపక్ష పార్టీనే ఆల్మోస్ట్ నిర్ణయించింది. ఏ అంశం మీద అయినా టీడీపీ కోర్టుకు వెళ్లిందంటే.. ఆ విషయంలో 99 శాతం విజయం దానిదే! టీడీపీ నేతల అవినీ కేసుల్లోని బెయిల్ పిటిషన్లు, కోరుకున్న ఆసుపత్రులకు తరలించడాలతో మొదలుపెడితే.. ప్రతి అంశంలోనూ న్యాయపోరాటంలో టీడీపీ దిగ్విజయం సాధిస్తూ ఉంది.
టీడీపీ కోర్టుకెక్కిందంటే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయడం ఇప్పుడు చిన్న పిల్లలకూ సాధ్యం అవుతోంది. అంతలా న్యాయపోరాటంలో ఆ పార్టీ ఆరితేరింది, ముందంజలో ఉంది! అయితే… ఇవన్నీ టీడీపీ వ్యక్తిగత వ్యవహారాలుగా మారిపోయాయి. టీడీపీ ఎక్కడా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వేసి నెగ్గడం లేదు. కేవలం టీడీపీ నేతల ప్రయోజనాలు, టీడీపీ రాజకీయ ప్రయోజనాలు, పచ్చ పార్టీ వారిపై కేసులు, వారి అనుచిత ప్రవర్తన, అవినీతి కేసులు.. ఇలాంటి వాటిల్లో టీడీపీ న్యాయస్థానాలను ఆశ్రయించి ఊరట, బెయిల్స్ పొందుతూ ఉంది.
రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద పోరాటం, అమరావతి ఆరాటం. దాని ప్రభావం ఎంతో వేరే చెప్పనక్కర్లేదు. ఏతావాతా 2019 ఎన్నికలు పూర్తై రెండేళ్లకు పరిణామాలను ఒక్కసారి సింహావలోకనం చేస్తే.. జనానికి ఏం కావాలో జగన్ చేస్తుంటే, తనకేం కావాలో అది చంద్రబాబు తను చేయించుకుంటున్నారు అనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది.