క్వారంటైన్ టైమ్ లో ఎలాగైతే స్టార్ హోటల్స్ లక్షల్లో పిండుకున్నాయో, టీకాల కార్యక్రమాన్ని కూడా తమ దందాకు ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశాయి. తమ హోటల్స్ లో స్టే చేస్తే సకల సదుపాయాలతో పాటు టీకా వేస్తామంటూ స్పెషల్ ప్యాకేజీలు ప్రకటింటాయి. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని స్టార్ హోటల్స్ తో పాటు హైదరాబాద్ లో కూడా 2 స్టార్ హోటల్స్ ఇలాంటి ప్యాకేజీలు ప్రకటించాయి. ఈ సరళిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో కలిసి, స్టార్ హోటల్స్ కరోనా టీకాలు వేయడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దీనికి సంబంధించి మరోసారి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కేవలం ప్రభుత్వం నిర్దేశించిన 4 చోట్ల మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని తెలిపింది
ప్రభుత్వ టీకా కేంద్రాలు, ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వహించే టీకా కేంద్రాలు, ప్రభుత్వం లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వహించే వర్క్ ప్లేస్ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీల్లో మాత్రమే టీకాలు వేయాలని కేంద్రం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్స్, కాలేజీలు, కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవనాల్లో వేసినట్టు స్టార్ హోటల్స్ లో టీకాలు వేయకూడదని స్పష్టంచేసింది.
స్టార్ హోటల్స్ లో వ్యాక్సిన్ అంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమంగానే గుర్తిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు హాస్పిటల్ సిబ్బందితో పాటు, సదరు స్టార్ హోటల్ పై కూడా చర్యలు తప్పవని హెచ్చరించింది.
టీకా కార్యక్రమం ఎక్కడ చేపట్టినా దానికి ముందస్తు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని.. అనుమతి లేకుండా టీకాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.