కేంద్ర ఎన్నికల సంఘం కావొచ్చు, ఇతర వ్యవస్థలు, రాజకీయ పార్టీలు కావొచ్చు.. ఏమైనా క్షమకు అర్హతను పొందుతాయా? ఇప్పుడు కాదు, గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఈ సందేహం వచ్చింది సగటు జీవికి! కోవిడ్ కథ అయిపోయిందని సామాన్యులు అనుకుంటే అది వారి అమాయకత్వం. అయితే ఈ వ్యవస్థ కావాలని విస్మరించింది.
పార్టీల ప్రయోజనాల కోసం ఎన్నికల నిర్వహణకు ఈ వ్యవస్థ ముందుకు వెళ్లింది. అదేమంటే ఫలానా దేశంలో జరిగాయి, ఫలానా దేశంలో జరిగాయంటూ ఉదాహరణలు. అయితే మిగతా దేశాలు వేరు, వంద కోట్లకు పై జనాభా ఉన్న మన దేశం వేరు అనేది అర్థం చేసుకోవడం కనీస ఇంగితం.
ఎయిమ్స్ చీఫ్ గులేరియా తాజా పరిస్థితులపై వ్యాఖ్యానిస్తూ.. ప్రస్తుత కోవిడ్-19 విశృంఖల వ్యాప్తికి బీజం పడింది ఈ ఏడాది జనవరిలో అని పేర్కొన్నారు. జనవరి-ఫిబ్రవరి నెలల్లో పరిస్థితులు చాలా సాధారణ స్థితికి వచ్చినట్టుగా ప్రజలంతా ఫీలయ్యారని, ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అప్పుడే కోవిడ్ విస్తృత వ్యాప్తి మొదలైందని, దాని ఫలితమే ప్రస్తుత పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. సరికొత్త వేరియెంట్ కరోనా ఆ సమయంలో విస్తృతంగా వ్యాపించడం మొదలైందని ఆయన విశ్లేషించారు.
ఇక్కడ ప్రజలను అంటే ఏం ప్రయోజనం? ప్రభుత్వాలు, పదవుల్లో ఉన్న వారే అన్నింటికీ బోర్లా తెరిపించారు! తమ తమ ప్రయోజనాల కోసం, తమ తమ లెక్కలకు అనుగుణంగా వ్యవహరించారు. ఇదేంటి? అని కోర్టులు ప్రశ్నించలేదు! ఎన్నికల నిర్వహణలు కొంత కాలం వాయిదా వేసి ఉంటే దేశానికి వచ్చే కష్టనష్టాలు ఏమీ లేవు! విపత్తుపరిస్థితుల దృష్ట్యా ఉన్న ప్రభుత్వాల పదవీ కాలాలను కాస్త పొడిగించి ఉంటే.. జరిగిపోయే దారుణాలు లేవు!
ఎంత దారుణం అంటే.. ఒకవైపు రోజుకు రెండున్నర లక్షల స్థాయిలో కేసులు నమోదు అవుతూ ఉంటే, మరోవైపు ఎన్నికల ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. సీఈసీ మొద్దు నిద్ర పోతోందో.. లేక కోర్టులు ఈ పరిస్థితిని గమనించడం లేదో కానీ.. దేశంలోని ముఖ్యనేతలు కూడా ఎంచక్కా రాజకీయ ప్రచారాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో ఈ ఇంకా నెలా ఖరు వరకూ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది! దశల వారీగా.. అక్కడ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ…. ఉన్నారు!
దేశం ఏమైపోయినా ఫర్వాలేదు. రాజకీయ పార్టీల నేతలకూ, కీలక పదవుల్లో ఉన్నవారికి రాజకీయమే కావాలి! వారికి అధికారమే పరమావధి. వారి రాజకీయ స్వార్థాలకు అన్ని వ్యవస్థలూ సహకరిస్తాయి. సామాన్యులు ఎలా బలయినా ఫర్వాలేదు, ఎన్నికల ప్రక్రియ నిరాకంటంగా జరగాలి, ఎందుకంటే రాజకీయ నేతలకు కావాల్సింది రాజకీయం మాత్రమే!
దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం గురించి సమీక్షలు, సమావేశాలు పెట్టుకోవాల్సిన నేతలు.. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారు! భారీ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంత విపత్తు ఎదురవుతుంటే.. కాస్తైనా ముందు చూపు లేకుండా వ్యహరించి, తీరా తీవ్ర పరిణామాలు ఎదురవుతున్న వేళ కూడా ఎన్నికలు, అధికారమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ నిర్భీతిగా వ్యవహరిస్తున్నారు.
కనీసం సీఈసీ అయినా.. మిగిలిన దఫాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేస్తాం, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అయినా మిగిలిన తతంగాన్ని వీలైనంత త్వరగా ముగించేస్తున్నట్టుగా ప్రకటిస్తుందా? అని అంటే.. అలాంటి సమస్యే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఎవడైమైపోయినా ఫర్వాలేదు, ఎన్ని కేసులు పెరిగినా ఫర్వాలేదు.. రాజకీయ బాసులకు అనుగుణంగా వ్యవహరించడమే వ్యవస్థల పనిగా మారింది. షేమ్..షేమ్..!