టీడీపీని మోసం చేస్తున్న చంద్ర‌బాబు!

ఎంపీటీసీ-జ‌డ్పీటీసీ ఎన్నిక‌లను ఆయ‌నే బ‌హిష్క‌రించేశారు, ఇక తిరుప‌తి ఉప ఎన్నిక‌ల పోలింగ్ ను ర‌ద్దు చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.. ఇదీ చంద్ర‌బాబు నాయుడుకు మిగిలిన రాజ‌కీయం! అయితే త‌నే…

ఎంపీటీసీ-జ‌డ్పీటీసీ ఎన్నిక‌లను ఆయ‌నే బ‌హిష్క‌రించేశారు, ఇక తిరుప‌తి ఉప ఎన్నిక‌ల పోలింగ్ ను ర‌ద్దు చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.. ఇదీ చంద్ర‌బాబు నాయుడుకు మిగిలిన రాజ‌కీయం! అయితే త‌నే ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం, లేక‌పోతే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేయ‌డం!

గ‌తంలో ఇలాంటి డిమాండ్ల‌ను ఊరూపేరూ లేని పార్టీలు చేసేవి. ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల‌ను ఎలాగో దాఖ‌లు చేసేసి, ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఏ ర‌కంగానూ చేరువ కాలేని రిజిస్ట‌ర్డ్ పార్టీలు ఈ త‌ర‌హాలో స్పందించేవి. ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా లేద‌ని, త‌మ‌కు ఆటంకాల‌ను క‌లిగిస్తున్నార‌ని, త‌మ‌కు గుర్తుల విష‌యంలో అన్యాయం జ‌రిగిందని, త‌మ అభ్య‌ర్థుల‌ను బెదిరించార‌ని, ప్రజాస్వామ్య ప్ర‌క్రియ‌కే అవ‌మానం జ‌రుగుతోందంటూ.. ఇలాంటి ప‌డిక‌ట్టు ప‌దాల హెచ్చ‌రిక‌ల‌తో కొన్ని పార్టీలు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేసేవి.

వాటి హ‌డావుడి పోలింగ్ కు ముందు, పోలింగ్ కు త‌ర్వాత కూడా  ఉండేది. పోలింగ్ కు ముందైతే బ‌హిష్క‌ర‌ణ‌, పోలింగ్ త‌ర్వాత అయితే ర‌ద్దు డిమాండ్లు అవి చేసేవి. అవంటే అడ్ర‌స్ లేని పార్టీలు. అయితే ఇప్పుడు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీనే అలాంటి డిమాండ్ల‌ను చేస్తూ ఉంది. తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం ఎలా ఉంటుందో టీడీపీకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ఉద‌యాన్నే మొద‌లుపెట్టేశారు. ప్ర‌త్యేకించి తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ పోలింగ్ రోజు తొలి గంట‌లోనే రేపిన ర‌చ్చ‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ చాలా స్ట్రాట‌జిక్ గానే ఉంద‌ని స్ప‌ష్టం అయ్యింది. 
 
ఎలాగూ పార్టీ ప‌రువు పోతుంద‌ని ఫిక్సై.. ముందే అరిచేస్తే ఒక ప‌ని అయిపోతుంద‌న్న‌ట్టుగా టీడీపీ ర‌చ్చ మొద‌లుపెట్టింది. అయినా ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో జ‌రిగిన లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక‌లో ఒక‌టీ రెండు పోలింగ్ బూత్ ల వ‌ద్ద డ్రామాను క్రియేట్ చేస్తే స‌రిపోతుందా! ఆ డ్రామాను పెద్ద ఎత్తున అయినా క్రియేట్ చేసి ఉంటే పోయేది. అయితే తెలుగుదేశం, బీజేపీల వ‌ద్ద అలాంటి డ్రామాకు పూర్తి స్థాయిలో స‌రంజామా లేన‌ట్టుగా ఉంది! ఉన్న చోట‌కు ఏదో లాగించారు. 

అయినా ఈ డ్రామాల‌తో టీడీపీ ఎవ‌రిని మోసం చేయాల‌నుకుంటున్న‌ట్టు? అంటే త‌న‌ను తాను మోసం చేసుకోవ‌డం త‌ప్ప మ‌రోటి కాక‌పోవ‌చ్చు. ప్ర‌జ‌లు ఇంకా అమాయ‌కులే, 80ల‌లో, 95లో చేసిన రాజ‌కీయాల‌ను చేస్తుంటే చాల‌నే లెక్క‌లు వేస్తున్న‌ట్టుగా ఉన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న అప్ డేట్ కాలేదేమో కానీ, ప్ర‌జ‌లు చాలా అప్ డేట్ అయ్యారు. ఇలాంటి డ్రామాల‌ను అర్థం చేసుకోలేనంత అమాయ‌కులు ఎవ‌రూ లేరు. 

చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో తెలుగుదేశం పార్టీ ఆత్మ‌వంచ‌న చేసుకుంటూ ఉంది. ఆత్మ‌వంచ‌న‌, సెల్ఫ్ పిటీ ఇలాంటివేవీ ప‌నికి రావ‌ని వ్య‌క్తిత్వ వికాస నిపుణులు చెబుతూ ఉంటారు. ఇలాంటివి కేవ‌లం ప‌త‌నావ‌స్థ‌, ఏదీ సాధించ‌లేని వాళ్లు చేసుకునే ప‌నుల‌ని అంటూ ఉంటారు. ఇన్నేళ్ల తెలుగుదేశం పార్టీ ప్ర‌స్థానం ఎలా జ‌రిగినా.. ప్ర‌స్తుతం ఆత్మ‌వంచ‌న‌, సానుభూతిని ఆశించే ప‌రిస్థితుల్లోకి జారిపోయింది ఆ పార్టీ. చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలోనే ఆ పార్టీ అన్ని ప‌తానావ‌స్థ‌ల‌నూ చవిచూస్తున్న‌ట్టుగా ఉంది!