ఉక్కు మాట వింటే ఒకపుడు ధీమా కనిపించేది. ఇపుడు బితుకు బెంగ కలుగుతోంది. నిక్షేపం లాంటి ఉక్కుకు తుక్కు చేయాలన్న కేంద్రం పట్టుదల మీద కార్మిక లోకం మండిపోతోంది. అదే సమయంలో విశాఖ సాగరమంత తమ ఆవేదనను కూడా లోకం ముందు పెట్టి న్యాయం చెప్పమంటోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర పెద్దలు శపధం చేస్తున్నారు. ఉక్కుని కాపాడుకుంటామంటూ ఉద్యమకారులు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. ఆరు నెలలుగా విశాఖ వేదికగా సాగిన ఉక్కు పోరాటం ఇపుడు హస్తిన బాటను పట్టింది.
భారీ ఎత్తున కార్మికులు, నాయకులతో కూడిన ఉక్కు ప్రత్యేక రైలు ఢిల్లీ దిశగా బయల్దేరింది. ఢిల్లీమే సవాల్ అనుకుంటూ ఉక్కు ఉద్యమకారులు అంతా రైలు ఎక్కేశారు. రేపటి ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్న ఈ రైలు అక్కడ పోరాటానికి శ్రీకారం చుడుతోంది.
ఈ నెల 2, 3 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉక్కు కార్మిక లోకం అతి పెద్ద ఆందోళన నిర్వహించనుంది. పార్లమెంట్ కు వినిపించేలా తమ గర్జన ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా మొక్కవోని దీక్షతో కార్మికులు చేపడుతున్న ఉక్కు పోరాటం సక్సెస్ కావాలను విశాఖ జనం అంతా కోరుకుంటున్నారు. కేంద్ర పెద్దలు వెనక్కి తగ్గాలని, బలిపీఠం నుంచి విశాఖ స్టీల్ ని తప్పించాలని కూడా వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.