ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రెచ్చగొట్టేందుకే అన్నట్టుగా ఉద్యోగ సంఘాల నాయకుల మాటలున్నాయి. పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నాయకుల మాటల వెనుక కుట్రల్ని ఇప్పుడిప్పుడే ఉద్యోగులు గ్రహిస్తున్నారు. ఉద్యోగ వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు తమ రాజకీయ ఎజెండాను అమలు చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. పీఆర్సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదని, రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని వాళ్లిద్దరు హెచ్చరించారు.
సీపీఎస్ రద్దు చేయాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీ కరించాలని, పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ వెంటనే పీఆర్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం ఉద్యోగ సంఘాల బాధ్యత. ఇదే సందర్భంలో ఉద్యోగుల సమస్యల్లో ప్రాధాన్యాలను గుర్తించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపాలి. కానీ ఉద్యోగ సంఘాల నాయకులైన బొప్పరాజు, బండి తీరు ఎలా వుందంటే… జగన్ మెడపై కత్తి పెట్టి బెదిరిస్తున్న భావన ప్రతిబింబిస్తోంది. పీఆర్సీ ప్రకటించినా ఉద్యమాన్ని కొనసాగిస్తామని బెదిరిస్తున్నప్పుడు… ఇక ఉద్యోగుల సమస్యల్ని ఎందుకు పరిష్కరించాలనే ప్రశ్న, మొడితనం ఎవరిలోనైనా కనిపిస్తుంది.
ఈ ఇద్దరి వైఖరి వల్ల మొత్తం ఉద్యోగులకు నష్టమని చెప్పక తప్పదు. నిజంగా ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులకు చిత్తశుద్ధి వుంటే ప్రధాన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఒక్కొక్కటిగా కాలపరిమితి పెట్టుకుని పరిష్కరించుకోవాలి. అలా కాకుండా తమ సమస్యలన్నీ పరిష్కరించే వరకూ ఉద్యమిస్తామంటే… ఇక ప్రభుత్వానికి మరే ఇతర వర్గాలు లేనట్టు, మొత్తం డబ్బంతా వాళ్లకే ఖర్చు చేసి, మిగిలిన వాళ్లను ఎండబెడితే సరిపోతుందనే శాడిజం ఉద్యోగ సంఘాల నేతల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే ఉద్యోగులంటే సమాజంలో మంచి పేరు లేదు. ఆ చెడ్డ పేరును మరింత మూటకట్టుకోవాలని వుంటే… గొంతెమ్మ కోర్కెలతో ఉద్యమ బాటలోనే పయనించాలని పౌర సమాజం చెబుతోంది.