ఏపీకి మరోసారి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే కదా. కేంద్రం తాను ఇచ్చిన హామీలను తానే హుష్ …కాకి అనేసింది. మొదటి అన్యాయం ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సమయంలో తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చాలా గట్టిగా హామీ ఇచ్చింది.
పాపం అప్పట్లో ఏపీ ప్రజలు చాలా సంతోషించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హోదా లేదు గీదా లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం తీసుకోండి అన్నది. అప్పటి సీఎం చంద్రబాబు సరేనన్నాడు. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. తనకు అధికారమిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు.
ప్రజలు నమ్మారు. అధికారం ఇచ్చారు. కేంద్రంలో బీజీపీకి పూర్తి అధికారం వచ్చింది కాబట్టి ఏం చేయలేమన్నాడు. ఆ కథ ముగిసింది. రెండో అన్యాయం విశాఖ రైల్వే జోన్. అదీ హుష్ కాకీ అయిపొయింది. మొన్నీమధ్యనే కేంద్ర ప్రభుత్వం దానికీ గుడ్ బై చెప్పింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబూ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారు.
సీఎంగా ఉన్న జగన్, విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇద్దరికీ కేంద్రంతో అవసరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఓవైపు జగన్ కేంద్రం నుంచి నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఎన్డీయేతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. దీంతో వీరిద్దరి బలహీనతల్ని అర్ధం చేసుకున్న కేంద్రం.. ఏపీతో మరోసారి ఆడుకోవాలని నిర్ణయించేసుకున్నట్లు అర్ధమవుతోంది.
అయినా కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేని పరిస్ధితుల్లోకి వీరిద్దరూ దిగజారిపోతున్నారు. గతంలో ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసే క్రమంలో అయినా కేంద్రంపై విమర్శలు చేసిన చరిత్ర ఉన్న జగన్, చంద్రబాబు ఇప్పుడు అలా కూడా విమర్శలు చేసేందుకు ఇష్టపడం లేదు.
విమర్శలు చేస్తే అవి కేంద్రాన్ని ఎక్కడ తాకుతాయో, తమ సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయో అన్న భయం వీరిలో కనిపిస్తోంది.కేంద్రం రాష్ట్రానికి ఎంతగా అన్యాయం చేస్తున్నా జగన్, చంద్రబాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ కేంద్రంపై నోరెత్తితే ఏం జరుగుతందనే దానిపై వీరిద్దరికీ క్లారిటీ ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్ నోరెత్తితే ఆయనపై విచారణ దశలో ఉన్న అక్రమాస్తుల కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి.
అలాగే చంద్రబాబు నోరెత్తితే ఎన్డీయేలోకి భవిష్యత్తులో టీడీపీకి ద్వారాలు పూర్తిగా మూసుకుపోవడం ఖాయం. అంతే కాదు ఓటుకు నోటు వంటి పాత కేసుల్ని కూడా కేంద్రం తిరగతోడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో జగన్ కానీ, చంద్రబాబు కానీ ఇప్పట్లో కేంద్రంపై నోరెత్తే అవకాశాలు కనిపించడం లేదు. ఏపీకి ఎంత అన్యాయం జరిగినా మేం మాత్రం మా ప్రయోజనాలే చూసుకుంటామనే ధోరణి వీరిద్దరిలో కనబడుతోంది.