స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేశారు.
గతంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సలహాదారుగా పని చేస్తున్న సమయంలో సుమారు రూ.242 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆధారాలు లభ్యమవడంతో సీఐడీ అధికారులు చర్యలు చేపట్టారు.
యువతకు శిక్షణ పేరుతో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాల నేపథ్యంలో లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు.
ఈ సందర్భంలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) సీఐడీ అధికారులను అడ్డుకున్నారని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. లక్ష్మినారాయణకు ఆర్కే అత్యంత సన్నిహితుడని, అందువల్లే ఇంట్లోకి సీఐడీ అధికారులు ప్రవేశించకుండా ఆర్కే అడ్డుగా నిలిచారనేది ఆ మీడియా ప్రచారం.
మరోవైపు ఆంధ్రజ్యోతి ఆర్కే ప్రవేశంపై తనదైన వాదనను మరోలా తెరపైకి తెచ్చింది. ఎప్పటి నుంచో లక్ష్మినారాయణ తమ యజమానికి ఆప్త మిత్రుడని, ఆయనకు ధైర్యం చెప్పేందుకు మాత్రమే ఆర్కే వెళ్లారని సదరు పత్రిక అంటోంది.
ఆర్కేతో సీఐడీ అధికారులు మాట్లాడారని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. అంతేకాదు, సీఐడీ అధికారులు ఆర్కేను కాసేపు ఇక్కడే ఉండాలని అభ్యర్థించారని కూడా తన మార్క్ రాతలను ఆవిష్కరించారు.
‘కొద్ది సేపు మీరు ఇక్కడే ఉండాలని కోరారు. మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీ నారాయణ సహకరిస్తారు. తాము ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్లిపోతాం’ అని సీఐడి అధికారి కోరడంతో రాధాకృష్ణ అక్కడే కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారని తన మార్క్ రాతలను ఆంధ్రజ్యోతి పచ్చటి సిరాతో ఆవిష్కరించడం గమనార్హం.
మొత్తానికి ఆర్కేను బతిమలాడుకుని, కాసేపు తమ వద్దే ఉంచుకుని సీఐడీ అధికారులు లక్ష్మినారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారన్న మాట.