దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కుమార్తె పెళ్లి వేడుకలో ఇద్దరి కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. వాళ్లిద్దరు ఆప్యాయంగా పలకరించుకుంటుంటే, పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఆ దృశ్యాన్ని వేడుకను వీక్షిస్తున్న అనుభూతి చెందారు.
ఉప్పునిప్పులా ఉండే ఆ ఇద్దరు పరస్పరం పలకరించుకోవడం నిజంగా అద్భుతమే. ఎన్నేళ్లకెన్నేళ్లకు తోడల్లుళ్ల మధ్య పలకరింపు అనే చర్చకు తెరతీసింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుంటున్న దృశ్యాన్ని కెమెరాలు బంధించాయి. వరుసకు తోడల్లుళ్లైనా రాజకీయంగా ఇద్దరూ బద్ద శత్రువులు.
ఒకరి నీడను మరొకరు నమ్మలేని రాజకీయ అనుమానాలు ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో వున్నాయి. 1995లో చంద్రబాబు మాటలు నమ్మి, చంద్రబాబును పదవీచ్యుతుడిని చేసిన పాపంలో తన పాత్ర కూడా ఉందని అనేక సందర్భాల్లో దగ్గుబాటి బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇతరత్రా బంధువులంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి పరస్పరం ఎదురు పడ్డారు. పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కపక్కనే నిలుచొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ దృశ్యం మీడియాతో పాటు అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.