చాన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు ముద్రగడ పద్మనాభం. కాపుల రిజర్వేషన్ కోసం పోరాట సమితిని ప్రారంభించి, దానిపైనే పోరాడుతున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం ముద్రగడ వ్యవహారశైలి. కొన్ని రోజులుగా ఆయన రాజకీయ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. చంద్రబాబు ఏడుపు సీన్ పై లేఖాస్త్రం సంధించడంతో పాటు.. మరికొన్ని అంశాలపై ఆయన వరుసగా లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేలా ఉన్నారు.
ముద్రగడ కాపు నాయకుడు మాత్రమే…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఆయనపై కాపునాయకుడనే ముద్ర మొదటినుంచీ లేదు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలు పెట్టిన తర్వాతే ఆయనపై కాపు నాయకుడనే ముద్ర పడింది.
దీంతో ఆయనను చంద్రబాబు కార్నర్ చేసి, ఓవర్గం నాయకుడిగా చిత్రీకరించి మిగతా వర్గాల్లో, ముఖ్యంగా బీసీల్లో ఆయనపై ద్వేషం పెంచారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీలకు కోత పెట్టాలనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో సహజంగానే బీసీ వర్గాల్లో కాపు రిజర్వేషన్లపై సదభిప్రాయం లేదు. దీనికి కారణం చంద్రబాబే.
గతంలో జగన్ కూడా తన పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. దీంతో ముద్రగడ అటు చంద్రబాబుకి, ఇటు జగన్ కి సమదూరం పాటించారు. కానీ నిష్టూరమైన నిజం చెప్పిన జగన్ కంటే, తనను మోసం చేసి, ఉద్యమ సమయంలో తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన చంద్రబాబుపై ముద్రగడకు కోపం ఎక్కువ. అది ఇటీవల పలు సందర్భాల్లో బయటపడింది కూడా.
ఇప్పుడు ముద్రగడ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటే ముందు కాపునాయకుడనే ముద్ర తొలగించుకోవాలి. కాపు రిజర్వేషన్లతో పాటు, ఇతర ప్రజా సమస్యలపై కూడా పోరాడాలి. అందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అంటే.. మద్రగడ కాపు నాయకుడనే ముద్రను తొలగించుకునే దిశగా తొలి అడుగు వేశారని అర్థం.
ఏ గట్టుకి చేరతారు..?
ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగితే జనసేన తరపున ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి పవన్ కల్యాణ్ రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ముద్రగడకు సామాజిక సమీకరణాలతో రాజకీయాలు చేస్తే ఫలితం ఉండదని తెలుసు. కాంగ్రెస్, బీజేపీతో కూడా లాభం లేదని ఆయనకు తెలుసు. ఇక టీడీపీకి ఆయన ఎలాగూ బద్ధశత్రువు.
రాగా పోగా.. వైసీపీ వైపు ముద్రగడ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అయితే కాపు రిజర్వేషన్లు కుదరదు అని కరాఖండిగా చెప్పిన జగన్ వైపు ఆయన నిలబడాలంటే.. అంతకంటే గొప్పగా తన సామాజిక వర్గానికి జగన్ ఏదో చేశారని చెప్పుకోవాలి. కాపు కార్పొరేషన్ కి అధిక నిధులివ్వడం వంటివి కొంతవరకు ఓకే.
ఎలాగూ చంద్రబాబుని ఏకిపారేస్తున్నారు కాబట్టి.. ముద్రగడ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.