రైల్వే జోన్ మీద వైసీపీ ఎంపీ సంచలన కామెంట్స్… ?

విశాఖకు రైల్వే జోన్ రాదు, ఇక ఆ ఆశ లేదూ ఊసూ లేదు అన్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఏకంగా పార్లమెంట్ సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. అంతే కాదు, దేశంలో ఉన్నవి 17 జోన్లు…

విశాఖకు రైల్వే జోన్ రాదు, ఇక ఆ ఆశ లేదూ ఊసూ లేదు అన్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఏకంగా పార్లమెంట్ సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. అంతే కాదు, దేశంలో ఉన్నవి 17 జోన్లు మాత్రమేనని కూడా లెక్క చెప్పారు. కొత్తగా మరోటి ఏర్పాటు చేయబోమని కూడా గట్టిగానే  ఒట్టేసుకున్నారు.

ఈ విషయంలో రాష్ట్రాల నుంచి వత్తిళ్ళు వచ్చినా కూడా రైల్వే జోన్ కొత్తగా ఏర్పాటు అన్నది ఉండబోదని నిఖార్సుగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాని మీద అన్ని పార్టీలూ గుస్సా మీద ఉన్నాయి. సీపీఐ అయితే ఇది ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం, మరో మోసమని కూడా గట్టిగా చెప్పేసింది.

ఇదంతా ఇలా ఉండగానే  వైసీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అయితే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, రైల్వే జోన్ విశాఖకు వచ్చి తీరుతుంది అని చాలా కూల్ గా చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చి తీరుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

ఇందులో ఎటువంటి అనుమానం కూడా ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆమె అంటున్నారు.  రైల్వే జోన్ కి సంబంధించిన ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి నిధులు కూడా కేంద్రం విడుదల చేస్తుందని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రి ప్రకటన తో ఎవరూ నిరుత్సాహం పడాల్సిన అవసరమే లేదని కూడా ఎంపీ సత్యవతి భరోసా ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి కేంద్ర మంత్రి జోనూ లేదు, ఏమీ లేదూ అంటే వైసీపీ ఎంపీ ఇంత ధీమాగా ఎలా చెబుతున్నారబ్బా అంటున్నారు అంతా. మొత్తానికి సత్యవతి ప్రకటన కాస్తా ఊరటని ఇచ్చేదిగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా అలా జరగాలనే అంతా కోరుకుంటున్నారు. కానీ జరిగేనా..