సాధారణ రోజుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాంటిది వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో వీవీఐపీలు, వీఐపీల సేవలో టీటీడీ అధికారులు మునిగిపోయి ఉంటారనేది జగమెరిగిన సత్యం. అలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా ప్రముఖులకు ఇది షాకింగ్.
తిరుమల శ్రీవారి ఆలయంలో 2022, జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని గదుల రిజర్వేషన్‌ను రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కేవలం కరెంట్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా భగవంతుని సన్నిధిలో పేదలు, ధనికులు అనే తేడా ఉండదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వైకుంఠ పర్వదినాన కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారని, అప్పుడు సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించే ఆలోచనతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
కరెంట్ బుకింగ్‌లో సిఫార్సులకు పెద్ద పీట వేయకుండా, సామాన్య ప్రజలకు వసతి సౌకర్యాలు కల్పిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?