ఈనాడు దుర్మార్గానికి ప‌రాకాష్ట‌

మీడియా రంగంలో దిగ్గ‌జంగా చెలామ‌ణి అవుతున్న రామోజీరావు నేతృత్వంలో న‌డుస్తున్న ఈనాడు ప‌త్రిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో పాల్ప‌డుతున్న దుర్మార్గానికి ప‌రాకాష్టగా ఓ వార్తా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. త‌మ య‌జ‌మానికి న‌చ్చ‌ని రాజ‌కీయ నేత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను…

మీడియా రంగంలో దిగ్గ‌జంగా చెలామ‌ణి అవుతున్న రామోజీరావు నేతృత్వంలో న‌డుస్తున్న ఈనాడు ప‌త్రిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో పాల్ప‌డుతున్న దుర్మార్గానికి ప‌రాకాష్టగా ఓ వార్తా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. త‌మ య‌జ‌మానికి న‌చ్చ‌ని రాజ‌కీయ నేత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పాలిస్తుండ‌డంతో….ఏకంగా ఆ రాష్ట్రంపైనే ఈనాడు క‌క్ష క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌నేందుకు ఆ వార్త‌ను ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు.

స‌హ‌జంగా ఆంధ్ర‌జ్యోతి ఆ ప‌ని చేసిందంటే…దాన్నెవ‌రూ పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకునేవారు కాదు. కానీ గుడ్డికంటే మెల్ల మేలు అనే సామెత చందాన ఆంధ్ర‌జ్యోతి కంటే ఈనాడు బెట‌ర్ అనే అభిప్రాయం ఉన్న నేప‌థ్యంలో …ఆ వార్త గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి.

క‌ర‌వు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ బీడు భూముల‌ను కృష్ణా నీళ్ల‌తో ముద్దాడల‌నే త‌లంపుతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. దీనిపై తెలంగాణ అభ్యంత‌రం చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాయలసీమ ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ తెలంగాణలోని నారాయణపేట్‌ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో (ఎన్జీటీ) పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఈ పిల్‌పై ఎన్జీటీ స్పందిస్తూ అనుమతుల విషయంలో వైఖరి చెప్పాలని .. కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ శాఖ ఇచ్చే అఫిడ‌విట్‌పై రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం భ‌విష్య‌త్‌, వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ రైతుల జీవితాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. అందు వ‌ల్ల కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ వైఖ‌రి వెల్ల‌డిస్తుందోన‌నే ఉత్కంఠ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…మ‌రీ ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో నెల‌కొంది. అయితే ప్ర‌జాకాంక్ష‌ల‌కు అనుగుణంగా మీడియా న‌డుచుకోవ‌డానికి బ‌దులుగా, య‌జ‌మాని ఇష్టాయిష్టాల‌ను ప్ర‌తిబింబిస్తూ ఈనాడు క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఎన్జీటీలో శుక్ర‌వారం కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే అస‌లు సంగ‌తిని విస్మ‌రించి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌సును రంజింపజేసేందుకు వృద్ధాప్యంలో రామోజీ జిమ్మిక్కుల‌ను చూస్తుంటే ఏహ్య భావం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. ఎన్జీటీ ప‌రిణామాల‌పై ఈనాడులో ఏం రాశారో తెలుసుకుందాం.

“న‌ది మొత్తాన్ని మ‌ళ్లించే య‌త్నం” శీర్షిక‌, దాని ఉప‌శీర్షిక ” రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై ఎన్జీటీలో వాదించిన తెలంగాణ”  అని  క్యారీ చేయ‌డం ద్వారా ఈనాడు దుష్ట ప‌న్నాగం దాని హెడ్డింగ్‌లోనే క‌నిపించింది. ఇక వార్తా క‌థ‌నంలోకి వెళితే… “ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో న‌ది మొత్తాన్ని మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్జీటీ) లో వాదించింది. రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటి మ‌ళ్లింపు అంటే సుమారు 8 టీఎంసీల నీరు. ఆ మొత్తం నీటితో దేశం మొత్తానికి తాగునీరు స‌రఫ‌రా చేయ‌వ‌చ్చు.

ఈ ప‌థ‌కానికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌పై నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా అసంబద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేసింది”…. ఇలా వార్త మొత్తాన్ని ఏక‌ప‌క్షంగా రాశారు. ఎక్క‌డా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాద‌న రాసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఎన్జీటీకి ఇచ్చిన అఫిడ‌విట్‌పై ఏక‌వాక్యంతో స‌రిపెట్టారు.

ఇదే స‌మాచారాన్ని ఆంధ్ర‌జ్యోతిలో “సీమ స్కీమ్‌కు అనుమ‌తి అక్క‌ర్లేదు” అంటూ మొద‌టి పేజీలో ఇండికేష‌న్ ఇచ్చి, లోప‌లి పేజీలో స‌మ‌గ్ర క‌థ‌నాన్ని ఇచ్చారు. ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌చురిత‌మైన  వార్త సీమ ప్ర‌జ‌ల‌కు కొండంత ఊప‌రి ఇచ్చేలా ఉంది. భ‌విష్య‌త్‌లో భ‌రోసా క‌లిగించేలా ఉంది. త‌మ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఎలాంటి అడ్డంకులు ఉండ‌వ‌నే న‌మ్మ‌కం క‌లిగించేలా ఆంధ్ర‌జ్యోతి వార్త ఉంది. ఆ వార్త వివ‌రాల్లోకి వెళితే…

“కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ స్పష్టం చేసింది. ‘ఇది కొత్త ప్రాజెక్టు కాదు. అదనపు సాగు లేదు. దీని ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడం లేదు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను ధృవీకరిస్తున్నామని పేర్కొంది. దీనివల్ల ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్‌ (ఈఐఏ-2006) పరిధిలోకి రాదని తెలిపింది “

ఇంకా అనేకానేక వివ‌రాలు ఆంధ్ర‌జ్యోతిలో వివ‌రంగా ఉన్నాయి. ఇదే రీతిలో సాక్షిలో కూడా ప్ర‌చురిత‌మైంది. ఈనాడు తెలంగాణ ఎడిష‌న్‌లో ఆ ప్రాంత వాద‌న తెలిపే వార్త‌ను ప్ర‌చురించారంటే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ ఏపీ ఎడిష‌న్‌లో కూడా తెలంగాణ వాద న‌ను క్యారీ చేయ‌డం ఏంటి? ఇదేనా రామోజీ జ‌ర్న‌లిజం మార్క్ వార్త‌.  

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే న‌చ్చ‌నంత మాత్రాన‌…ఏకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌నో భావాల‌కు వ్య‌తిరేకంగా వార్త రాయ‌డ‌మా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏం వాదించిందో, కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో ఏం చెప్పిందో స‌మాజానికి తెలియ‌జేయాల్సిన బాధ్య‌త త‌న‌కు లేద‌ని ఈనాడు భావిస్తుందా? ఇదేనా నీతి? ఇంత‌కంటే దుర్మార్గం మరెక్క‌డైనా ఉంటుందా?

ఎవరినీ వదిలి పెట్టను

అస‌లు ఈ సంవ‌త్స‌రం క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందా?