చివరి ముఖ్యమంత్రి శకం ముగిసింది ….!

రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు అడ్రెస్ లేని ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ నాయకుల్లో ప్రముఖంగా చెప్పుకోవలసిన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.  Advertisement ఆయన వయసులో పెద్దవాడా ?…

రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు అడ్రెస్ లేని ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ నాయకుల్లో ప్రముఖంగా చెప్పుకోవలసిన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 

ఆయన వయసులో పెద్దవాడా ? కాదు. అనారోగ్యం పాలయ్యాడా? కాదు. కిరణ్ కుమార్ సాదా సీదా నాయకుడైతే ఆయన్ని గురించి చెప్పుకోవలసిన పని ఉండకపోయేది. కానీ ఆయన ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా పనిచేశాడు.

ముఖ్యమంత్రిగా చేశాడు. రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేని కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఆంద్ర కోసం చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. చివరకు పరిస్థితి తన చేయి దాటిపోయాక పదవికి రాజీనామా చేశాడు. 

ఇక అంతే. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిన ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ తాను మాత్రం పోటీ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. పార్టీ చిత్తుగా ఓడిపోతుందని ముందుగానే ఊహించాడేమో అది సోదిలోకి లేకుండా పోయింది.

ఎన్నికల తరువాత అధికారికంగా రాష్ట్రం విడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇక కనపడలేదు. అప్పటి నుంచి పూర్తిగా అజ్ఞాత వాసంలో ఉండిపోయాడు ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి. 

తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మధ్యలో ప్రకటించినా ఆ పని పూర్తిగా చేయలేదు. 2017లో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు ఆయన ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జరిగింది.

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌చాందీ కిరణ్‌ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించారని అందుకు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేశారని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. 

కిరణ్ కుమార్ రెడ్డిని సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించారని, ఆయననే ఏపీసీసీ చీఫ్ గా నియమిస్తారని  భావించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీని కలుసుకొని మాట్లాడారు కూడా. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మీడియాలో వచ్చాయి. 

అయితే పీసీసీ పగ్గాలు చేపట్టే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి తనకేనంటూ వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు. 

తర్వాత కొంత కాలానికి మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎంతో భాదేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు.

ఆయన పేరుకు కాంగ్రెస్ లో చేరాడుగాని యాక్టివ్ గా మాత్రం లేదు. అసలు ఆయన గురించి ఎలాంటి వార్తలు మీడియాలో రావడంలేదు. ఆయన హైదరాబాదులోనే ఉన్నాడుగాని ఏం చేస్తున్నాడనేది మీడియాకు తెలియదు. 

తెలియదు అనడంకంటే ఆయన్ని పట్టించుకోవడంలేదు అనడం సమంజసం. పట్టించుకోవాలంటే యేవో కార్యకలాపాలు చేయాలి కదా. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా యాక్టివ్ రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో అన్న స్థానంలో పీలేరు నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడి పోయిన తర్వాత టీడీపీలో చేరాడు.  నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశాడు.  2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. 

అయితే ఆ ఎన్నికల్లో  ఓడిపోయినా..  యాక్టివ్ గానే పనిచేస్తున్నాడు.  చిత్తూరు జిల్లా టీడీపీలో ఇప్పుడు కీలక నేతగా ఉన్నాడు.  చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. తమ్ముడు  టీడీపీలో ఉన్న కారణంగా  కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టలేదని కొందరు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ లోనూ బలపడే సూచనలు కనిపించకపోవడం, టీడీపీలో తన కుటుంబ సభ్యులు యాక్టివ్ గా ఉండటం తదితర అంశాలతో రాజకీయాలకు దూరంగా ఉండటమే బెటరనే నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని చెబుతున్నారు. దాదాపుగా ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని తెలుస్తోంది.

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి