నసనకోట ముత్యాలమ్మ.. అనంతపురం జిల్లాలో బాగా ఫేమస్ టెంపుల్. కేవలం అనంతరం జిల్లా వరకే కాకుండా.. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉండే ఈ ఆలయం దశాబ్దాల నుంచి ప్రముఖంగా నిలుస్తూ వస్తోంది. అమ్మవారికి జంతుబలులు ఇచ్చి అక్కడే విందు చేసుకుంటారక్కడ. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో నసనకోట ముత్యాలమ్మ ఆలయం వద్ద సందడి ఉంటుంది. వేలమంది భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
ప్రధానంగా జంతు బలుల మొక్కులే అక్కడ ఎక్కువ. వేల మంది వచ్చే అక్కడ వ్యాపారం కూడా గట్టినే ఉంటుంది. అమ్మవారికి భక్తులు చదివించుకునే విరాళాలతో పాటు, అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి నాన్ వెజ్ అక్కడే వండుకుని తినే సంప్రదాయం ఉంది. దీంతో కోళ్లు కట్ చేయించే వాళ్లతో మొదలుపెడితే… మద్యం వరకూ అక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి.
ఈ ఆలయానికి ధర్మకర్తలుగా చలామణి అవుతోంది పరిటాల కుటుంబం. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి రావడం, పరిటాల సొంతూరుకు దగ్గర్లోనే ఈ ఆలయం ఉండటం.. వంటి కారణాల చేత వారి రాజకీయ ఆధిపత్యం ఆలయం మీద కూడా కొనసాగుతూ వచ్చింది. పరిటాల సునీత తండ్రి ఈ ఆలయ పెద్దగా చలామణి అవుతూ ఉన్నారు.
భారీగా ఆదాయం ఉన్న ఈ ఆలయం ఇన్నేళ్లూ అధికారిక లెక్కలు ఏమీ లేకుండా నడిచింది. ఆలయ ప్రాంతం అభివృద్ధి అంతంత మాత్రమే. రూమ్ లు ఏవో కట్టారు. అక్కడ వండుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో దశాబ్దాలుగా అక్కడ సాగిన పరిటాల కుటుంబ ఆధిపత్యానికి చెక్ పడింది.
ప్రముఖ ఆలయం అయిన నసనకోట ముత్యాలమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి పరిటాల శ్రీరామ్ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడానికి చొరవ చూపారు. ఇన్నేళ్లూ లెక్కాజమ లేకుండా అక్కడ కోట్ల రూపాయల వ్యవహారాలు సాగిపోయాయని, ఇక నుంచి దేవాదాయ శాఖ ప్రకారం అక్కడ అంతా పద్ధతి ప్రకారం సాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.