ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్నది పెద్దల మాట. అలాగే ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించాలనేది కూడా పెద్దల మాటే.
ఇప్పుడు ఈ రెండు లైన్లు కూడా చంద్రబాబు అండ్ కో కు బాగా వర్తిస్తాయి అనిపిస్తుంది.
అంతే కాదు, గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోవడం కూడా వారికే చాతనయింది. వైఎస్ జగన్ అనే వ్యక్తిని నాయకుడిని చేసి, పార్టీ లీడర్ ను చేసి, స్వంత పార్టీ పెట్టుకునేలా చేసి, ఆఖరికి ముఖ్యమంత్రిగా మారి, తమనే తొక్కేలా చేసుకోవడం అంటే ఇంకేం అనాలి?
ఒక్కసారి గమనించండి. జగన్ ప్రస్థానం ఎలా సాగిందో?
అనుకోని దుర్ఘటనలో వైఎస్ మరణించారు. అవకాశం వస్తే పైకి ఎదగాలని అనుకునే మానవ నైజంతోనే జగన్ కూడా తన తండ్రి వారసత్వ పగ్గాలు చేపట్టాలనుకున్నారు. చంద్రబాబు బతికి వుండగానే లోకేష్ పగ్గాలు అందుకున్నారు. తప్పు లేదు. కానీ వైఎస్ మరణించాక మాత్రం జగన్ అందుకోకూడదు. అందుకే తెరవెనుక ఎవరెవరు ఏకం కావాలో అందరూ ఏకం అయ్యారు. పార్టీలకు అతీతంగా చేతులు కలిపారు. మంతనాలు సాగించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జగన్ చేతికి పగ్గాలు ఇవ్వకుండా చేసారు.
ఇది తొలిమెట్టు.
దాంతో జగన్ ఏం చేసారు. వేరు కుంపటి పెట్టుకున్నారు. లేదూ అలా జరగలేదు అనుకుందాం కాస్సేపు. అప్పుడు ఏం జరిగేది. జగన్ సిఎమ్ అయ్యేవారు. తెలంగాణ వచ్చేదో, రాదో పక్కన పెడితే, తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే అవకాశం వుండేది కాదు. ఎందుకూ? కాంగ్రెస్ లో హై కమాండ్ అనేది ఒకటి వుంటుంది కనుక. తెలంగాణ విడిపోకుండా వున్నా తెలుగుదేశానికి బాగుండేది. లేదూ విడిపోయినా, జగన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోకుండా ఓ అదుపు అనేది వుండేది.
అదీ కాక కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం ఆర్నెల్లో, ఏడాదో, రెండేళ్లకో జగన్ ను పక్కన పెట్టి మరొకర్ని సిఎమ్ ను చేసి వుండేవారు. అక్కడితో జగన్ అంకం ముగిసి వుండేది అనుకోవచ్చు.
కానీ అలా జరగలేదు.
దాంతో జగన్ కు స్వంత పార్టీ వచ్చింది. ఆ విధంగా జగన్ ఓ పార్టీకి అధ్యక్షుడు అయ్యారు.
పోనీ అలా వదిలేసారా? అంటే అదీ లేదు. ఎవరో ఒకరు కోర్టులో ఓ పిటిషన్ వేసారు. మామూలుగా అయితే ఏం జరిగేదో? మొత్తానికి కోర్టు తీగ లాగింది. అక్కడితో ఊరుకున్నారా? అదీ లేదు. తమ తమ సామాదాన ఉపాయాలు అన్నీ వాడేసారు. రోజూ దర్యాప్తు విశేషాలు ఊదరగొట్టారు. మొత్తానికి జగన్ జైలుకు వెళ్లేలా చేసారు. జైల్లో కూర్చోబెట్టారు. ఇందిర, జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ల విషయంలో ఏం జరిగిందో జగన్ విషయంలోనూ అదే జరిగింది. కావాల్సినంత సానుభూతి వచ్చింది.
జగన్ బయటకు వచ్చారు. ఎన్నికలు వచ్చాయి.
జగన్ వద్దు అనలేదు ప్రతిపక్షాలు కానీ, బాబుగారి మీడియా జనాలు కానీ. బాబుకు అనుభవం వుంది ఆయనకు అవకాశం ఇద్దాం అన్నారు. జనం కూడా సరే అన్నారు. ఇచ్చారు. మీ మాట ప్రకారం ఇచ్చాం, ఇప్పడు జగన్ కు ఇస్తాం అంటూ జగన్ ను సిఎమ్ ను చేసారు. ముందే జగన్ ను వద్దు అనలేదు. ముందుగా అనుభవానికి అవకాశం ఇవ్వమన్నారు. ఇచ్చారు.
పోనీ అధికారం వచ్చాక అయినా కర్నూలుకు కోర్టు, విశాఖకు ఎయిమ్స్ ఇచ్చి, మిగిలినవన్నీ అమరావతిలో పెట్టారా? అదీ లేదు. వచ్చిన ప్రతీదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తోసారు. దాంతో జనాలకు ఎక్కడ మండాలో అక్కడ మండింది. చాలు ఇక ఇంటికి వెళ్లమన్నారు.
అంటే ఓ సాదా వారసుడిని అలా వదిలేసి వుంటే ఏమయ్యేదో? పార్టీ పెట్టించి, అరెస్టు చేయించి, నాయకుడిని చేసి, అవకాశం దొరికేలా చేసిన ఘనత చంద్రబాబు అండ్ కో ది కాదా? అప్పుడే అలా వదిలేసి వుంటే కాంగ్రెస్ లోంచి బయటకు రాకుండా అందులోనే వుండి, అందులోనే మునిగి, అందులోనే తేలుతూ వుండిపోయేవాడేమో కాదా? ఆలోచించండి.
ఇది చంద్రబాబు అండ్ కో స్వయంకృతాపరాథం కాదా? జగన్ ను అతని మానాన అతన్ని కాంగ్రెస్ లో వదిలేసి వుంటే, వేరేగా వుండి వుండేది కచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ లో వుండి హేమా హేమీలే నిలబడలేకపోయారు. జగన్ కూడా అలాగే అయి వుండేవాడు. కానీ చంద్రబాబు అండ్ కో జగన్ ను అడుగు అడుగునా నిలవరించాలనే ఆలోచనతో ఎత్తులు, కుయక్తులు పన్ని అతన్ని హీరోని చేసారు. నాయకుడిని చేసారు. ఇప్పుడు తన నెత్తి మీదకు తెచ్చుకున్నారు.
ఇదే ఇప్పుడు తాజా టాపిక్
తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకులు ఇప్పుడు అంతర్గతంగా ఇదే పాయింట్ చర్చించుకుంటున్నారట. బాబుగారు, అనవసరంగా నేలకు పోయేది తీసుకొచ్చి నెత్తిన రాసుకున్నారు, జగన్ అనే వ్యక్తిని పెద్ద బూచిగా భావించి, ఆదిగి ముందే అణిచయాలని అనుకున్నారు.
'ఎందరో కులాభిమానులు' కలిసి పన్నాగాలు పన్ని చేయాల్సింది అంతా చేసారు. కానీ ఇప్పుడు అది కాస్తా వికటించి, జగన్ అనే వాడిని హీరోను చేసింది. మన అధికారం మీదకు తెచ్చింది..'' అన్నది తెలుగుదేశం నాయకుల ముక్తాయింపు అని రాజకీయ వర్గాల బోగట్టా.
వయసైపొతోంది
మరోపక్క చంద్రబాబు వయసైపొతోంది. ఆయనదే కాదు, తెలుగుదేశం పార్టీని ఇంతకాలం తమ గుప్పిట్లో వుంచుకున్న చాలా మంది నేతల వయసైపోతోంది. అంతే కాదు, తెలుగుదేశం మద్దతుగా వివిధ రంగాల్లో నిలిచి, తమ తమ లెవెల్ లో పార్టీకి స్లీపర్ సెల్స్ మాదిరిగా సేవలు అందిస్తున్న చాలా మందికి వయసైపోతోందని బోగట్టా. ఇలా అయితే మరో నాలుగేళ్ల తరువాత పార్టీ పరిస్థితి, పార్టీకి మద్దతు పరిస్థితి ఏమిటి? అన్నది ఆ పార్టీలో మరో డిస్కషన్ పాయింట్ గా వుంది.
జగన్ కు రాజకీయంగా లెక్కవేసుకుంటే ఇంకా బోలెడు వయసు వుంది. ఆయన పార్టీలో నాయకులది ఇదే పరిస్థితి. అందువల్ల ఫోరాటానికి అవసరమైతే మరో పదేళ్లు అయినా సిద్దంగా వుంటారు. కానీ తెలుగుదేశం పరిస్థితే అలా కనిపించడం లేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ ను చూస్తుంటే, భవిష్యత్ లో తెలుగుదేశం పరిస్థితి ఆలోచించాల్సి వస్తోంది. ఈ లెక్కన వచ్చే ఎన్నికల వేళకు తెలుగుదేశం పార్టీని మద్దతుగా వున్న సామాజిక వర్గ నేతలు ఏమైనా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, ఆ విధంగా ముందుకు వెళ్తారేమో అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయంటే, అందులోని గ్రౌండ్ రియాల్టీని అర్థం చేసుకోవచ్చు.
చాణక్య
[email protected]