అదేంటో కానీ కొంతమందికి నచ్చనిది ఏం జరిగిన జగన్ మోహన్ రెడ్డే కారణమంటున్నారు.
ప్రపంచమంతా కరోనా వచ్చినా ఆంధ్రలో వచ్చినందుకు మాత్రం జగనే కారణమన్నారు.
దేశమంతా బొగ్గు కొరత ఉన్నా జగనే కారణమంటున్నారు.
దేశం మొత్తం పెట్రోల్ రేటు పెరిగినా జగనే కారణం.
రేపు ఏదైనా సినిమా ఫ్లాపైనా జగనే కారణం.
ఆఖరికి “మా” ఎన్నికల్లో మంచు విష్ణు గెలిస్తే దానిని కూడా జగన్ కి లింక్ పెడుతున్నారు.
మంచు విష్ణుకి, జగన్ మోహన్ రెడ్డికి బంధుత్వం ఉంది కనుక విష్ణు గెలుపుకి జగన్నాటకసూత్రధారి జగనే అని పిచ్చి రాతలు కూడా రాసుకుంటున్నారు.
జగన్ ని ప్రేమించే వాళ్లు మోహన్ బాబుని ప్రేమించడానికి ఆలోచిస్తున్నారు కానీ, జగన్ ని ద్వేషించేవాళ్లు మోహన్ బాబుని ద్వేషించడానికి మాత్రం ఏమీ ఆలోచించట్లేదు.
ఇంతకీ వాళ్లిద్దరికీ ఉన్నది ఎలాంటి బంధుత్వం?
వై ఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురికి విష్ణు భర్త. అంటే విష్ణు కి జగన్ స్వయానా బావకూడా కాదు. ఏదో వేలు విడిచిన సంబంధం.
పోనీ జగన్ కి ఎంతటి సంబంధమైనా బంధుప్రీతి ఉందా అంటే అక్కడ సొంత చెల్లెలు షర్మిలకే దిక్కులేదు. అన్నగారితో పొసగక పక్క రాష్ట్రానికి వచ్చి మరీ సొంత రాజకీయపార్టీ పెట్టుకుంది.
సొంత చెల్లెలు కదా అని ఆవిడకి వైసీపీలో స్థానం కల్పించడమో, చంద్రబాబు దొడ్డిగుమ్మంలో కొడుకుని మంత్రిని చేసినట్టు చెల్లమ్మకి రాష్ట్రంలో అధికారాలు అప్పగించడమో చెయ్యలేదు.
పైగా జగన్ పదవిలోకి వచ్చి రెండున్నరేళ్లయ్యింది. ఎప్పటినుంచో మోహన్ బాబు తన తిరుపతి స్కూలుకి సంబంధించి ప్రభుత్వపరంగా రావాల్సిన కొంత మొత్తం గురించి తపస్సు చేస్తున్నాడు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబుని పచ్చిబూతులు తిట్టి మరీ జగన్ మనసుకి దగ్గరయ్యే ప్రయత్నం చేసాడు. కనీసం జగన్ పదవిలోకి వస్తే బంధుత్వం కార్డుని విసిరైనా తన సొమ్ము రాబట్టుకోవాలనుకున్నాడు. జగన్ పదిలోకి వచ్చాడు. కానీ ఇప్పటివరకూ మోహన్ బాబుకి ఏమీ పని జరగలేదు.
ఇప్పుడు “మా” ఎన్నికల ముందు ప్రచారంలో విష్ణుకి-జగన్ కి ఉన్న బంధుత్వం వల్ల విష్ణు ప్రెసిడెంటుగా ఎన్నికైతేనే సినీ పరిశ్రమకి ఆంధ్ర ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సిన మంచి జరుగుతుందని గెరిల్లా ప్రచారం చేసారు. నమ్మిన గొర్రెలు నమ్మారు.
ఇలాంటిదేదో జరుగుతోందని పసిగట్టి “అసలు మాకు, “మా”కు ఏం సంబంధం లేదు. ఎవరు గెలిచినా మాకు ఏం పట్టదు. సీయం గారికి అసలు దీని మీద ఎటువంటి ఆసక్తి లేదు” అని ఏకంగా అంధ్రప్రదేశ్ సినిమా మంత్రి ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటన చేసారు.
అయినా కూడా ఇప్పటికీ విష్ణు గెలుపుకి కారణం జగన్ మోహన్ రెడ్డి తంత్రమే అని నమ్ముతున్న పిచ్చిపీనుగులు ఉన్నారు.
ఒకవేళ ఇదే నిజమైతే గెలిచిన వెంటనే విష్ణు తన తండ్రిని వెంటబెట్టుకుని బాలకృష్ణని ఎందుకు కలుస్తాడు? పైగా “మా”బిల్డింగ్ కట్టడానికి బాలకృష్ణ భాగస్వామి అవుతానన్నాట్ట. తన వియ్యంకుడిని బండబూతులు తిట్టిన మోహన్ బాబుకి బాలకృష్ణ అంత మర్యాద చేసాడంటే లోగుట్టు ఏమిటో?
ఇక టీడీపీ సానుకూల మీడియా రాసే కథనాలు అద్భుతం. కాపుల్ని రెడ్లనుంచి దూరం చేయడానికి కమ్మ-రెడ్డి ఒకటైపోయారన్న కలర్ ఇవ్వడం అస్సలు అర్థం కాని పజిలు. ఒకపక్కన పవన్ కళ్యాణ్ కాపులు-కమ్మలు ఒకటవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క అధికార రెడ్లు-సినిమా కమ్మలు చుట్టాలనే ప్రచారం ముమ్మరమయ్యింది. ఇదంతా ఎల్లో మీడియా సృష్టిస్తున్న గందరగోళం.
ఎలా ఆడినా గెలవనప్పుడు బోర్డు మీదున్న పిక్కల్ని చెల్లాచెదురు చేసేసి లేచెళ్లిపోయే పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాయి టీడీపీ సానుకూల రాతలు.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి ఏం మేలు చేసినా అది విష్ణుతో బంధుప్రీతి మూలాన జరిగిందన్న అపవాదు వస్తుందనుకుని చెయ్యాలనుకున్నవి కూడా చెయ్యకపోవచ్చు జగన్ మోహన్ రెడ్డి. కొన్ని విషయాలు ప్రూవ్ చేయడానికి ఆయన ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలైనా తీసుకోవచ్చు.
వి. ప్రభాకర రెడ్డి